English   

పేప‌ర్ బాయ్ రివ్యూ

Paper-Boy-review
2018-08-31 09:17:44

సంప‌త్ నంది అంటే ర‌చ్చ సినిమానే గుర్తొస్తుంది ముందు. కానీ ఆ త‌ర్వాత ఆ స్థాయి చూపించ‌లేక‌పోతున్నాడు. ఇక ఇప్పుడు ద‌ర్శ‌కుడిగా కాకుండా రైట‌ర్ గా వ‌చ్చాడు. పేప‌ర్ బాయ్ అంటూ ప్రేమ‌క‌థ‌ను తీసుకొచ్చాడు. మ‌రి ఈ సినిమాతో ఆయ‌న ఎంత‌వ‌ర‌కు స‌క్సెస్ అయ్యాడు..? 

క‌థ‌: 

ర‌వి(సంతోష్ శోభ‌న్)ఓ పేప‌ర్ బాయ్. బి టెక్ చేసి కూడా బ‌త‌కడం కోసం పేప‌ర్లు వేస్తుంటాడు. పుస్త‌కాలంటే ఎక్కువ‌గా ఇష్ట‌ప‌డే ర‌వికి.. త‌న మాదిరే ఆలోచించే ధ‌ర‌ణి(రియా సుమ‌న్)పై ఇష్టం పెంచుకుంటాడు. చూడ‌కుండానే ఆమెతో ప్రేమ‌లో ప‌డ‌తాడు. ఆమె ఆలోచ‌న‌ల‌ను ఇష్ట‌ప‌డ‌తాడు. ధ‌ర‌ణికి విలువ ఇచ్చి వాళ్ల ప్రేమ‌కు ఇంట్లో వాళ్లు కూడా స‌రే అంటారు. పెళ్లికి అంతా సిద్ధ‌మ‌వుతున్న స‌మ‌యంలో ర‌వి ఊరి నుంచి వెళ్ళిపోతాడు. ఆ త‌ర్వాత ర‌వి రాసుకున్న డైరీ మేఘ(తాన్యాహోప్) చేతికి వ‌స్తుంది. వాళ్లిద్ద‌ర్నీ క‌ల‌ప‌డానికి మేఘ ముందుకొస్తుంది. త‌ర్వాత ఏమైంది అనేది అస‌లు క‌థ‌. 

క‌థ‌నం:

ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్ట‌నిది ప్రేమ‌క‌థ‌లు మాత్ర‌మే. చెప్పే తీరులో చెప్తే వంద‌ల‌సార్లు మ‌న‌సులో నాటుకుపోతాయి ఈ ప్రేమ‌క‌థ‌లు. మాస్ సినిమాలు చేసిన సంప‌త్ నంది.. ఎందుకో తెలియ‌దు కానీ స‌డ‌న్ గా రూట్ మార్చి ఇప్పుడు ప్రేమ‌క‌థ‌తో వ‌చ్చాడు. పేప‌ర్ బాయ్ అంటూ త‌న‌కే అల‌వాటు లేని జోన‌ర్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. అయితే అది అంత‌గా ఆక‌ట్టుకోలేదు. ఫ‌స్టాఫ్ లో శివ‌మ‌ణి త‌ర‌హాలో క‌థ‌ను మొద‌లుపెట్టాడు. అక్క‌డ ర‌క్షిత‌కు ఓ బాటిల్ దొరికి క‌థ మొద‌లవుతుంది.. ఇక్క‌డ డైరీతో క‌థ మొద‌ల‌వుతుంది. పేప‌ర్ బాయ్ క‌థేంటి.. ఎలా ప్రేమ‌లో ప‌డ్డారు.. పెద్ద‌లు ఎలా ఒప్పుకున్నారు.. ఇవ‌న్నీ రొటీన్ గా అనిపించినా కూడా ప‌స్టాఫ్ కాస్త రీ ఫ్రెషింగ్ గానే అనిపిస్తుంది కానీ సెకండాఫ్ మాత్రం మరీ దారుణంగా తెర‌కెక్కించాడు ద‌ర్శ‌కుడు. అర్థం ప‌ర్థం లేని కామెడీ సీన్ల‌తో క‌థ‌ను ప‌క్క‌దారి ప‌ట్టించాడు. బిత్తిరిస‌త్తికి హీరో రేంజ్ లో బిల్డ‌ప్ ఏంటో.. ప‌ది నిమిషాల ఫైట్ ఏంటో.. విద్యుల్లేక రామ‌న్ తో అస‌లు క‌థ‌కు సంబంధం లేకుండా ప్రేమ‌క‌థేంటో వాళ్లుకే తెలియాలి. క్లైమాక్స్ కూడా ముందే ఊహించ‌డంతో నార్మ‌ల్ గా ముగుస్తుంది. 

న‌టీన‌టులు:

సంతోష్ శోభ‌న్ బాగున్నాడు.. బాగా న‌టించాడు కూడా. కాక‌పోతే ఆయ‌న నిరూపించుకోవాలంటే ఓ హిట్ సినిమా రావాలి. అది వ‌చ్చిన‌పుడే ఈ కుర్రాడికి మంచి రోజులు. హీరోయిన్ రియా సుమ‌న్ మ‌జ్నుతో పోలిస్తే ఇందులో బాగా చేసింది. తాన్యాహోప్ అచ్చంగా శివ‌మ‌ణి సినిమాలో ర‌క్షిత త‌ర‌హా పాత్రలో న‌టించింది. హీరో ఫ్రెండ్స్ గ్యాంగ్ గ్యాప్ లో వ‌చ్చి న‌వ్వించే ప్ర‌య‌త్నం చేసారు.. కానీ కుద‌ర్లేదు. మిగిలిన వాళ్లంతా ఓకే. 

టెక్నిక‌ల్ టీం:

సినిమాకు ప్ర‌ధాన బ‌లం సౌంద‌ర్ రాజ‌న్ సినిమాటోగ్ర‌ఫీ. చిన్న సినిమా అయినా కూడా నెక్ట్స్ లెవ‌ల్లో విజువ‌ల్స్ ఇచ్చాడు. ఇక భీమ్స్ సంగీతం ప‌ర్లేదు. బొంబై పోతావా రాజా పాట బాగుంది. విజువ‌ల్ గా పాట‌లు బాగున్నాయి. త‌మ్మిరాజు ఎడిటింగ్ వీక్ గా అనిపించింది. సెకండాఫ్ లో చాలా సీన్లు క‌థ‌కు అడ్డు ప‌డుతుంటాయి. బిత్తిరిస‌త్తి ఎపిసోడ్ తీసేయొచ్చేమో అనిపిస్తుంది. ర‌చ‌యిత‌గా సంప‌త్ నంది ఆక‌ట్టుకోలేదు. పాత క‌థ రాసి ప్రేక్ష‌కుల స‌హ‌నానికి పరీక్ష పెట్టాడు. ఆక‌ట్టుకునే విధంగా తీయ‌డంలో ద‌ర్శ‌కుడు విఫ‌లం అయ్యాడు. 

చివ‌ర‌గా: పేప‌ర్ బాయ్ ప్రేమక‌థ ఆక‌ట్టుకోలేదు బాసూ..!

రేటింగ్: 2/5 

More Related Stories