English   

విజయ్ దేవరకొండతో రాశిఖన్నా కన్ఫార్మ్.. 

Vijay-Devarakonda-Raashi-Khanna
2018-09-03 19:16:40

ఎట్టకేలకు విజయ్ దేవరకొండ సరసన నటించడానికి ఒప్పుకుంది రాశిఖన్నా.. విజయ్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ ‘గీత గోవిందం’లో ముందుగా రాశినే అనుకున్నారు.. కానీ అమ్మడు కోటి రూపాయల రెమ్యూనరేషన్ అడిగింది అనే వార్తలు ఆ మధ్య వినిపించాయి. కానీ అవన్నీ నిజం కాదు అని కొట్టిపారేసిందీ బ్యూటీ. అయితే ఇప్పుడు మాత్రం వచ్చిన అవకాశాలన్ని వదులకోవడం లేదు. పైగా విజయ్ తో నటించడం తన లక్ అని చెబుతోంది. టాలెంట్ పవర్ హౌస్ లాంటి విజయ్ తో యాక్ట్ చేయబోతున్నందుకు ఎగ్జైటింగ్ గా ఉందంటూ రాశిఖన్నా ట్వీట్ చేసింది. రీసెంట్ గా ఈ ఇద్దరూ కలిశారట. తాము కలిసి నటించబోయే స్క్రిప్ట్ గురించి డిస్కస్ చేసుకున్నట్టు కూడా చెప్పింది. ఇంతకీ రాశిఖన్నా, విజయ్ దేవరకొండ కలిసి నటించబోయే సినిమా ఏంటీ అనే కదా మీ డౌట్.. 

పెళ్లి చూపులు తర్వాత విజయ్ దేవరకొండ క్రియేట్ కమర్షియల్ బ్యానర్ లో ఓ సినిమా చేయడానికి కమిట్ అయ్యాడు. అప్పటికి మనోడికి ఏ క్రేజూ లేదు. తర్వాత అర్జున్ రెడ్డితో సంచలనం సృష్టించాడు. లేటెస్ట్ గా గీత గోవిందంతో కలెక్షన్ల సునామీ క్రియేట్ చేశాడు. ప్రస్తుతం అతను టాప్ స్టార్. కానీ ఆల్రెడీ కమిట్ అయిన ప్రాజెక్ట్స్ చేయక తప్పదు కదా.. అందుకే ఈ సినిమా కూడా పట్టాలెక్కబోతోంది. ఇక యాక్టర్ గా తిరుగులేని టాలెంట్  చూపించే విజయ్ కి మరోసారి తన టాలెంట్ చూపించే స్క్రిప్ట్ రెడీగా ఉంది. రెండు సినిమాలతోనే టాలీవుడ్ లో తనకంటూ ఓ మార్క్ క్రియేట్ చేసుకున్న దర్శకుడు క్రాంతి మాధవ్. ఓనమాలు, మళ్లీమళ్లీ ఇది రాని రోజు సినిమాలతో విమర్శకుల ప్రశంసలు కూడా అందుకున్న క్రాంతి మాధవ్ రీసెంట్ మూవీ ‘ఉంగరాల రాంబాబు’ పోయినా అతనికి డ్యామేజ్ జరగకపోవడం విశేషం. 

మొత్తంగా కెఎస్ రామారావు నిర్మాతగా, క్రాంతి మాధవ్ డైరెక్షన్ లో విజయ్ దేవరకొండ, రాశిఖన్నా జంటగా ఓ సినిమా త్వరలోనే పట్టాలెక్కబోతోందన్నమాట. ఈ విషయాన్ని హీరోయిన్నే డిక్లేర్ చేసింది కాబట్టి.. ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లడానికి ఆట్టే టైమ్ కూడా పట్టదనుకోవచ్చు. మరి ఈ గోవిందం సరసన ఛాన్స్ మిస్ చేసుకున్న రాశిఖన్నాకు ఈ సారి లక్ ఎలా ఉంటుందో చూడాలి. 

More Related Stories