English   

కేరాఫ్ కంచర‌పాలెం రివ్యూ

Care-of-Kancharapalem
2018-09-06 05:47:58

కేరాఫ్ కంచ‌ర‌పాలెం.. కొన్ని రోజులుగా ఇండ‌స్ట్రీలో ఈ చిత్రం గురించి చాలా చ‌ర్చ‌లే వినిపిస్తున్నాయి. మూడు నెల‌ల ముందు నుంచి ప్రీమియ‌ర్ షోస్ కూడా ప‌డుతున్నాయి. ఈ చిత్రం ఇప్పుడు విడుద‌లైంది. మ‌రి ప్రేక్ష‌కుల మ‌నసు కేరాఫ్ కంచ‌ర‌పాలెం దోచుకుందా లేదా అనేది చూద్దాం.. 

కథ :

రాజు కంచ‌ర‌పాలెంలోనే ఉంటాడు. ఓ గ‌వ‌ర్న‌మెంట్ ఆఫీస్ లో అటెండ‌ర్ గా ప‌ని చేస్తుంటాడు. 49 ఏళ్లొచ్చినా ఇంకా పెళ్లి కాదు ఆయ‌న‌కు. దాంతో ఊళ్లో వాళ్లంతా వెక్కిరిస్తుంటారు. అలాంటి టైమ్ లో రాజు జీవితంలోకి వ‌స్తుంది రాధా. ఆమె అదే ఆఫీస్ లో ఆఫీస‌ర్. వీళ్ళ క‌థ‌తో పాటే అదే ఊళ్లో మ‌రో మూడు ప్రేమ‌క‌థలు కూడా జ‌రుగుతుంటాయి. ప‌దేళ్ల పిల్ల‌లు సునీత – సుందరం.. 20 ఏళ్ల జంట జోసెఫ్ – భార్గవి.. 30 ఏళ్ల జంట‌ గడ్డం – సలీమా ప్రేమకథలు కూడా రాజు ప్రేమ‌క‌థ‌తో పాటే న‌డుస్తుంటాయి. ఒక ప్రేమ‌క‌థ‌లో వ‌య‌సు.. మ‌రో ప్రేమ‌లో కులం.. ఇంకో ప్రేమ‌క‌థలో మతం అడ్డుకుంటుంది. అస‌లు ఈ సామాజిక అడ్డుగోడ‌ల‌ను పెకిలించి ఈ జంట‌లు ఒక్క‌ట‌య్యాయా లేదా అనేది అస‌లు క‌థ‌.. 

క‌థ‌నం:

కేరాఫ్ కంచ‌రపాలెం రెగ్యులర్ క‌మ‌ర్షియ‌ల్ సినిమా కాదు. ఇలాంటి సినిమాలు చేయ‌డానికి కాదు.. ముందు ఇలాంటి క‌థ రాయ‌డానికి కూడా ధైర్యం కావాలి. స‌మాజంలో జ‌రుగుతున్న ప్ర‌తీ ఇష్యూను ఇందులో చూపించాడు ద‌ర్శ‌కుడు. రాజు క‌థ‌తో ఈ సినిమా మొద‌ల‌వుతుంది. క‌థ‌లో కామెడీ ట్రాక్ లు లేక‌పోయినా కూడా క‌థ‌తో పాటే కామెడీ వ‌స్తుంది. ఊరి మాట‌ల్లో ఉండే తీయ‌ద‌నం క‌నిపిస్తుంది. తొలి ప‌ది నిమిషాల్లోనే క‌థ‌లోకి తీసుకెళ్తాడు ద‌ర్శ‌కుడు. అక్క‌డ్నుంచి ఆ పాత్ర‌ల‌తో వెళ్లిపోవ‌డ‌మే మ‌నం చేయాల్సిన ప‌ని. ఓ వైపు రాజు-రాధా.. మ‌రోవైపు అదే స‌మ‌యంలో ప‌దేళ్ల పిల్ల‌లు సునీత – సుందరం.. 20 ఏళ్ల జంట జోసెఫ్ – భార్గవి.. 30 ఏళ్ల జంట‌ గడ్డం – సలీమా ప్రేమకథలు కూడా రాజు ప్రేమ‌క‌థ‌తో పాటే స‌మాంత‌రంగా న‌డిపించ‌డంలో ద‌ర్శ‌కుడి తెలివితేట‌లు ఎంతో తెలుస్తుంది. ఈ ప్రేమ‌క‌థ‌ల‌న్నింటికి క్లైమాక్స్ లో ద‌ర్శ‌కుడు ఇచ్చిన స‌మాధానంతో ప్రేక్ష‌కుల బుర్ర‌లు ఒక్క‌సారిగా హీట్ ఎక్కిపోతాయి. అప్పుడు లేచి నిల‌బ‌డి క‌చ్చితంగా ఆ ద‌ర్శ‌కుడి స్క్రీన్ ప్లేకు స‌లాం చెప్ప‌కుండా ఉండ‌లేరు. ప‌దేళ్ల పిల్లాడికి దేవుడు ఏం అడిగినా ఇస్తాడ‌ని అనుకుంటాడు. కానీ ఇవ్వ‌న‌పుడు ఆ దేవుడితోనే గొడ‌వ‌ప‌డ‌తాడు. ఆ త‌ర్వాత కులం పేరుతో ఓ జంట‌ను విడ‌దీస్తారు.. మ‌తం పేరుతో ఓ ప్రేమ‌ను చంపేస్తారు.. ఇన్ని క‌థ‌ల‌ను వ్య‌థ‌ల‌ను ఒక్క క‌థ‌లో చూపించిన ద‌ర్శ‌కుడి తెలివికి నిజంగా హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. ఎమోష‌న్స్ కూడా కేరాఫ్ కంచ‌ర‌పాలెంలో చాలానే ఉన్నాయి. క‌థ రివీల్ చేయ‌కూడ‌దు కాబ‌ట్టి ఏం చెప్ప‌ట్లేదు కానీ ఒక్క చిన్న ట్విస్ట్ తో సినిమాను అల్లుకున్న తీరు అద్బుత‌మే. అయితే తెలిసిన మొహాలు లేక‌పోవ‌డం.. క‌థ కాస్త నెమ్మ‌దిగా సాగ‌డం ఒక్క‌డే కేరాఫ్ కంచ‌ర‌పాలెంకు మైన‌స్.

న‌టీన‌టులు:

ఇందులో ఉన్న వాళ్లంతా కొత్త‌వాళ్లే. ఎవ‌రికీ సినిమా అనుభ‌వం ఉన్న‌ట్లు క‌నిపించ‌లేదు. అంతా న్యాచుర‌ల్ గా న‌టించారు. ఒక్కో పాత్ర‌లో అంతా ప్రాణం పోసారు. ముఖ్యంగా రాజు పాత్ర‌ధారి అయితే సినిమాను న‌డిపించాడు. ఆయ‌న‌తో పాటు ప్ర‌తీ పాత్ర కూడా ఫుల్ ఎమోష‌న్ తో సాగింది. పిల్ల‌ల నుంచి పెద్ద‌ల వ‌ర‌కు ప్ర‌తీ పాత్ర‌లోనూ క‌థ‌ను ఇమిడ్చాడు ద‌ర్శ‌కుడు. అంతా కొత్త వాళ్లు కావ‌డం.. అందులోనూ డ్రామా ఆర్టిస్టులు కావ‌డం తో పేర్లు చెప్ప‌డం క‌ష్టమే. 

టెక్నిక‌ల్ టీం:

కేరాఫ్ కంచ‌ర‌పాలెంకు మెయిన్ పిల్ల‌ర్ సంగీత ద‌ర్శ‌కుడు స‌్వీక‌ర్ అగ‌స్తి. ఈయ‌న పాట‌లు ఆక‌ట్టుకున్నాయి. ముఖ్యంగా టైటిల్స్ లో వ‌చ్చేప్పుడు వ‌చ్చే పాట అద్భుతంగా ఉంది. మిగిలిన పాట‌లు కూడా సంద‌ర్భానుసారంగా వ‌చ్చాయి. సినిమాటోగ్ర‌ఫీ బాగుంది. సినిమాటోగ్రఫర్ ఆదిత్య జ‌వ్వాడి అండ్ వ‌రుణ్ ఛాపేక‌ర్ త‌మ ప‌నులు చ‌క్క‌గా నిర్వ‌ర్తించారు. ఎడిటర్ రవితేజ గిరిజిల ప‌నితీరు బాగుంది. ద‌ర్శ‌కుడిగా వెంక‌టేశ్ మ‌హా తొలి సినిమాతోనే ఇండ‌స్ట్రీకి కొత్త టాలెంట్ అంటే ఏంటో చూపించాడు.

చివ‌రగా: కేరాఫ్ కంచ‌ర‌పాలెం.. మ‌న‌సుకు హ‌త్తుకుపోయే ఓ కూనిరాగం..!

More Related Stories