English   

అదిరింది అల్లుడు.. అమెరికాలో అరాచ‌కం..!

Naga Chaitanya's Shailaja Reddy Alludu Massive Release in Overseas
2018-09-07 06:06:03

నాగ‌చైత‌న్య సినిమా అంటే హిట్ టాక్ వ‌చ్చిన త‌ర్వాత కానీ క‌లెక్ష‌న్లు రావ‌డం మొద‌లు కాదు. పైగా విడుద‌ల కూడా చాలా త‌క్కువ స్క్రీన్స్ లోనే అవుతుంది. ఇక ఓవ‌ర్సీస్ లో అయితే చాలా లిమిటెడ్ స్క్రీన్స్ లో విడుద‌ల చేసి హిట్ టాక్ వ‌స్తే పెంచుతుంటారు. కానీ శైల‌జారెడ్డి అల్లుడు మాత్రం ముందు నుంచే ట్రెండింగ్ లో ఉన్నాడు. మారుతి తెర‌కెక్కిస్తోన్న ఈ సినిమాపై అంచ‌నాలు భారీగా ఉన్నాయి. మారుతి బ్రాండ్ కు తోడు చైతూ క్రేజ్ కూడా అల్లుడుకు బాగానే ప్ల‌స్ అవుతుంది. అన్నింటికీ మించి ర‌మ్య‌కృష్ణ అత్త‌గా న‌టించ‌డం.. అత్తా అల్లుళ్ల కాన్సెప్ట్.. మారుతి కామెడీ ఇవ‌న్నీ సినిమా ఎలా ఉండ‌బోతుందా అనే ఆస‌క్తి పెంచేస్తుంది. పైగా ట్రైల‌ర్ నిండా కామెడీతో నిండిపోయింది. దానికితోడు నాగ‌చైత‌న్య తొలిసారి పూర్తిస్థాయి కామెడీ రోల్ చేయ‌డం కూడా సినిమాకు క‌లిసొచ్చే అంశం.

ట్రైల‌ర్ పూర్తిగా మాస్ ట‌చ్ లో ఉండ‌టంతో వెంట‌నే క‌నెక్ట్ అయిపోయింది. అను ఎమ్మాన్యువ‌ల్ ఇందులో చైతూకు జోడీగా న‌టిస్తుంది. ఇగో ఎక్కువ‌గా ఉన్న అమ్మాయి పాత్ర‌లో న‌టిస్తుంది ఈమె. హీరోయిన్ కంటే ఆమె అమ్మ‌కు మ‌రో రెండు ట‌న్నులు ఇగో ఎక్కువ‌గా ఉంటుంది. ఈ ఇద్ద‌రి ఇగోను హీరో ఎలా అణిచాడు అనేది క‌థ‌. సెప్టెంబ‌ర్ 13న ఈ సినిమా విడుద‌ల కానుంది. అమెరికాలో అయితే నాగ‌చైత‌న్య కెరీర్ లోనే బిగ్గెస్ట్ రిలీజ్ కానుంది ఈ చిత్రం. అక్క‌డ ఏకంగా 173 లొకేష‌న్స్ కు పైగానే విడుద‌ల‌కు సిద్ధ‌మైంది అల్లుడు. ఈ సినిమాను అక్క‌డ ఎల్ఏ తెలుగు తీసుకుంది. ఎవ‌రూ ఊహించ‌ని రేంజ్ లో ఈ సినిమాను విడుద‌ల చేస్తున్నారు వాళ్లు. ఈ సినిమాతో సోలో హీరోగా మిలియ‌న్ మార్క్ అందుకోవాల‌ని చూస్తున్నాడు నాగ‌చైత‌న్య‌.

More Related Stories