English   

సామి స్క్వేర్ లో చాలా ట్విస్టులున్నాయే.. 

Vikram
2018-09-08 13:59:28

హ‌రి సినిమా అంటే ట్విస్టులు పెద్ద‌గా ఊహించ‌కూడ‌దు. ప్లాట్ స్టోరీ.. అంత‌కంటే ప్లాట్ కామెడీ.. కాక‌పోతే వేగంగా సాగే స్క్రీన్ ప్లే ఉంటుంది. ఏ మాత్రం కొత్త‌ద‌నం లేని క‌థ‌ల‌ను కూడా కేవ‌లం త‌న స్క్రీన్ ప్లే మాయ‌తో హిట్ చేస్తుంటాడు ఈ ద‌ర్శ‌కుడు. ఇప్పుడు సామి 2 కూడా ఇలాగే ఉంటుంద‌ని ఫిక్స్ అయిపోయారంతా. విక్ర‌మ్ హీరో అయినా కూడా 14 ఏళ్ల కింద వ‌చ్చిన సినిమాకు సీక్వెల్ కావ‌డంతో కొత్త‌ద‌నం కోసం ట్రై చేసి ఉండ‌డు.. అంతా అదే రొటీన్ మూస‌లోనే వెళ్ళిపోతాడేమో అనుకున్నారంతా. పైగా ట్రైల‌ర్ కూడా మాస్ గా ఉండ‌టంతో ఇదే నిజం అని ఫిక్సైపోయారు. అయితే విడుద‌ల తేదీ ద‌గ్గ‌ర ప‌డుతుంటే ఇప్పుడు అస‌లైన ట్విస్టులు ఇస్తున్నాడు హ‌రి. 

ఈ చిత్రంలో విక్ర‌మ్ ద్విపాత్రాభిన‌యం చేస్తున్నాడ‌ని తెలుస్తుంది. పైగా ఒక‌టి ప‌వ‌ర్ ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్. టైటిల్ కూడా సామి స్క్వేర్ అన్నాడు.. అంటే ఇద్ద‌రు అని అర్థం. ఇక కీర్తిసురేష్ ఇందులో లండ‌న్ నుంచి వ‌చ్చిన అమ్మాయిగా న‌టిస్తుంది. నేష‌న‌ల్ అవార్డ్ విన్నింగ్ యాక్ట‌ర్ బాబీసింహా ఇందులో విల‌న్ రావ‌న‌న్ పిచాయ్ గా న‌టిస్తున్నాడు. విక్ర‌మ్, సింహా మ‌ధ్య వ‌చ్చే సీన్స్ అన్నీ ఆస‌క్తికరంగా ఉంటాయంటున్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ తో బిజీగా ఉన్న సామి స్క్వేర్ సెన్సార్ కోసం వేచి చూస్తుంది. అది పూర్తైతే అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తి చేసి విడుద‌ల తేదీ అనౌన్స్ చేయ‌నున్నాడు ద‌ర్శ‌కుడు హ‌రి. మ‌రి ఈ మ‌ధ్య కాలంలో హిట్ మొహ‌మే తెలియ‌ని విక్ర‌మ్ కు ఈ సినిమాతో హిట్ ఇస్తాడా హ‌రి..? 

More Related Stories