English   

వేడెక్కిన త‌మిళ రాజ‌కీయం.. విజ‌య్ ఎంట్రీ..

Ilayathalapathy-Vijay
2018-09-09 14:43:29

త‌మిళ‌నాడులో ఏదైనా అరాచ‌క‌మే. వాళ్ల ప్రేమ‌ను.. కోపాన్ని.. అభిమానాన్ని ఏది త‌ట్టుకోలేం. అన్నీ భ‌రించ‌లేనంత‌గా చూపిస్తుంటారు. ఇప్పుడు త‌మిళ‌నాట రాజ‌కీయ చ‌ద‌రంగం న‌డుస్తుంది. అక్క‌డ సినిమా వాళ్ల రాజ‌కీయాలే ఎక్కువ‌గా న‌డుస్తున్నాయిప్పుడు. జ‌యల‌లిత చ‌నిపోయాక త‌మిళ రాజ‌కీయాలు చుక్కాని లేని నావ‌లా మారిపోయాయి. ఎవ‌ర్నీ న‌మ్మాలో.. ఎవ‌రికి ప‌ట్టం కట్టాలో తెలియ‌ని సందిగ్ధ ప‌రిస్థితుల్లో ప‌డిపోయారు ఓట‌ర్లు కూడా. ఇలాంటి టైమ్ లో సినిమా వాళ్లు రాజ‌కీయాలు చేస్తున్నారు. ఇన్నాళ్లూ తెర‌పై న‌టించిన వాళ్లు.. ఇప్పుడు నిజ జీవితంలోకి వ‌చ్చి రాజ‌కీయం చేస్తామంటున్నారు. ఇప్ప‌టికే క‌మ‌ల్ హాస‌న్ కొత్త‌పార్టీ పెట్టాడు. 

ఇక ర‌జినీకాంత్ కూడా రాజ‌కీయాల్లోకి వ‌చ్చాడు. మొన్న‌టి వ‌ర‌కు రాజ‌కీయాలు తెలియ‌వ‌ని.. అటువైపు త‌న అడుగు ప‌డ‌ద‌ని చెప్పుకొచ్చాడు ర‌జినీకాంత్. కానీ త‌మిళ‌నాట ఇప్పుడు ఓ ర‌క‌మైన రాజ‌కీయ శూన్య‌త ఏర్ప‌డింది. అమ్మ మ‌ర‌ణం.. ఆ త‌ర్వాత క‌రుణానిధి క‌న్నుమూత‌తో కుర్చీ కోసం శ‌శిక‌ళ‌, ప‌నీర్ సెల్వం పోరు.. ఇలా ఎటూ దిక్కుతోచ‌ని అనాధ‌లా మారిపోయాయి త‌మిళ రాజ‌కీయాలు. ఇప్పుడు గ‌న‌క సూప‌ర్ స్టార్ కాస్త మ‌న‌సు పెడితే రాజ‌కీయంగా శ‌క్తిగా ఎదిగే అవ‌కాశం ఉందంటున్నారు విశ్లేష‌కులు. అయితే ర‌జినీ మాత్రం దీనికి సుముఖంగా లేడు. త‌న పార్టీని తీసుకెళ్లి బిజేపీలో క‌లిపేలా క‌నిపిస్తున్నాడు. 

ర‌జినీ సంగ‌తి ఇలా ఉంచితే ఇళ‌య‌ద‌ళ‌ప‌తి విజ‌య్ కూడా రాజ‌కీయాల‌పై చాలా కాలంగా మ‌క్కువ చూపిస్తున్నారు. కానీ విజ‌య్ ని అతడి తండ్రి చంద్ర‌శేఖ‌ర్ ఆపుతున్నాడు. ఇప్ప‌టికే ఓసారి జ‌య‌ల‌లిత పార్టీకి.. మ‌రోసారి క‌రుణానిధికి స‌పోర్ట్ కూడా చేసాడు విజ‌య్. పైగా ఈ మ‌ధ్య ఎక్క‌డికి వ‌చ్చినా కూడా అభిమానులు విజ‌య్ కాబోయే సిఎం అంటూ నినాదాలు చేస్తున్నారు. ఇప్పుడు ఈయ‌న కూడా సీరియ‌స్ గా లోలోపే రాజ‌కీయ అరంగేట్రానికి అంతా సిద్ధం చేసుకుంటున్నార‌ని తెలుస్తుంది. ఈ మ‌ధ్యే విశాల్ కూడా కొత్త పార్టీ అనౌన్స్ చేసాడు. ఈయ‌న పోటీ చేస్తాడా లేదా అనేది ఇంకా క్లారిటీ రాలేదు. ఇలా ఇప్పుడు అర‌వ‌నేల‌పై సినీ రాజ‌కీయాలు ఎక్కువైపోతున్నాయి. 

More Related Stories