English   

శైలజా రెడ్డి అల్లుడుపై నాగ్ గుస్సా..?

Shailaja-Reddy-Alludu
2018-09-10 17:53:53

శైలజారెడ్డి అల్లుడు అన్ని విధాలా రెడీ అయ్యాడు. లేటెస్ట్ గా జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా విజయవంతమైంది. మరోవైపు ఇవాళ ఈ మూవీ సెన్సార్ కూడా పూర్తయింది. అయితే సెన్సార్ నుంచి వస్తోన్న టాక్ ను బట్టి ఈ మూవీ నాగార్జున అనుకున్నట్టుగానే ఉందనే టాక్ వచ్చింది. అంటే నాగార్జున ఏమనుకున్నాడు అనే కదా మీ డౌట్. యస్ నాగ్ కు ఈ సినిమాపై డౌట్ ఉందట. ఈ విషయం ఆయన ఎప్పుడో చెప్పాడట కూడా. కానీ తను నిర్మాత కాదు.. అందువల్ల దర్శకుడ్ని కమాండ్ చేయలేకపోయాడు. అటు ప్రొడ్యూసర్స్ కూడా చిన్నవాళ్లేమీ కాదు. అందువల్ల గట్టిగా హెచ్చరించలేకపోయాడట. కానీ లేటెస్ట్ గా ఆయన ఫస్ట్ ప్రింట్ చూసిన తర్వాత పూర్తిగా నిరాశ చెందాడనే మాటలు వినిపిస్తున్నాయి. అలాగని సినిమా మరీ అస్సలు బాలేదనేం కాదు. కానీ ఆశించినంత గొప్పగా ఏం లేదట. ఈ విషయంలో దర్శకుడు మారుతిపై నాగార్జున గుస్సా అయ్యాడనే గుసగుసలు వినిపిస్తున్నాయి. 

నాగచైతన్య చాలా ఆశలు పెట్టుకున్న ఈ సినిమాలోని పాత్రల్లాగే దర్శకుడు కూడా కొందరు చెప్పిన మాట వినకుండా ఈగోకు పోయాడని.. అందువల్లే సినిమా అనుకున్నంత గొప్పగా ఏం రాలేదనే టాక్ బలంగా వినిపిస్తోంది. మరి ఇందులో నిజమెంతో కానీ.. లేటెస్ట్ గా సెన్సార్ నుంచి కూడా దాదాపు ఇదే టాక్ వినిపిస్తుండటంతో ఇప్పుడు చైతూ అండ్ సితారా ప్రొడక్షన్ వాళ్లు టెన్షన్ పడిపోతున్నారంటున్నారు.

ఈ నెల 13న విడుదల కాబోతోన్న శైలజా రెడ్డి అల్లుడుకు సెన్సార్ నుంచి ‘‘యూ/ఏ’’ సర్టిఫికెట్ వచ్చింది. నిజానికి ఇది అత్తా అల్లుళ్ల మధ్య పోరు కాదనీ.. 80స్, 90స్ టైప్ లో రొటీన్ గా అత్తా అల్లుళ్లు గిల్లి కజ్జాల నడుమ తీసిన సినిమా కాదని మారుతి ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో చెప్పాడు. మరి అలాంటప్పుడు టైటిల్ మైనస్ అవుతుందనే కదా. కానీ ఓ లవ్ స్టోరీతో మెప్పించానని.. ఆ ప్రేయసీ ప్రియులిద్దరూ కలిసి శైలజా రెడ్డిని ఎలా ఒప్పించారనేదే కథ అన్నాడు. అప్పుడు శైలజా రెడ్డి పాత్ర ట్రైలర్ లో చెప్పినట్టు ఈగోయిస్ట్ కదా.. అంటే అల్లుడుని ఓ పట్టాన ఒప్పుకోదనే కదా.. ఇలా తనకు తనే కన్ఫ్యూజన్ లో చెప్పిన మారుతి మాటలు కూడా నాగార్జున ఒపీనియన్ ను బలపరుస్తున్నాయి. మొత్తంగా మారుతిపైనా నాగార్జున కాస్త గుస్సా అయ్యాడనీ.. అందుకే ఆయన ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో ఎక్కువ సేపు లేడనీ.. వెంటనే వెళ్లిపోయాడని చెబుతున్నారు. మరి ఈ మాటల్లో నిజమెంత అనేది తెలియాలంటే సెప్టెంబర్ 13 వరకూ ఆగాల్సిందే. 

More Related Stories