English   

యూ ట‌ర్న్ రివ్యూ  

U-Turn-Review
2018-09-13 10:20:05

ఓ సినిమా కోసం రెండేళ్లు స‌మంత లాంటి స్టార్ హీరోయిన్ వేచి చూసిందంటే అందులో ఏం ఉందబ్బా అని అంతా చూసారు. ఇప్పుడు ఆ ఎదురు చూపుల‌కు తెర‌దించుతూ యు ట‌ర్న్ సినిమా వ‌చ్చింది. మ‌రి ఈ సినిమా నిజంగానే స‌మంత పెట్టుకున్న ఆశ‌ల‌ను నిల‌బెట్టిందా..? 

క‌థ‌:  ర‌చ‌న‌(స‌మంత‌) ఓ న్యూస్ రిపోర్ట‌ర్. వ‌ర‌సగా మిస్ట‌రీ డెత్స్ జ‌రుగుతున్న ఆర్కే పురం ఫ్లై ఓవ‌ర్ గురించి ఓ క‌థ రాస్తుంటుంది. దాని కోసం రాంగ్ యు ట‌ర్న్ చేస్తున్న వాళ్ల గురించి ఆరా తీస్తుంది. అలా ఆమె ఆరా తీసిన కార‌ణంగా అనుకోకుండా మ‌ర్డ‌ర్ కేస్ లో ఇరుక్కుంటుంది. పోలీసులు కూడా ర‌చ‌న ఈ మ‌ర్డ‌ర్ చేసింద‌నుకుంటారు. కానీ ఆ త‌ర్వాత ఈమె హంత‌కురాలు కాద‌ని తెలుసుకుంటారు. ఈ కేస్ లో ర‌చ‌న‌కు అన్ని విధాల హెల్ప్ చేస్తుంటాడు పోలీస్ ఆఫీస‌ర్ నాయ‌క్(ఆది పినిశెట్టి). తీరా అదే స‌మ‌యంలో ఈ మ‌ర్డ‌ర్స్ కు కార‌ణం ఓ ఐదేళ్ల పాప అని తెలుస్తుంది. ఆమె త‌ల్లి (భూమిక చావ్లా) తో క‌లిసి ఇదంతా చేస్తుంటారు. అస‌లేంటి ఈ మ‌ర్డ‌ర్ మిస్ట‌రీ అనేది అస‌లు క‌థ‌.. 

విశ్లేష‌ణ‌: రోజూ చాలా మంది సిగ్న‌ల్స్ క్రాస్ చేస్తుంటారు.. రాంగ్ యు ట‌ర్న్ తీసుకుంటారు. వాటి వ‌ల్ల మ‌న‌కు తెలియ‌కుండానే ఎన్నో ప్ర‌మాదాల‌కు కార‌ణం అవుతుంటాం. అలా తెలియ‌కుండా చేసే ఒక్క చిన్న త‌ప్పు జీవితాల‌ను చిధిమేస్తుంటుంది. ఇదే లైన్ ను క‌థ‌గా తీసుకుని యూ ట‌ర్న్ సినిమా చేసాడు ద‌ర్శ‌కుడు ప‌వ‌న్ కుమార్. నిత్యం స‌మాజంలో ఎవ‌రో ఒక‌రు రోడ్ల‌పై చేసే త‌ప్పునే ఎత్తి చూపించాడు ద‌ర్శ‌కుడు.. చిన్న లైన్ ఆస‌క్తిక‌రంగా రాసుకుని.. స్క్రీన్ ప్లే అల్లుకున్నాడు. తొలి సీన్ నుంచే టైమ్ వేస్ట్ చేయ‌కుండా క‌థ‌లోకి వెళ్లిపోవ‌డం మంచి విష‌యం.. రోడ్డు మీద రాంగ్ యూ ట‌ర్న్ తీసుకోవ‌డం.. దాని ప‌ర్యావ‌స‌నాలు.. ఆ కేస్ లో తెలియ‌కుండా స‌మంత ఇరుక్కోవ‌డం.. అన్నీ ప‌క‌డ్భందీగా రాసుకున్నాడు ద‌ర్శ‌కుడు. ఫ‌స్టాఫ్ అంతా చాలా వేగంగా వెళ్లిపోయింది.. సెకండాఫ్ లో స్క్రీన్ ప్లే మ‌రింత ప‌క్కాగా ఉండాలేమో అనిపించింది.. అక్క‌డికి చాలా వ‌ర‌కు బాగానే హ్యాండిల్ చేసాడు ద‌ర్శ‌కుడు ప‌వ‌న్ కుమార్. 

స‌మంత‌, ఆది మ‌ధ్య వ‌చ్చే ఇన్వెస్టిగేటివ్ సీన్స్ అన్నీ అద్భుతంగా వ‌ర్క‌వుట్ అయ్యాయి. అయితే ఫ‌స్టాఫ్ లో క‌నిపించిన వేగం.. సెకండాఫ్ లో క‌నిపించ‌లేదు.. అదొక్క‌టే కాస్త మైన‌స్. క్లైమాక్స్ కూడా సింపుల్ గా తేల్చేసాడు.. కానీ మంచి సందేశం ఇచ్చాడు. ట్విస్ట్ ఇదే అని తెలిసిన త‌ర్వాత కూడా ఆస‌క్తిక‌రంగానే క‌థ‌ను అల్లుకున్నాడు ద‌ర్శ‌కుడు. చివ‌రి వ‌ర‌కు ఎడ్జ్ ఆఫ్ ది సీట్ అంటారు క‌దా.. అలా కూర్చోబెట్టాడు. స‌మంత ఎందుకు ఈ సినిమా కోసం రెండేళ్లు ఆగిందో చూస్తే అర్థ‌మైపోతుంది. ఓవ‌రాల్ గా యూ ట‌ర్న్.. స‌మాజంలో తెలియ‌కుండా జ‌రుగుతున్న త‌ప్పుల‌కు వేక్ అప్ కాల్. అయితే అప్ప‌టి వ‌ర‌కు ప‌క్కాగా సాగుతున్న క‌థ‌కు ఆత్మ‌ల ట‌చ్ ఇచ్చి రొటీన్ అనిపించేసాడు ద‌ర్శ‌కుడు. కానీ సందేశాత్మ‌క క‌థ‌ను చెప్పాలనుకున్న ద‌ర్శ‌కుడి ఆలోచ‌న మాత్రం మంచిదే. 

న‌టీన‌టులు: రిపోర్టర్ గా చాలా బాగా న‌టించింది అక్కినేని కోడ‌లు స‌మంత‌. తాను రెండేళ్లు ఎందుకు వేచి చూసిందో త‌న న‌ట‌న‌తో చూపించింది. ఆది పినిశెట్టి ఏ పాత్ర‌లోనైనా ఫిట్ అయిపోతాడ‌ని మ‌రోసారి ప్రూవ్ చేసాడు.. ఇందులో పోలీస్ ఆఫీస‌ర్ గా ఆక‌ట్టుకున్నాడు. స‌మంత ప్రేమికుడిగా రాహుల్ ర‌వీంద్ర‌న్ ప‌ర్లేదు. భూమిక చావ్లా క‌నిపించింది కాసేపే అయినా కూడా బాగా న‌టించింది. మిగిలిన వాళ్లంతా అలా వ‌చ్చి ఇలా వెళ్లిపోయే పాత్ర‌లే. 

టెక్నిక‌ల్ టీం: హార్ర‌ర్ సినిమాల‌కు ఆర్ఆర్ కీల‌కం. ఈ విష‌యంలో పూర్ణ‌చంద్ర తేజ‌స్వి వంద‌శాతం స‌క్సెస్ అయ్యాడు. రీ రికార్డింగ్ చాలా చోట్ల సినిమా స్థాయిని పెంచింది. పాట‌లు లేక‌పోయినా ఆ ఫీల్ వ‌చ్చింది. త‌క్కువ బ‌డ్జెట్ తోనే నికేత్ బొమ్మిరెడ్డి సినిమాటోగ్ర‌ఫీ బాగుంది. ద‌ర్శ‌కుడి విజ‌న్ ను త‌న కెమెరాలో బాగా బంధించాడు. ఎడిటింగ్ ఓకే. రెండు గంట‌ల 12 నిమిషాలే ఉండ‌టంతో సినిమా చాలా వేగంగా సాగింది. ఓ సందేశాత్మ‌క క‌థ‌ను హార్ర‌ర్ థ్రిల్ల‌ర్ గా చెప్పాల‌నుకున్న ద‌ర్శ‌కుడు ప‌వ‌న్ కుమార్ ఆలోచ‌న నిజంగా అద్భుతం. అది బాగా చేసి చూపించాడు కూడా. 

ఒక్క‌మాట‌: యూ ట‌ర్న్.. ఆలోచింప‌జేసే హార్ర‌ర్ థ్రిల్ల‌ర్..

రేటింగ్    - 3/5

More Related Stories