English   

కొరటాల శివతో స్టార్ హీరోలు సినిమా చేస్తారా..?

Koratala Siva Made Lot of Confusions For Upcoming Movie
2018-09-14 14:44:52

టాలీవుడ్ లో ఓ చిత్రమైన పరిస్థితి ఉందిప్పుడు. ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చిన దర్శకులు, బ్లాక్ బస్టర్స్ కొట్టిన దర్శకులు కూడా వెంటనే సినిమాలు చేయడం లేదు. చాలా గ్యాప్ తీసుకుంటున్నారు. ఈ గ్యాప్ ఒక్కోసారి యేడాది దాటి ఉంటోంది. దీంతో మీడియం రేంజ్ దర్శకులే హవా చేస్తున్నారు. అటు స్టార్ హీరోలు కూడా యేడాదికి ఒక్కో సినిమా మాత్రమే చేస్తుండటంతో ప్రస్తుతం ఈ పరిస్థితి కొంత చిత్రంగా ఉందనే చెప్పాలి. ఈ నేపథ్యంలో ఈ యేడాది మహేష్ బాబుతో సూపర్ హిట్ కొట్టిన దర్శకుడు కొరటాల శివ నెక్ట్స్ ప్రాజెక్ట్ విషయంలోనూ చాలా కన్ఫ్యూజన్ ఉంది. అతను ఎవరితో చేస్తాడా అనే ఫజిల్ గట్టిగా వినిపిస్తోంది. తను ఇప్పటి వరకూ పని చేసింది కేవలం ముగ్గురు హీరోలతో మాత్రమే. వీరిలో మహేష్ తో ఆల్రెడీ రెండు సినిమాలు చేసి ఉన్నాడు. యంగ్ టైగర్ తో జనతా గ్యారేజ్.. తన ఫస్ట్ మూవీ ప్రభాస్ తో. ఇక వీరిలో కొరటాల నెక్ట్స్ ఎవరితో చేస్తాడా అనేది ఓ సారి చూస్తే...

మహేష్ బాబు ఇప్పుడు 25వ సినిమా చేస్తున్నాడు. దీని తర్వాత సుకుమార్ డైరెక్షన్ లో సినిమా ఆల్రెడీ అనౌన్స్ అయింది. అంటే కొరటాల, మహేష్ బాబు కాంబినేషన్ లో హ్యాట్రిక్ కు ఇంకా చాలా టైమ్ ఉందన్నమాట. ఇక నెక్ట్స్ యంగ్ టైగర్ ఎన్టీఆర్.. ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ తో అరవింద సమేత వీరరాఘవ చేస్తున్నాడు. ఈ మూవీ దసరాకు విడుదలవుతుంది. ఆ వెంటనే రాజమౌళి డైరెక్షన్ లో రామ్ చరణ్ తో కలిసి మల్టీస్టారర్ చేస్తాడు. ఇక రాజమౌళి డైరెక్షన్ అంటే చెప్పేదేముందీ.. రెండేళ్లైనా పడుతుంది. అంటే యంగ్ టైగర్ తో సినిమా కూడా ఇప్పట్లో ఊహించలేం. మిగిలింది ప్రభాస్.. బాహుబలి తర్వాత చేస్తోన్న సాహో సినిమానే ఎప్పుడొస్తుందో తెలియదు. తర్వాత రాధాకృష్ణ డైరెక్షన్ లో సినిమా మొదలుపెట్టాడు. ఇది 70ల నాటి కథాంశం అంటున్నారు. అంటే చాలా వర్క్ ఉంటుంది. అందువల్ల ఇది పూర్తవడానికీ చాలా టైమ్ పడుతుంది. సో ప్రభాస్ తో కుదరదు.

ఇక రామ్ చరణ్, అల్లు అర్జున్ లలో ఎవరో ఒకరితో చేయాలనుకుంటే కూడా.. రామ్ చరణ్ బోయపాటి సినిమా తర్వాత రాజమౌళి సినిమాకు వెళతాడు. తర్వాత ధృవకు సీక్వెల్ కూడా ఉండే అవకాశం ఉంది. ఇక మిగిలింది బన్నీ. అల్లు అర్జున్ కు సరిపోయే కథ తన వద్ద లేదని ఇన్ డైరెక్ట్ గా కొన్నాళ్ల క్రితమే చెప్పాడు శివ. మరోవైపు బన్నీతో పనిచేయడం కొరటాలకు ఇష్టం లేదనేవారూ ఉన్నారు. ఒకవేళ చేయాలనుకున్నా.. బన్నీ ఇప్పట్లో ఏదీ తేల్చేలా లేడు.. సో.. టాప్ యంగ్ స్టర్స్ అంతా ఒక రకంగా కొరటాల శివకు హ్యాండిచ్చినట్టే అనుకోవాలి.

అందుకే లేటెస్ట్ గా తను మెగాస్టార్ చిరంజీవి కోసం కథ సిద్ధం చేస్తున్నట్టు చెబుతున్నాడు కొరటాల. నిజానికి ఈ ఇద్దరి కాంబినేషన్ లో సినిమా కోసం చాలా మంది ఎదురు చూస్తున్నారు. కానీ సైరా పూర్తయ్యాకే కదా ఇది పట్టాలెక్కగలదు. అలా చూసుకున్నా మరికొన్నాళ్లు ఆగక తప్పదు. మరోవైపు కొన్నాళ్ల క్రితం వినిపించినట్టుగా నానితో సినిమా అనుకున్నా అదీ అయ్యేలా లేదు. మొత్తంగా ఇతర టాప్ డైరెక్టర్స్ కంటే చాలా త్వరగా టాప్ ప్లేస్ లోకి వచ్చిన కొరటాల శివ పరిస్థితి ఇప్పుడు విచిత్రంగానే ఉందని చెప్పాలి. మరి ఇవన్నీ కాదని అతనేమైనా కొత్తగా చేస్తుంటే మాత్రం ఆ అనౌన్స్ మెంట్ వచ్చే వరకూ ఈ సిట్యుయేషన్ ఇలాగే ఉంటుందనుకోవాలి.

More Related Stories