English   

నన్నుదోచుకుందువటే రివ్యూ

Nannu-Dochukunduvate-Review
2018-09-21 08:07:48

కొన్ని సినిమాలు రిలీజ్ కు ముందే సక్సెస్ అవడం గ్యారెంటీ అనిపిస్తాయి. మరికొన్ని సినిమాలు మెల్లగా ఇంప్రెషన్ పెంచుకుంటూ పోతాయి. కారణం..ఆ టీమ్ చేసిన ప్రమోషన్స్ కావొచ్చు. ట్రైలర్స్, టీజర్స్, సాంగ్స్ కావొచ్చు. అయితే ఈ రెండు అంశాలతో విడుదలకు ముందే పాజిటివ్ ఇంప్రెషన్ వేసిన సినిమా ‘నన్నుదోచుకుందువటే’. సుధీర్ బాబు నిర్మాణ రంగంలోకి దిగి మొదటిసారిగి నిర్మించిన సినిమా కూడా కావడంతో మరింత ఆసక్తి పెరిగింది. నిర్మాతగా అతనికి ఈ సినిమా ఎలాంటి ఫలితం ఇస్తుందా అని ఎదురుచూసిన వాళ్లు చాలామందే ఉన్నారు. మరి నిర్మాతగా, నటుడుగా సుధీర్ బాబు ఏ మేరకు సక్సెస్ అయ్యాడో చూద్దాం.. 

కథ:

కార్తీక్(సుధీర్ బాబు) ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో ప్రాజెక్ట్ మేనేజర్. చాలా స్ట్రిక్ట్. తను మనుషులతోనే ఉంటున్నాననే స్పృహ కూడా తక్కువగా ఉన్నవాడు. అమెరికా వెళ్లాలి బాగా సంపాదించాలినే అనే యాంబిషన్ తో ఉంటాడు. తన నాన్నమ్మ చనిపోతే ఊరికి వెళతాడు కార్తీక్. అక్కడ అతనికి మరదలితో పెళ్లి చేయాలనుకుంటారు. కానీ తనకు ‘సిరి’ అనే లవర్ ఉందని చెబుతాడు కార్తీక్. కట్ చేస్తే మేఘన(నభా నటేష్) ‘సిరి’గా తన లైఫ్ లోకి వస్తుంది. ఈ మేఘన కాలేజ్ లో చదువుతూ.. షార్ట్ ఫిల్మ్స్ లో హీరోయిన్ గా చేస్తూ ఉంటుంది. అలాంటి యాక్టింగ్ తోనే కార్తీక్ లైఫ్ లోకి వస్తుంది. యస్.. లేని సిరిని ఉన్నది అని చెప్పిన కార్తీక్.. తండ్రి కోసం ఓ సిరితో నటింపచేయాల్సి వస్తుంది. మొదట నటిగానే వచ్చినా.. సిరి ఈ కుటుంబంతో కలిసిపోతుంది. కానీ కార్తీక్ తనను ‘నటి’గా మాత్రమే చూస్తాడు. కానీ సిరి అలియాస్ మేఘన కార్తీక్ ను ప్రేమిస్తుంది. తన ప్రేమను చెప్పే టైమ్ కు కార్తీక్ తన స్వార్థాన్ని బయటపెడతాడు. దీంతో తన ప్రేమను దాచుకుంటుంది. కానీ ‘సిరి’గా నటిస్తూనే ఉంటుంది. అసలు సిరి నటిగా కార్తీక్ లైఫ్ లోకి రావడానికి కారణం ఏంటీ..? లేని సిరిని ఉందని ఎందుకు చెప్పాడు..? కార్తీక్.. సిరిని ప్రేమించాడా లేక మేఘనను ప్రేమించాడా..? ఈ ఇద్దరి కథ ఏ తీరాలకు చేరింది.. అనేది మిగతా కథ.

విశ్లేషణ: 

ఈ మధ్య వస్తోన్న కొత్త కుర్రాళ్లు కొత్త కథలు చెబుతున్నారు. లేదా పాత కథలనే చాలా కొత్తగా చెబుతున్నారు. ఈ చిత్ర దర్శకుడు ఆర్ఎస్ నాయుడు ఈ రెండో కోవకు చెందిన వాడు. ‘విషయం’ ఉన్న దర్శకుడు. ఓ చిన్న పాయింట్ ను అవసరం కోసం ఓ చిన్న కథను సరదాగా మొదలుపెట్టి.. మోసంగా టర్న్ తీసుకునే టైమ్ కు ప్రేమను కలిపి.. కావాల్సినంత కాన్ ఫ్లిక్ట్ క్రియేట్ చేసి ఫైనల్ గా సుఖాంతం చేసిన అతని ప్రతిభ ఖచ్చితంగా మెచ్చుకోదగిందే. కొన్ని సన్నివేశాలు మరికొన్ని పాత సినిమాలను గుర్తు చేసినా.. మాగ్జిమం ఫ్రెష్ గానే కనిపిస్తాయీ సినిమాలోని సీన్స్. ఓ షార్ట్ ఫిల్మ్స్ పిచ్చి ఉన్న అమ్మాయిని హీరోయిన్ గా తీసుకుని.. అక్కడి నుంచి కావాల్సినంత ఫన్ క్రియేట్ చేసి.. ఫస్ట్ హాఫ్ అంతా సరదాగా తీసుకు వెళ్లాడు. సిరిగా నటిస్తోన్న హీరోయిన్ తనకు తెలియకుండానే ఆ కుటుంబంతో దగ్గర కావడం.. హీరో తండ్రిని సిటీ అంతా చుట్టి చూపించడానికి తన తండ్రి స్థానం ఇవ్వడం.. ఆ క్రమంలో ఆ పిల్ల చేసే అల్లరి.. ఆయనకే కాదు.. ఆడియన్స్ కూ తెగ నచ్చుతుంది. షార్ట్ ఫిల్మ్స్ అయినా తనో సెలబ్రిటీలా ఫీలవుతూ బిల్డప్ ఇస్తూ.. కార్తీక్ ను ఆటపట్టించడం.. చివరికీ అతన్నీ తన షార్ట్ ఫిల్మ్ లో హీరోగా ‘నటింప’ చేసే ప్రయత్నం.. ఇవన్నీ బోల్డంత హాస్యాన్ని పండించాయి. ఈ క్రమంలో ఇద్దరూ కలిసి ప్రయాణిస్తున్నా.. ప్రేమ తాలూకూ ఎగస్ట్రా(ఒక డ్యూయొట్ మినహా)సీన్స్ లేకుండా అన్నీ సాధారణంగానే సాగిపోవడం ఈ సినిమాలో మెచ్చుకోదగ్గ అంశాల్లో ఒకటి. హీరోయిన్ తను అతన్ని ప్రేమిస్తున్నాను అనుకోవడం.. అతను దాన్ని కూడా నటనలో భాగం అనుకోవడం.. ఆఖరికి కొన్ని అనుకోని సంఘటనలు ఇద్దరి మధ్య భేదాభిప్రాయాలు తేవడం.. ఇవన్నీ కథలో కావాల్సినంత కాన్ ఫ్లిక్ట్ తెచ్చాయి. ఈ సంఘర్షణ ప్రేక్షకుడు కూడా ఫీలయ్యేలా చేయడంలో దర్శకుడు సూపర్ సక్సస్ అయ్యాడు. ఒక దశలో మనకూ సుధీర్ పై కోపం వస్తుంది. అంత సెల్ఫిష్ గా ఉంటుందా పాత్ర. కానీ చివర్లో మళ్లీ తండ్రి కొడుకుల సెంటిమెంట్ ను తెచ్చి... ఆ నెగెటివ్ ఫీలింగ్ అంతా తుడిచేశాడు. నిజానికి ఈ సినిమాలో తండ్రి కొడుకులతో పాటు తల్లీ కూతుళ్ల సెంటిమెంట్ కూడా బాగా కనిపిస్తుంది. చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయిన కూతురుని కంటికి రెప్పలా చూసుకున్న ఆ తల్లి తను ఏం కావాలన్నా ఎంకరేజ్ తన ఆశలకు విలువనిస్తూ.. ఓ ‘గొప్పఅమ్మ’గా కనిపిస్తుంది. కాకపోతే సెకండ్ హాఫ్ లో కొంత సాగుతున్నట్టుగా అనిపిస్తుంది. మొక్కజొన్న తోటలో ఫైట్ పెద్దగా ఉపయోగం లేనిది. అలాగే ఫస్ట్ హాఫ్ లో వచ్చే డ్యూయొట్ స్టోరీ ఫ్లోకు అడ్డుపడిందే కానీ ఉపయోగం లేదు. కాకపోతే మళ్లీ ప్రీ క్లైమాక్స్ నుంచి పీక్స్ కు వెళుతుంది కథనం. 

ఇక ఈ సినిమాలో ప్రధాన అంశం.. పాత్ర ధారులు. ప్రతి పాత్రకూ ఓ పర్పస్ ఉంటుంది. ఏ క్యారెక్టర్ వేస్ట్ గా అనిపించదు. అన్నీ కథలో భాగంగానే ఉంటాయి. షార్ట్ ఫిల్మ్స్ చేసుకునే కుర్రాళ్ల నుంచి విలేజ్ లో కనిపించిన ఆర్టిస్ట్ ల వరకూ అంతా కథలో భాగమే. కథానుసారంగా వచ్చినవారే. ప్రతి ఒక్కరూ తమ బెస్ట్ ఇచ్చే ప్రయత్నం చేసినవారే. కానీ అందర్లోకీ ఎక్కువగా ఆకట్టుకునేది మాత్రం హీరోయిన్. గొప్ప అందగత్తె కాదు కానీ.. ఎంతో ఛలాకీగా ఆ పాత్రనే కాదు.. సినిమానే తన భుజాలపై మోసింది. వాగుడుకాయ్ గా మొదలైన తన పాత్ర సెకండ్ హాఫ్ లోకి వచ్చేసరికి ఎన్నో ఎమోషన్స్ పలికిస్తుంది. అయినా అక్కడా తనదైన చిలిపిదనం వదులుకోదు. సింపుల్ గా ఇది హీరోయిన్ సినిమా. తను లేకపోయినా.. ఆ పాత్రలో అంత బాగా చేయకపోయినా సినిమా తేలిపోయేదనేది నిజం. కానీ ఆ భావన రానీయకుండా ఈ కన్నడ సోయగం మనాళ్లకు బాగా ఆకట్టుకుంటుందనే చెప్పాలి. ఇక మంచి పాత్ర పడితే తానెంత చెలరేగిపోతాడో క్లైమాక్స్ లో చూపించాడు నాజర్. అప్పటి వరకూ ఇబ్బందిగా కనిపించిన సుధీర్ కూడా క్లైమాక్స్ లో నాజర్ తో పోటీ పడ్డాడు. తులసి పాత్ర రెగ్యులర్ కాకపోయినా తన నటన రెగ్యులర్ గానే ఉంది. జీవా, జబర్ధస్త్ వేణు, వైవా హర్ష ఇలా ప్రతి ఒక్కరూ ఆకట్టుకునే నటన చూపించారు. 

టెక్నికల్ గా దర్శకుడికి టాప్ ప్లేస్ దక్కుతుంది. టెక్నీషియన్స్ నుంచి బెస్ట్ అవుట్ పుట్ తెచ్చుకోవడం అంటే తనలోనూ ఓ గొప్ప టెక్నీషియన్ ఉండాలి. ఈ విషయంలో ఆర్ఎస్ నాయుడు ద బెస్ట్ ఇచ్చే ప్రయత్నం చేశాడు. సింపుల్ డైలాగ్స్ తో మంచి ఇంపాక్ట్ వేశాడు. రాసుకున్న సన్నివేశాలన్నీ బావున్నాయి. పరిమిత బడ్జెట్ తో ఓ మ్యాజిక్ నే చేశాడు దర్శకుడు. ఇక మ్యూజికల్ గా అజనీష్ లోకనాథ్ పాటలు పెద్దగా ఆకట్టుకోవు కానీ.. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బావుంది. సినిమాటోగ్రఫీ సూపర్బ్.. ఇక ఈ మొత్తంను ది బెస్ట్ గా హ్యాండిల్ చేయడంలో నిర్మాతగా సుధీర్ బాబు ఎంతో పరిణతి చూపించాడు. క్వాలిటీ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. అందుకే నిర్మాతగా బెస్ట్ అవుట్ పుట్ ఇవ్వగలిగాడు. ఈ సినిమా విషయంలో సుధీర్ బాబుకు నటుడుగా కంటే నిర్మాతగానే ఎక్కువ మార్కులు పడతాయని చెప్పొచ్చు.

ఫైనల్ గా :  నన్నుదోచుకుందువటే.. సమ్మోహనంను మించిన విజయం 

రేటింగ్    : 3/5

More Related Stories