English   

సామి రివ్యూ

Saamy-Square
2018-09-21 10:19:26

హ‌రి సినిమా అంటే ఎలా ఉంటుందో తెలుగు ప్రేక్ష‌కుల‌కు కూడా ఐడియా ఉంది. ఇక విక్ర‌మ్ కూడా చాలా ఏళ్లుగా విజ‌యం కోసం చూస్తున్నాడు. ఇలాంటి టైమ్ లో 15 ఏళ్ల వ‌చ్చిన సామికి సీక్వెల్ చేసారు ఈ ఇద్ద‌రూ. అప్పుడు చ‌రిత్ర తిర‌గ‌రాసిన ఈ చిత్రం ఇప్పుడు ఏం చేసింది..? 

క‌థ‌:
రామ‌స్వామి(విక్ర‌మ్) ఢిల్లీలో ఐఎఎస్ చ‌దువుతుంటాడు. సెంట్ర‌ల్ మినిష్ట‌ర్(ప్ర‌భు) ద‌గ్గ‌ర ఆఫీస్ లో ఉంటాడు. ఆయ‌న కూతురు దియా(కీర్తిసురేష్) ఫారెన్ నుంచి వ‌స్తుంది. స్వామిని చూసి ఇష్ట‌ప‌డుతుంది. ఆయ‌న్ని ప్రేమిస్తుంది. కానీ స్వామి మాత్రం త‌న‌కు కుటుంబ‌మే ముఖ్యం అని వెళ్లిపోతాడు. ఆ త‌ర్వాత ఐఏఎస్ కాస్తా ఐపిఎస్ తీసుకుని విజ‌య‌వాడ‌కు వ‌స్తాడు. అక్క‌డ అప్ప‌టికే రావ‌ణ బిక్షు(బాబీసింహా) బెజ‌వాడ‌ను త‌న గుప్పిట్లో ఉంచుకుంటాడు. 28 ఏళ్ల కింద త‌న‌ తండ్రి ప‌రుశురామ స్వామి(విక్ర‌మ్) ను చంపింది కూడా బిక్షు అని తెలుసుకుని  అత‌డి ఆట క‌ట్టించాల‌ని బెజ‌వాడ‌లో అడుగు పెడ‌తాడు స్వామి. అప్పుడు ఏం జ‌రిగింది..? అనేది అస‌లు క‌థ‌.. 

క‌థ‌నం:

హ‌రి సినిమాల్లో కొత్త క‌థ‌లు ఉండ‌వు. అన్నీ తెలిసిన క‌థ‌లే.. కానీ కెమెరా స్పీడ్.. స్క్రీన్ ప్లే మ్యాజిక్ తో లాజిక్ లేకుండా ప్రేక్ష‌కుల‌ను మెప్పిస్తాడు ఈ ద‌ర్శ‌కుడు. కానీ ఈ సారి కూడా ఇలాగే చేద్దాం అనుకున్నాడు హ‌రి. కానీ స్వామి పూర్తిగా మిస్ ఫైర్ అయిపోయింది. 15 ఏళ్ల కింద వ‌చ్చిన సామికి దీనికి ఎక్క‌డా పొంత‌న కూడా లేదు. క‌థ లింక్ క‌లిపాడు కానీ ఎక్క‌డా ఆ మ్యాజిక్ అయితే క‌నిపించ‌దు. తెలుగులో ల‌క్ష్మీ న‌ర‌సింహాగా వ‌చ్చింది సామి. అందులో ఉండే ద‌మ్ము ఇందులో క‌నిపించ‌దు. ఆ స్క్రీన్ ప్లే ఇందులో లేదు.. ఫ‌స్టాఫ్ అంతా ఢిల్లీలో అర్థం ప‌ర్థం లేని సూరి కామెడీ సీన్స్.. కీర్తిసురేష్ ప్రేమ సీన్స్ తో లాగించేసాడు ద‌ర్శ‌కుడు. హీరో పోలీస్ ఆఫీస‌ర్ గా చార్జ్ తీసుకున్న త‌ర్వాత కూడా క‌థ ముందుకెళ్ల‌దు. విల‌న్ ను క‌ర్క‌శంగా చూపించాడు కానీ ఎక్క‌డా ఒక్క సీన్ లో కూడా లాజిక్ క‌నిపించ‌దు. సెకండాఫ్ లో కాసేపు హీరో, విల‌న్ మ‌ధ్య పాత హ‌రిని చూపించాడు. త‌న మార్క్ స్క్రీన్ ప్లేతో సినిమాను ప‌రుగులు పెట్టించాడు. కానీ వెంట‌నే మ‌ళ్లీ చ‌ల్ల‌బ‌డ్డారు. అచ్చంగా సింగం సిరీస్ మాదిరే ఈ క‌థ కూడా రాసుకున్నాడు ద‌ర్శ‌కుడు. హీరో మారాడంతే.. ఈ విష‌యం హ‌రి కూడా చెప్పాడు. సామితో పోల్చుకుని వెళ్తే సామి 2 క‌చ్చితంగా నిరాశ ప‌రుస్తుంది. అస‌లు క‌థంటూ లేకుండా సింపుల్ గా ఏదో చుట్టేద్దాం అన్న‌ట్లు ఈ సినిమా చేసాడు ద‌ర్శ‌కుడు. విక్ర‌మ్ కూడా క‌మ‌ర్షియ‌ల్ మోజులో ప‌డి అస‌లు క‌థ అడ‌గ‌డం మ‌రిచిపోయిన‌ట్లున్నాడు. ఓవ‌రాల్ గా ఈ సామి ఒక‌ప్ప‌టి సామికి డిజాస్ట్ర‌స్ సీక్వెల్.

న‌టీన‌టులు: 

విక్ర‌మ్ న‌ట‌న గురించి కొత్త‌గా చెప్పాల్సిందేమీ లేదు. ఆయ‌న ఏ పాత్ర‌లో అయినా ఇమిడిపోతాడు. ఇప్పుడు కూడా ప‌క్కా అర‌వ పోలీస్ ఆఫీసర్ గా ర‌ప్ఫాడించాడు. బాబీసింహా విల‌న్ గా చాలా క‌ర్క‌శంగా ఉన్నాడు. కీర్తిసురేష్ కేవ‌లం పాట‌ల‌కు ప‌రిమితం చేసాడు ద‌ర్శ‌కుడు హ‌రి. సూరి కామెడీ అక్క‌డ‌క్క‌డా ప‌ర్లేదు. మిగిలిన వాళ్లంతా ఇలా వ‌చ్చి అలా వెళ్లిపోయే పాత్ర‌లే.

టెక్నిక‌ల్ టీం: 

ఈ సినిమాకు దేవీ శ్రీ ప్ర‌సాద్ సంగీతం అందించాడంటే న‌మ్మ‌డం సాధ్యం కాదు. ఎందుకంటే ఆయ‌న స్టాండ‌ర్డ్ కాదు ఇది. ఒక్క మెట్రో రైల్ పాట త‌ప్పితే అన్నీ డిజాస్ట‌ర్లే. సినిమాటోగ్ర‌ఫ‌ర్ ప్రియ‌న్ చ‌నిపోవ‌డం హ‌రికి పెద్ద మైన‌స్. ఆయ‌న 90 శాతం సినిమాల‌కు ఈయ‌నే సినిమాటోగ్ర‌ఫ‌ర్. కానీ ఇందులో ఆ మ్యాజిక్ క‌నిపించ‌లేదు. ఎడిటింగ్ కూడా చాలా వీక్. సూరి కామెడీ సీన్స్ అస‌లు క‌థ‌కు సంబంధ‌మే ఉండ‌దు. ద‌ర్శ‌కుడిగా హ‌రి చాలా ఏళ్ల త‌ర్వాత దారుణంగా ఫెయిల్ అయ్యాడు. ఆరు సినిమా త‌ర్వాత అంత నీర‌సంగా ఆయ‌న నుంచి వ‌చ్చిన సినిమా సామినే.

చివ‌ర‌గా: సామి.. అర‌వ న‌ర‌క‌మే సామి.. 

రేటింగ్  - 2/5

More Related Stories