ఈ మాయ పేరేమిటో సినిమాపై వివాదం..

ఈ రోజుల్లో కథ లేని సినిమాలైనా వస్తున్నాయేమో కానీ వివాదం లేని సినిమాలు రావడం మాత్రం విడ్డూరం అయిపోయింది. ఇప్పుడు విడుదలైన ఈ మాయ పేరేమిటో సినిమాపై కూడా ఓ వివాదం రాజుకుంది. ఈ సినిమాలో కొన్ని సీన్లు తమ మనోభావాలను దెబ్బతీసాయని జైనులు కంప్లైంట్ చేసారు. ఫైట్ మాస్టర్ విజయ్ కుమారుడు రాహుల్ విజయ్ హీరోగా పరిచయం అయిన ఈ చిత్రం సెప్టెంబర్ 21న విడుదలైంది. విజయ్ తో ఉన్న పరిచయం కారణంగా ఇండస్ట్రీలోని స్టార్ హీరోలంతా ఈ సినిమాను ప్రమోట్ చేసారు. ఇక ఇప్పుడు విడుదలైన తర్వాత వివాదం వచ్చింది. ఇందులో కొన్ని సీన్లు కావాలనే జైనులను కించపరిచేలా ఉన్నాయంటున్నారు ఆయా సంఘాలు.
దీనికి సంబంధించిన ప్రెస్ మీట్ ప్రసాద్ ల్యాబ్ లో జరిగింది. దీనికి హైదరాబాద్ లోని జైనులు హాజరయ్యారు. సినిమాలోని జైనుల వివాదాస్పద పాటను వెంటనే తొలగించాలని.. లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందంటున్నారు వాళ్లు. ఇప్పటికే వాళ్లు అత్యుత్సాహం ప్రదర్శించి సినిమా నిర్మాత దివ్య ఫోన్ నెంబర్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. దీనిపై తాను అందరికీ క్షమాపణ తెలియచేస్తున్నామని తెలిపారు జైనులు. ఈ మాయ పేరేమిటో చిత్రానికి వ్యతిరేకంగా ఎలాంటి ఆందోళనలు చేయడం లేదని.. కేవలం ఆ పాట తీసేయాలని తాము కోరుకుంటున్నట్లు తెలిపారు వాళ్లు. మణిశర్మ ఈ చిత్రానికి సంగీతం అందించాడు.