దేవదాస్ ను కలుసుకున్న ఇలియానా..

దేవదాస్ తో ఇలియానాకు ఏంటి సంబంధం..? ఈ సినిమాలో ఆమె లేదు కదా.. నాగార్జున, నాని నటించిన సినిమాతో ఇల్లీబేబీ ఎందుకొచ్చింది అనుకుంటున్నారా..? ఈ దేవదాస్ గోలలో పడి అసలు విషయం మరిచిపోయినట్లున్నారంతా. అసలు తెలుగు ఇండస్ట్రీకి ఇలియానా పరిచయం అయిందే దేవదాసు సినిమాతో. రామ్ హీరోగా నటించిన ఈ చిత్రాన్ని వైవిఎస్ చౌదరి తెరకెక్కించాడు. 2005లో విడుదలైన ఈ చిత్రం సంచలన విజయం సాధించింది. ఆ సినిమాతోనే ఇలియానా కెరీర్ కు పునాది రాళ్లు పడ్డాయి. ఆ తర్వాత నెంబర్ వన్ హీరోయిన్ అయింది ఈ గోవాబ్యూటీ. అయితే కొన్నేళ్లుగా టాలీవుడ్ కు దూరంగా ఉంది ఈ భామ.
హిందీ సినిమాలే చేసుకుంటూ తెలుగును పట్టించుకోవడం లేదు. ఇప్పుడు రవితేజతో అమర్ అక్బర్ ఆంటోనీలో నటిస్తుంది ఇలియానా. ఈ సినిమా షూటింగ్ తాజాగా అన్నపూర్ణ స్టూడియోస్ లో జరిగింది. అక్కడే ఓ పాట చిత్రీకరణలో భాగంగా వచ్చింది. అప్పుడు తన తొలి సినమా హీరో రామ్ ను కలుసుకుని పోజ్ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. రామ్ ప్రస్తుతం హలో గురూ ప్రేమ కోసమే సినిమాలో నటిస్తున్నాడు. అనుకోకుండా ఈ జోడీ అలా కలుసుకున్నారన్నమాట. చాలా ఏళ్ళ తర్వాత కలుసుకోవడంతో ఇద్దరూ చాలా సేపు ముచ్చటించుకున్నారు కూడా. అయితే ఇప్పుడు ఇద్దరూ కలిసి సినిమా చేసే ఛాన్సులైతే కనిపించడం లేదు కానీ తన దేవదాస్ ను కలుసు కుని ఆ మూవెంట్ ను సోషల్ మీడియాలో షేర్ చేసింది ఇలియానా.