English   

దేవదాస్ రివ్యూ

DevaDas-Review
2018-09-27 08:17:16

దేవదాస్.. అలనాటి క్లాసిక్. ఆ టైటిల్ ను మళ్లీ వాడుకోవడం అంటేనే సాహసం. పైగా దీన్ని కంప్లీట్ ఎంటర్టైనర్ అన్నారు. అంటే ఆ దేవదాస్ కు పూర్తి భిన్నంగా అన్నమాట. మరోవైపు ఈ మధ్య పాత సినిమాల టైటిల్స్ తో వస్తోన్న సినిమాలేవీ పెద్దగా ఆడటం లేదు. బట్.. నాగార్జున, నాని కలిసి నటిస్తోన్న సినిమా అంటే ఖచ్చితంగా ఏదో స్పెషాలిటీ ఉంటుందనే అంచనాలున్నాయి. మరి ఈ అంచనాలను దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య ఏమేరకు నిజం చేశాడనేది చూద్దాం.. 

కథ:
 
దాస్(నాని) డాక్టర్. ఎమ్ఎస్ గోల్డ్ మెడలిస్ట్.  హైదరాబాద్ లో ఓ పెద్ద హాస్పిటల్ లో డాక్టర్ గా జాయిన్ అవుతాడు. కానీ అతన్ని మార్చురీ వార్డ్ లో వేస్తారు. ఒక రోజు మరో డాక్టర్ ప్లేస్ లో ఐసియూలో డ్యూటీకి వెళతాడు. డ్యూటీలో ఉండగా ఓ పేషెంట్ ప్రాణాపాయంలో ఉంటాడు. అతన్ని బతికించడానికి, అక్కడి సీనియర్ డాక్టర్ రాసిన ప్రిస్కిప్షన్ మారుస్తాడు. ఇది నచ్చన ఆ సీనియర్ డాక్టర్ అతన్ని ఉద్యోగంలో నుంచి తీసివేస్తాడు. దీంతో ధూల్ పేట్ లో ఓ క్లినిక్ ఓపెన్ చేస్తాడు. అక్కడికి పేషెంట్స్ కూడా ఎవరూ రారు. ఓ రాత్రి తూటా గాయంతో ఓ వ్యక్తి వస్తాడు. అతన్ని ఆపరేషన్ చేసి బ్రతికిస్తాడు దాస్. అతను దేవా. పాతికేళ్లుగా పోలీస్ లకు దొరక్కుండా తప్పించుకుంటోన్న డాన్. తనను బతికించిన దాస్ పై దేవాకు సాఫ్ట్ కార్నర్ ఉంటుంది. దీంతో ఇద్దరూ ఫ్రెండ్స్ అవుతారు. దాస్ ఓ అమ్మాయిని మెట్రో ట్రైన్ లో చూసి తొలిచూపులోనే ప్రేమలో పడతాడు. అటు దేవా కూడా దాస్ పోరు పడలేక తనకో ప్రేమకథ ఉందని అబద్ధం చెబుతాడు. కానీ మానవత్వానికి ఎక్కువ విలువిచ్చే దాస్.. దేవాను మార్చాలని ప్రయత్నిస్తుంటాడు. ఈ క్రమంలో తను బ్రతికించాలనుకున్న ఓ వ్యక్తిని దేవా తన కళ్లముందే చంపేస్తాడు. దేవా ఎందుకలా చేశాడు.? అసలు దేవా కోసం పోలీస్ లు ఎందుకు వెదుకుతున్నారు..? దాస్ అనుకున్నట్టు దేవా తుపాకీ వదిలేశాడా..? వీరి ప్రేమకథలు ఏమయ్యాయి..? అనేది మిగతా కథ(...?).

విశ్లేషణ

దేవదాస్ టీజర్ ఆకట్టుకుంది. నాని ‘రా’గా మందు తాగుతాడు.. ట్రైలర్ ఆకట్టుకుంది. మాగ్జిమం నవ్వించే ప్రయత్నం చేసింది. కానీ కథ విషయంలో ఏ క్లూ ఇవ్వలేదు. నిజమే.. ట్రైలర్ లో క్లూ ఇవ్వడానికి కూడా ఇందులో కథంటూ ఏమీ లేదు. చాలా సన్నివేశాలు రాసుకుని.. వాటిని ఒక లైన్ లో అమరుస్తూ వెళ్లారు. దీనికి ‘రివెంజ్’ అనే చిన్న పాయింట్ తగిలించారు. అదే కథనుకుంటే.. రివెంజ్ పేరుతో ఒక మనిషిని చంపడం పాపం.. ఏ మనిషైనా సమాజంలో ఉన్నవారితో కలిసి బ్రతకాలి కానీ.. ఇలా చంపుకుంటూ వెళ్లకూడదనే చిన్న సందేశం ఇచ్చే ప్రయత్నం దిశగా కథనం సాగుతుంటుంది. ఈ క్రమంలో మాగ్జిమం కథేంటీ అన్న ప్రశ్న రాకుండా ఉండేందుకు దర్శకుడు తెలివిగా కేవలం ఎంటర్టైన్మెంట్ కే ప్రాధాన్యం ఇస్తూ రాసుకున్న సీన్స్ సినిమాను బోర్ లేకుండా నడిపించేస్తాయి.

నిజానికి దర్శకుడు మాత్రమే కాదు.. నాగ్ అండ్ నాని కూడా ముందు నుంచీ ఇదే చెబుతూ వస్తున్నారు. సినిమా అంతా ఎంటర్టైన్మెంట్ ఉంటుందని. వాళ్లు చెప్పిన మాట అబద్ధం కాదు. మాగ్జిమం ఎంటర్టైన్మెంట్ కే ప్రాధాన్యం ఇచ్చారు. దీంతో వరుసగా సీన్స్ అన్నీ వచ్చిపోతూ ఉంటాయి. ఈ క్రమంలో శంకర్ దాదాను గుర్తుకు తెచ్చే కొన్ని సన్నివేశాలూ కనిపిస్తాయి. కాకపోతే ఇక్కడ డాక్టర్.. శంకర్ దాదా కాదు. అంటే ఓ నిజమైన డాక్టర్ కు శంకర్ దాదా వంటి సీరియస్ డాన్ దేవాకు మధ్య సాగే ప్రయాణం అన్నమాట. ఈ క్రమంలో హీరోయిన్ ను సాధారణంగా ప్రవేశ పెట్టి ఆమె పాత్రతో ఓ ట్విస్ట్ ఇవ్వాలనుకున్నాడు దర్శకుడు. బట్ అది పేలలేదు సరి కదా పేలవంగా ఉంది. అటు న్యూస్  యాంకర్ తో ప్రేమవ్యవహారం కాస్త ఫర్వాలేదనిపించినా.. అందులోనూ సీరియస్ నెస్ ఉండదు. దీంతో దర్శకుడు తను చెప్పాలనుకున్న విషయంలో ప్రేమకు పెద్దగా స్కోప్ లేదనేలా కథనం రాసుకున్నాడు.

ఇక దాస్ చేతుల్లో ప్రాణాపాయంతో ఉన్న వ్యక్తిని దేవా చంపిన తర్వాత కథనం వేరే టర్న్ తీసుకుంటుంది. ఇందుకోసం క్యాన్సర్ ఉన్న బాబు పాత్ర నుంచి.. క్లైమాక్స్ వరకూ మొత్తం ఊహించినట్టుగానే సాగుతుంది. నిజానికి ఈ పాయింట్ తో సినిమా సీరియస్ కావాలి. కానీ.. అప్పటి వరకూ కథేమీ లేదు.. అని ఫిక్స్ అయిన ఆడియన్స్ కు అరే ఎంటర్టైన్మెంట్ మిస్ అయింతే ఫీలింగ్ వస్తుంది. అంటే ఒక్కోసారి దేన్నైతే నమ్ముకుంటారో అదే మైనస్ గా మారే ప్రమాదమూ ఉంది. కాకపోతే మానవత్వం గొప్పదని చెప్పే ప్రయత్నంలో ఓ డాన్ ను మార్చిన గొప్ప డాక్టర్ కథ ఇది అని మనకు మనంగా చెప్పుకోవాలంతే. మొత్తంగా పెద్దగా సీరియస్ నెస్ లేకుండా జస్ట్ ఫన్ రైడ్ లా సాగుతుందీ సినిమా. అలాగని ఇది హిలేరియస్ ఎంటర్టైనర్ కూడా కాదు.. ఫన్నీగా సాగుతుందంతే..

ఆర్టిస్టుల పరంగా నానికి మంచి మార్కులు పడతాయి. ముఖ్యంగా నాగార్జున ఓ వ్యక్తిని చంపిన తర్వాత అతనితో గొడవపడే సీన్ లో నాని విశ్వరూపం చూపించాడు. పైగా ఇన్నోసెంట్ డాక్టర్ అనే పాత్రను హండ్రెడ్ పర్సెంట్ సినిమా అంతా క్యారీ చేశాడు. నాగార్జున వెరీ యంగ్ గా కనిపించాడు. ఎప్పట్లానే తనదైన ఎనర్జీతో నటించాడు. నాగ్ సిక్స్ ప్యాక్ తో ఎంట్రీ ఇవ్వడం చూసి ఈ వయసులో కూడానా అని ఆశ్చర్యపోతామంతే. హీరోయిన్లిద్దరికీ పెద్దగా స్కోప్ లేదు. ఉన్నంతలోనూ వారి ముద్రా కనిపించదు. మురళీ శర్మది రెగ్యులర్ పోలీస్ క్యారెక్టర్. విలన్ పాత్ర అత్యంత బలహీనంగా ఉండటంతో పాటు ఆ విలన్ పాత్ర చేసిన బాలీవుడ్ నటుడు కునాల్ కపూర్ కూడా ఆకట్టుకోలేకపోయాడు. నరేష్ నవ్వించే ప్రయత్నం చేశాడు.  మొత్తంగా కథ జోలికి వెళ్లకుండా క్యాజువల్ గా నవ్వించే ప్రయత్నం చేశాడు దర్శకుడు. 

టెక్నికల్ గా : 

టెక్నికల్ గా ఈ సినిమా ది బెస్ట్ గా కనిపిస్తుంది. ముఖ్యంగా పడచందం పక్కనుంటే అనే సాంగ్ లో ఆర్ట్ వర్క్ అమేజింగ్ గా కనిపిస్తుంది. సింప్లీ సూపర్బ్. క్రియేటివిటీ కూడా అద్బుతంగా ఉంటుందీ పాటలో. ఇక సినిమాటోగ్రఫీ సూపర్బ్. కామెడీ కోసం మాటలు కాకుండా మాటల్లోనే కామెడీ ఉండేలా రాసుకున్నారు బావుంది. పాటలు జస్ట్ ఓకే అనిపిస్తాయి. ఎంటర్టైన్మెంట్ సినిమా కాబట్టి మణిశర్మకు బ్యాక్ గ్రౌండ్ లో మెరుపులకూ పెద్దగా స్కోప్ లేకుండా పోయింది. ఇక దర్శకుడికి మంచి మార్కులే పడతాయి. తను అనుకున్నది అనుకున్నట్టు తెరపైకి తీసుకురాగలిగాడు. కాకపోతే కాస్త కథ కూడా అనుకునుకుంటే బావుండేది. అశ్వనీదత్ బ్యానర్ స్థాయికి తగ్గట్టుగా ప్రొడక్షన్ వాల్యూస్ అదిరిపోయాయి. 

ప్లస్ పాయింట్స్ : 

నాగార్జున, నాని 
ఫస్ట్ హాఫ్ 
ఎంటర్టైన్మెంట్ 
సినిమాటోగ్రఫీ
మాటలు

మైనస్ పాయింట్స్  : 

కథ
సెకండ్ హాఫ్
 
ఫైనల్ గా :  దేవదాస్.. జస్ట్ ఏ ఫన్ రైడ్

రేటింగ్    :  3/5

More Related Stories