సైలెంట్ గా చైస్యామ్ మజిలి

నాగచైతన్య-సమంత మజిలి మొదలైంది. అది కూడా ఎవరికీ తెలియకుండానే.. చాలా సైలెంట్ గా వీళ్లిద్దరి మజిలి మొదలు పెట్టాడు దర్శకుడు శివ నిర్వాణ. అదేంటి.. ఏడాది కిందే సమంత, చైతూ మజిలి మొదలైంది కదా.. ఇప్పుడు మళ్లీ కొత్తగా మొదలు పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది అనుకుంటున్నారా..? ఏం లేదండీ.. ఇప్పుడు సమంత, చైతూ కలిసి సినిమాలో నటిస్తున్నారు కదా. చైస్యామ్ ప్రస్తుతం విదేశాల్లో ఉన్నా కూడా ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ మొదలైపోయిందని తెలుస్తుంది. వాళ్లు లేకపోయినా తన పని మొదలుపెట్టాడు దర్శకుడు శివ. ఇదివరకు చైతు సమంత కలిసి నటిస్తున్నారంటే ఓకే అనుకునేవాళ్లు కానీ ఇప్పుడు మాత్రం సంచలనమే.
పెళ్ళైన తర్వాత ఇద్దరూ కలిసి నటిస్తున్న తొలి సినిమా ఇది. కథ విషయంలోనూ చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు నాగచైతన్య. నిన్నుకోరి లాంటి సెన్సిబుల్ సినిమా చేసిన శివనిర్వాణ దర్శకుడు కావడం.. పైగా ఈ చిత్రం కూడా పెళ్లి నేపథ్యంలోనే సాగనుండటంతో దీనిపై అంచనాలు భారీగా ఉన్నాయి. నానితో కృష్ణార్జున యుద్ధం సినిమా నిర్మించిన సాహు గర్రపాటి, హరీష్ పెద్ది ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మొత్తానికి చైతూ స్యామ్ ఇక్కడ లేకపోయినా వాళ్ల సినిమా మాత్రం మొదలైంది. అన్నట్లు ఈ చిత్రానికి మజిలి అనే టైటిల్ పరిశీలిస్తున్నాడు దర్శకుడు శివ. మజిలి అంటే ప్రయాణం అని అర్థం. మరి ఈ ప్రయాణం ఎలా ఉండబోతుందో..?