మరిచిపోయి.. తిరిగొచ్చి చెప్పిన ఎన్టీఆర్..

ముందు నుంచి అనుకుంటున్నదే.. అభిమానులను చూడగానే ఎన్టీఆర్ ఎమోషనల్ అయిపోయాడు. మా తాత ఫోటో ఎప్పుడూ అక్కడే ఉంటుంది. కానీ ఇంత త్వరగా మా నాన్న ఫోటో కూడా అక్కడ చూడాల్సి వస్తుందని నేనెప్పుడూ అనుకోలేదు అంటూ ఎన్టీఆర్ కళ్లు తుడుచుకుంటుంటే నిజం గానే అక్కడున్న వాళ్లు కూడా చాలా ఎమోషనల్ అయిపోయారు. ఎప్పట్నుంచో అనుకుంటున్నదే.. అంతమంది ఫ్యాన్స్ ను చూసిన తర్వాత జూనియర్ ఖచ్చితంగా కంటతడి పెట్టుకుంటాడని తెలుసు.. అనుకున్నట్లుగానే అయింది కూడా. నిజంగానే తండ్రిని తలుచుకుని చిన్న పిల్లాడిలా ఏడ్చేసాడు ఎన్టీఆర్. ఓ మనిషి ఉన్నపుడు కంటే కూడా లేనపుడే ఆయన విలువ తెలుస్తుంది అంటే ఏమో అనుకున్నాం కానీ ఇప్పుడు తెలుస్తుంది నాకు అంటూ ఎన్టీఆర్ ఇచ్చిన స్పీచ్ అందర్నీ ఎమోషనల్ చేసేసింది. ఈ సినిమా చేయడం కోసమే ఆయన పైకి వెళ్లిపోయాడేమో.. తన 27 సినిమాల్లో ఏ దర్శకుడు కూడా తండ్రి చితికి నిప్పు పెట్టే సీన్ పెట్టలేదని.. కానీ ఇందులో త్రివిక్రమ్ ఆ సీన్ పెట్టాడని చెప్పాడు జూనియర్.
ఇది చెప్తూ ఇంకా ఏడ్చేసాడు ఎన్టీఆర్. 20 నిమిషాలకు పైగా సాగిన ఎన్టీఆర్ స్పీచ్ లో చాలా విషయాలు చెప్పాడు నందమూరి చిన్నోడు. ముఖ్యంగా తండ్రి గురించి చెబుతూ ఆయన ఎప్పుడూ అభిమానులే ప్రాణంగా ఉన్నారని.. వాళ్లను జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పినట్లు గుర్తు చేసుకున్నారు. తాను ప్రాణం ఉన్నంత వరకు కూడా అదే చేస్తానని చెప్పాడు ఎన్టీఆర్. సినిమా గురించి అయితే చెప్పడానికి ఏం లేదని.. త్రివిక్రమ్ తో పని చేయడానికి తనకు 12 ఏళ్లు పట్టిందని.. ఎందుకు ఇన్నేళ్లు సెట్ కాలేదో ఇద్దరికి అర్థం కాలేదని చెప్పాడు జూనియర్. ఇక స్పీచ్ చివర్లో ఎప్పుడూ చెప్పే ఓ మాటని మరిచిపోయాడు ఎన్టీఆర్. ఇంటికి జాగ్రత్తగా వెళ్లండి అనే మాట ముందుకెళ్లి మళ్లీ వెనక్కి వచ్చి చెప్పాడు. నా తండ్రికి ఎలాగూ చెప్పలేకపోయాను.. కనీసం మీరైనా ఇంటికి జాగ్రత్తగా వెళ్లండి.. మీ కోసం ఇంట్లో వేచి చూస్తూ ఉంటారు. వాళ్లను వెళ్లి కలుసుకోండి అంటూ మరింత ఎమోషనల్ చేసాడు అందర్నీ.