English   

నోటా రివ్యూ

NOTA-Review
2018-10-05 07:13:13

నోటా.. ఇప్పుడు తెలుగు, త‌మిళ రాష్ట్రాల్లో ఈ పేరు బాగా వినిపిస్తుంది. ఎన్నిక‌ల స‌మ‌యంలో వినిపించాల్సిన మాట ఇప్పుడే వ‌చ్చింది. నోటా అంటే ఎవ‌రికీ ఓటు వేయ‌క‌పోవ‌డం అని అర్థం. మ‌రి ఇప్పుడు విజ‌య్ దేవ‌ర‌కొండ నోటా ప్రేక్ష‌కులు ఓటు వేస్తారా..?

క‌థ‌:

వ‌రుణ్ (విజ‌య్ దేవ‌ర‌కొండ‌) రాష్ట్ర ముఖ్య‌మంత్రి వాసుదేవ్(నాజ‌ర్) ఒక్క‌గానొక్క కొడుకు. వాసుదేవ్ పై కొన్ని ఎలిగేష‌న్స్ వ‌స్తాయి. దాంతో ప‌ద‌వి నుంచి త‌ప్పుకోవాల్సి వ‌స్తుంది. ఆ స‌మ‌యంలో బ‌య‌టి వాళ్ల‌కు కాకుండా ఎలాంటి రాజ‌కీయ అనుభవం లేని త‌న కొడుకును తీసుకుని వ‌చ్చిఆ కుర్చీలో కూర్చోబెడ‌తాడు వాసుదేవ్. అయితే వ‌రుణ్ కి ఎప్పుడూ తోడుగా ఉంటాడు జ‌ర్న‌లిస్ట్ మ‌హేంద్ర‌(స‌త్య‌రాజ్) ఉంటాడు. అలాంటి టైమ్ లోనే వాసుదేవ్ కు శిక్ష ప‌డుతుంది. దాంతో రాష్ట్ర బాధ్య‌త‌లు మొత్తం వ‌రుణ్ పైకి వెళ్లిపోతాయి. అప్ప‌టి వ‌ర‌కు ఏదో అలా అనుకున్న వ‌రుణ్ కాస్తా సీరియ‌స్ సిఎంగా మారిపోవాల్సి వ‌స్తుంది. అదే టైమ్ లో వాసుదేవ్ పై అటాక్ జ‌రుగుతుంది. అస‌లెవ‌రు ఇదంతా చేసారు.. ఎందుకు వ‌రుణ్ ను టార్గెట్ చేసారు అనేది మిగిలిన క‌థ‌. 

క‌థ‌నం:

హీరో విదేశాల్లో ఉంటాడు.. ఆయ‌న తండ్రి సిఎం.. అనుకోకుండా ఆ ముఖ్య‌మంత్రికి క‌ష్టం వ‌స్తుంది. అప్ప‌టి వ‌ర‌కు సీన్ లో లేని కొడుకు స‌డ‌న్ గా సిఎం కుర్చీలో కూర్చుంటాడు. భ‌ర‌త్ అనే నేను.. లీడ‌ర్ లాంటి సినిమాల్లో ఇదే చూసాం. అయితే అవి కొర‌టాల‌, శేఖ‌ర్ క‌మ్ముల త‌ర‌హా క‌థ‌లు. కానీ ఇక్క‌డ ఉన్నది రౌడీ.. విజ‌య్ దేవ‌ర‌కొండ‌. అందుకే క‌థ కూడా ఆయ‌న‌కు త‌గ్గ‌ట్లుగా మారిపోయింది. ఇక్క‌డ ఈయ‌న కూడా సిఎం. కానీ ఎందుకో తెలియ‌దు ఆ సినిమాల్లో క‌నిపించిన సీరియ‌స్ నెస్ ఇందులో ఉండ‌దు. ఎంత‌సేపూ వీడియో గేమ్స్ ఆడుకోవ‌డం త‌ప్ప విజ‌య్ కారెక్ట‌ర్ ఫ‌స్టాఫ్ లో ఇంకేం చేయ‌దు. సిఎం తండ్రి అరెస్ట్ అయిన‌పుడు వ‌చ్చే ఆ ఒక్క బ‌స్ సీన్ మాత్ర‌మే సినిమా మొత్తంలో ఎమోష‌న‌ల్ గా సాగింది. 

ఇలాంటి సీన్స్ ఇంకా రెండు కానీ ఉండుంటే నోటా ప‌రిస్థితి మ‌రోలా ఉండేది. సెకండాఫ్ లో వ‌ర‌ద‌ల సీన్ ఇలాగే ప్లాన్ చేసాడు కానీ వ‌ర్క‌వుట్ కాలేదు. పైగా ఎంత‌సేపూ అర‌వ డ్రామా సాగ‌డంతో ఇక్క‌డ న ప్రేక్ష‌కుల‌కు ఇది ఎంత‌వ‌ర‌కు ఎక్కుతుంద‌నేది కూడా అనుమాన‌మే. సెకండాఫ్ లో మురుగ‌దాస్ వ‌చ్చే సీన్ బాగుంది. ఇలా రెండున్న‌ర గంట‌ల సినిమాలో ఒక‌ట్రెండు సీన్స్ వెతుక్కోడ‌మే కానీ మొత్తం అని చెప్పేది ఒక్క‌టి కూడా లేదు. భ‌ర‌త్ అనే నేను, లీడ‌ర్ లాంటి సినిమాలు చూసిన హ్యాంగోవ‌ర్ లో నోటా ఎక్క‌దు. పైగా త‌మిళ్ ఫ్లేవ‌ర్ సినిమాను తినేస్తుంది. క్లైమాక్స్ కూడా సింపుల్ గానే తేల్చేసాడు ద‌ర్శ‌కుడు. ఓవ‌రాల్ గా జ‌స్ట్ విజ‌య్ దేవ‌ర‌కొండ అనే మాట త‌ప్ప నోటాలో మ‌రేదీ హైలైట్ కాలేదు.

న‌టీన‌టులు:

విజ‌య్ దేవ‌ర‌కొండ న‌ట‌న గురించి కొత్త‌గా చెప్పాల్సిన ప‌నిలేదు. మ‌రోసారి ఈయ‌న త‌న పాత్ర‌లో మెరిసాడు. త‌న వ‌ర‌కు చాలా బాగా న‌టించి చూపించాడు. అయితే క‌థ విజ‌య్ కు స‌రిపోలేదు. పొలిటిక‌ల్ లీడ‌ర్ గా ఎందుకో విజ‌య్ ను చూడ‌లేక‌పోయారు ప్రేక్ష‌కులు. రౌడీ సిఎంగా బాగున్నా క‌థ బాగోలేదు. మెహ్రీన్ ఎందుకు ఉందో ఆమెకు కూడా తెలియ‌దు పాపం. హీరోయిన్ అన‌డం కంటే గెస్ట్ రోల్ అంటే బాగుంటుందేమో. స‌త్య‌రాజ్ అక్క‌డ‌క్క‌డా విజ‌య్ ను కూడా డామినేట్ చేసాడు. త‌మిళ్ వాళ్ల కోసం ఆయ‌న‌కు లెంతీ కారెక్ట‌ర్ ఇచ్చాడు ద‌ర్శ‌కుడు ఆనంద్ శంక‌ర్. నాజ‌ర్ ఓకే. ప్ర‌తిప‌క్ష లీడ‌ర్ గా యాషికా ఆనంద్ బాగా న‌టించింది. మిగిలిన వాళ్ల‌లో అంతా ఇలా వ‌చ్చి అలా వెళ్లిపోయేవాళ్లే. 

టెక్నిక‌ల్ టీం:

నోటాకు అతిపెద్ద ప్ల‌స్ స్యామ్ సిఎస్ సంగీతం. ఈ సినిమాల పాట‌లు ఒక‌టి రెండే ఉన్నాయి. అవి ఆక‌ట్టుకోలేదు కానీ నేప‌థ్య సంగీతం బాగుంది. కొన్ని సీన్స్ వీటివ‌ల్లే బాగా హైలైట్ అయ్యాయి. ఎడిటింగ్ వీక్ గా ఉంది. ఫ‌స్టాఫ్ ప‌ర్లేద‌నిపించినా.. సెకండాఫ్ చాలా స్లోగా సాగిపోయింది. శాంత‌న కృష్ణ‌ణ్ కెమెరా వ‌ర్క్ బాగుంది. ఎందుకో తెలియ‌దు కానీ జ్ఞాన‌వేల్ రాజా ఈ చిత్రాన్ని చుట్టేసాడు అనిపించింది. అత‌డి నిర్మాణ విలువలు యావ‌రేజ్ గా అనిపించాయి. అరిమ‌నంబి, ఇరుముగ‌న్ యావ‌రేజ్ మార్కులు వేయించుకున్న ఆనంద్ శంక‌ర్.. నోటాతో అవి కూడా వ‌చ్చేలా క‌నిపించ‌డం లేదు. రొటీన్ క‌థ‌కు మ‌రింత రొటీన్ స్క్రీన్ ప్లే.. అర‌వ మేళంతో తెలుగు వాళ్ల‌కు నోటాతో పోటు పొడిచేసాడు ఈ ద‌ర్శ‌కుడు. 

చివ‌ర‌గా: నోటా.. బ్యాలెట్ బాక్స్ నిండ‌టం క‌ష్టమే.. 

రేటింగ్ :  2/5

More Related Stories