సాయిధరంతేజ్ ఎక్కడున్నాడు.. ఏం చేస్తున్నాడు..?

ఇప్పుడు ఫ్యాన్స్ కూడా ఇదే అడుగుతున్నారు. ఒకటి రెండు రోజులు కాదు.. ఏకంగా రెండు నెలల నుంచి కనిపించకుండా మాయమైపోయాడు సాయిధరంతేజ్. అసలు ఎక్కడున్నాడో.. ఏం చేస్తున్నాడో ఎవరికీ అంతు చిక్కడం లేదు. ఫారెన్ వెళ్లి అక్కడే కొత్త సినిమా కోసం లుక్ ట్రై చేస్తున్నాడు సాయిధరంతేజ్. పైగా ఈ మధ్య బాగా బరువు పెరిగిపోయిన ఈయన.. ఇప్పుడు ఒళ్లు తగ్గించుకునే పనిలో బిజీగా ఉన్నాడు. వరసగా ఆరు ఫ్లాప్స్ ఇచ్చి రేస్ లో కనిపించకుండా పోయాడు సాయి. దాంతో ఇప్పుడు ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో ఉన్నాడు ఈ మెగా మేనల్లుడు. ఒక్క ఫ్లాప్ వస్తేనే ఇండస్ట్రీలో పట్టించుకోరు. కొన్నిసార్లు వారసత్వం ఉన్నా కూడా కొందరు వారసులు అలాగే మాయమైపోయారు. అలాంటిది ఇప్పుడు సాయిధరం విషయంలో మాత్రం దర్శక నిర్మాతలు చాలా జాలితో ఉన్నారు.
ఆరు ఫ్లాపులు వచ్చినా కూడా ఇప్పటికీ మూడు సినిమాలతో బిజీగా ఉన్నాడు ఈ హీరో. గోపీచంద్ మలినేనితో ఓ సినిమా కమిటయ్యాడు సాయిధరంతేజ్. ఈ సినిమా వచ్చే ఏడాది పట్టాలెక్కనుంది. ఇది మెడికల్ మాఫియా నేపథ్యంలో సాగనుంది. గతంలో ఈ కాంబినేషన్ లో వచ్చిన విన్నర్ డిజాస్టర్ అయింది. అయినా కూడా మరో ఛాన్స్ ఇచ్చాడు సాయి. ఇక మారుతి కూడా మనోడితో ఓ సినిమా ప్లాన్ చేస్తున్నాడు. ఇవన్నీ ఉండగానే ఇప్పుడు మైత్రి మూవీ మేకర్స్ తో కిషోర్ తిరుమల దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. నాని కాదనుకున్న సినిమా ఇప్పుడు సాయి చేతుల్లోకి వచ్చింది. దీనికి తోడు ఇప్పుడు ఛలో ఫేమ్ వెంకీ కుడుముల సైతం సాయికి ఓ కథ చెప్పాడని తెలుస్తుంది. ప్రస్తుతం నితిన్ తో సినిమా చేస్తున్న ఈయన ఆ తర్వాత సాయి కోసం పెన్ను పట్టనున్నాడు. మొత్తానికి వరసగా ఇన్నేసి సినిమాలు చేస్తున్నాడు సాయి. మరి ఇందులో ఏది ఈయన కెరీర్ ను నిలబెడుతుందో చూడాలి..!