వర్మకు ఇప్పుడెందుకు ఎన్టీఆర్ గుర్తొచ్చాడు..?

కాంట్రవర్సీలు ఎక్కడ ఉంటే రామ్ గోపాల్ వర్మ కూడా అక్కడే ఉంటాడు. ఈయన పేరే ఓ సంచలనం. ఈయన కథల్లో కాంట్రవర్సీలు ఉండటం కాదు.. కాంట్రవర్సీలనే కథలుగా ఎంచుకుంటాడు వర్మ. ఇప్పుడు కూడా ఇదే చేస్తున్నాడు. అందుకే ఆంధ్రుల ఆరాధ్యదైవంగా భావించే ఎన్టీఆర్ బయోపిక్ ను తీస్తానంటున్నాడు. ప్రస్తుతం అన్నగారి బయోపిక్ లో బాలయ్య నటిస్తున్నాడు. షూటింగ్ కూడా సగానికి పైగా పూర్తైపోయింది. క్రిష్ ఈ బాధ్యత తీసుకున్నాడు. ఇదిలా ఉంటే ఇప్పుడు సడన్ గా మరోసారి ఎన్టీఆర్ గురించి బాంబ్ పేల్చాడు వర్మ. ఆలోచన వచ్చిందే తడువుగా లక్ష్మీస్ ఎన్టీఆర్ అనౌన్స్ చేసాడు. గత కొన్ని రోజులుగా ఎలాంటి సమస్య లేకుండా ఉన్న ఇండస్ట్రీలో మళ్లీ హాట్ టాపిక్ రాజేసాడు ఆర్జీవి. ఇప్పుడు ఉన్నట్లుండి ఈ బయోపిక్ ఎందుకు తీస్తున్నాడు..? ఎవరితో తీస్తున్నాడు..? కావాలనే బాలయ్యకు పోటీగా వస్తున్నాడా.. ఇలా మదిలో ఎన్నో ప్రశ్నలు. ఒక్కటి అయితే క్లియర్.
బాలయ్య బయోపిక్.. వర్మ బయోపిక్ ఖచ్చితంగా చాలా తేడాలు ఉంటాయి. వర్మ తన బయోపిక్ కోణం మార్చేసాడు. ఇది లక్ష్మీస్ ఎన్టీఆర్ అంటూ టైటిల్ పెట్టేసాడు. బాలయ్య చేస్తున్న ఎన్టీఆర్ బయోపిక్ ఎక్కడ ముగుస్తుందో.. తన బయోపిక్ అక్కడ మొదలవుతుందని షాక్ ఇచ్చాడు వర్మ. అక్టోబర్ 19న తిరుపతిలో మొదలుపెట్టి.. వచ్చే ఏడాది జనవరి 25న తన లక్ష్మీస్ ఎన్టీఆర్ విడుదల చేస్తానంటున్నాడు. అసలు ఈ తరహా పోటీ ఎందుకో ఇప్పుడు ఎవరికీ అర్థం కావడం లేదు. ఈ చిత్రాన్ని జివి మూవీస్ బ్యానర్ పై రాకేష్ రెడ్డి నిర్మించనున్నాడు. ఈ బయోపిక్ కోసం వర్మ కొన్ని ఊళ్లు తిరిగి విషయం తెలుసుకుంటున్నాడు. ఎన్టీఆర్ జీవితం ఓ మహాభారతం అని.. తాను అందులో ఓ చిన్న అధ్యాయాన్ని తెరకెక్కించబోతున్నట్లు తెలిపాడు వర్మ. మొత్తానికి మరిచిపోయాడేమో అనుకున్న అన్న బయోపిక్ ఇంకా వార్తల్లోనే ఉందని చెప్పి షాకిచ్చాడు వర్మ.