English   

మెగా మేనల్లుడు చిత్ర లహరి మొదలుపెట్టాడు

Sai-Dharam-Tej
2018-10-15 18:19:34

సాయిధరమ్ తేజ్.. మెగా స్టార్ మేనల్లుడుగా వచ్చాడు. మొదట్లో మూడు విజయాలతో ఆకట్టుకున్నా ఆ తర్వాత ఆరు ఫ్లాపులతో నిరాశపరిచాడు. రెండు హిట్లు రాగానే వెంటనే ‘సుప్రీమ్ హీరో’అని కూడా వేసుకున్న ఈ కుర్రహీరో.. ఆ పదానికే పెద్ద డ్యామేజ్ చేశాడు. మొత్తంగా కొన్నాళ్ల క్రితం అమెరికా వెళ్లాడు. రెస్ట్ తీసుకుని రీసెంట్ గా వచ్చాడు. తన బర్త్ డే నాడు చాలాకాలంగా వెయిటింగ్ లో ఉన్న ఓ సినిమాను ప్రారంభించాడు. నేను శైలజ వంటి సెన్సిబుల్ హిట్ మూవీ తీసి ఉన్నది ఒకటే జిందగీతో ఫ్లాప్ చూసిన కిశోర్ తిరుమల డైరెక్ట్ చేస్తోన్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుండటం విశేషం. మొత్తంగా ఇవాళ అఫీషియల్ గా సినిమా ప్రారంభమైంది. ఈ సినిమా కోసం కొత్త మేకోవర్ ట్రై చేయడానికి అమెరికా వెళ్లాడనుకున్న తేజూ.. అలాంటిదేమీ లేదని ఈ ప్రారంభోత్సవ లుక్ తో చెప్పకనే చెప్పాడు. మొత్తంగా తన లుక్ లో పెద్దగా మార్పులు లేకుండానే మళ్లీ బరిలోకి దిగాడు. 

మొత్తంగా తాను మారనని... ఫ్లాపులు విశ్లేషించుకున్నానని.. ఇకపై అందరికీ నచ్చే సినిమాలే చేస్తానంటూ ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చి ఆకట్టుకున్న తేజూ ఈ సినిమాతో ఖచ్చితంగా హిట్ కొట్టాల్సిన స్టేజ్ లో ఉన్నాడు. ఇక కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫీ అందిస్తోన్న ఈ మూవీకి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండటం విశేషం. తేజూ సినిమాకు దేవీ సంగీతం ఇవ్వడం ఇదే ఫస్ట్ టైమ్. అది దర్శకుడు కిశోర్ తిరుమలతో వచ్చిన బాండ్ వల్లే అనుకోవచ్చు. ఇక హలో ఫేమ్ మళయాల స్టార్ డైరెక్టర్ కూతురు కళ్యాణి ప్రియదర్శన్ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ మూవీలో మరో హీరోయిన్ కూ ఛాన్సుంది. ఆ ఇద్దరు భామల పేర్లే ‘చిత్ర - లహరి’ అంటున్నారు. మరి తను మారానని చెబుతోన్న తేజూ మాటలు నిజమే అనుకోవాలంటే ఈ మూవీ గత ఫ్లాపులను మర్చిపోయేలా ఉండాలి. 

More Related Stories