English   

ఇక నందమూరి అభిమానుల్లో గొడవలు ఉండవు

Balakrishna Replaced Father Place to Jr NTR and Kalyan Ram
2018-10-22 12:56:10

నందమూరి బాలకృష్ణ.... అరవింద సమేత వీరరాఘవ ఫంక్షన్ కు రావడం వెనక ఉద్దేశ్యాలేమైనా.. సరే. పుట్టెడు శోకంలో ఉన్న ఆ కుటుంబంలో ఆనందాన్ని నింపాడు. ఆ ఆనందం కళ్యాణ్ రామ్ మాటల్లో కనిపించింది. మొత్తంగా నందమూరి అభిమానుల్లో  కూడా బాలయ్య రాక కొత్త ఉత్సాహాన్ని నింపింది. బాలయ్య కూడా ఈ వేదికపై ఎప్పట్లానే ఎంతో హుందాగా ప్రవర్తించాడు. ఎంతో జీవితాన్ని చూశానని ఒక మాటగా చెప్పిన బాలయ్య మాటల్లో అది స్పష్టంగా కనిపించింది. మొత్తంగా తండ్రి లేని మాకు ‘ఇక్కడ ఒకే ఒక్క లోటు కనిపిస్తోంది. అది మా నాన్న లేని లోటు. నాన్న లేని లోటును ఇప్పుడు మా బాబాయ్ తీర్చాడు’ అంటూ కళ్యాణ్ రామ్ ఉద్వేగంగా చెప్పాడు. బాలయ్యను ఎంత కోరుకుంటున్నారో, తండ్రిని ఎంత మిస్ అవుతున్నారో కళ్యాణ్ రామ్.. ఎన్టీఆర్ మాటల్లో అందరికీ అర్ధం అవుతుంది.

ఇక బాలయ్య కూడా బాధలో ఉన్నవారిని ఎక్కువగా ఇబ్బంది పెట్టకుండా హరికృష్ణతో మొదలుపెట్టి.. వేదికపై ఉద్వేగంతో పాటు ఉత్సాహాన్ని కూడా నింపాడు. హరికృష్ణ అంటే తనకెంత ఇష్టమనే విషయాన్ని మరోసారి స్పష్టం చేశాడు. తర్వాత సినిమాలో మాగ్జిమం మేజర్ ఆర్టిస్టులందరి గురించి చెప్పాడు.. ‘‘ఎన్టీఆర్’’ బయోపిక్ మూవీ పనుల్లో బిజీగా ఉండటంతో అరవింద సమేత చూడలేకపోయానని.. కానీ అందరూ సినిమాకు మంచి విజయాన్ని అందించినందుకు కృతజ్ఞతలు చెప్పాడు. ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ ను పేరు పేరునా పలకరిస్తూ.. దాదాపు 20 నిమిషాల పాటు మాట్లాడాడు.  

మొత్తంగా బాధలో ఉన్నవారి శోకాన్ని పంచుకుంటే తరిగిపోతుందంటారు..  ఇప్పుడు బాలయ్య అదే చేశాడు. ఇక పైనా అన్నదమ్ములకు అండగా ఉంటాననే భరోసా ఇచ్చాడు, దీంతో ఇకపై నందమూరి అభిమానుల్లో ఎలాంటి గొడవలు లేకుండా చేసినట్టే అని భావించాలి.

More Related Stories