English   

ర‌మ్య‌కృష్ణ‌పై కృష్ణ‌వంశీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

Director Krishna Vamsi Revealed why not work with Ramya Krishnan After Marriage
2018-10-25 07:59:46

తెలుగు ఇండ‌స్ట్రీలో కృష్ణ‌వంశీది ఓ వింత ప్ర‌యాణం. ఇండ‌స్ట్రీకి సంచ‌ల‌నంలా దూసుకొచ్చాడు ఈ ద‌ర్శ‌కుడు. కెరీర్ మొద‌ట్లోనే ఇండ‌స్ట్రీకి కుదిపేసిన గులాబి.. సిందూరం.. మురారి.. నిన్నే పెళ్లాడతా.. ఖ‌డ్గం లాంటి సంచ‌ల‌న సినిమాలు చేసాడు. కానీ ఆ త‌ర్వాత అదే టెంపో మెయింటేన్ చేయ‌లేక చేతులెత్తేసాడు. ఇప్పుడు ఆయ‌న నుంచి సినిమాలు రావ‌డ‌మే గ‌గ‌నంగా మారింది. అయితే ఇప్పుడు ఈయ‌న గురించి ఎందుకు టాపిక్ వ‌చ్చింది అంటే.. త‌న భార్య, న‌టి ర‌మ్య‌కృష్ణ గురించి కొన్ని ఆస‌క్తిక‌ర‌మైన వ్యాఖ్య‌లు చేసాడు కృష్ణ‌వంశీ. మొద‌ట్లో కృష్ణవంశీ తెరకెక్కించిన చంద్రలేఖ.. త‌ర్వాత శ్రీ ఆంజనేయం త‌ప్ప మ‌రే సినిమాలోనూ ర‌మ్య‌ను తీసుకోలేదు కృష్ణ‌వంశీ. కావాలంటే త‌న ప్ర‌తీ సినిమాలోనూ ఆమెనే తీసుకోవ‌చ్చు కానీ అలా చేయ‌లేదు ఈయ‌న‌. దానికి కార‌ణం కూడా చెప్పాడు వంశీ. తాను రమ్యకృష్ణ‌ను డైరెక్ట్‌ చేయలేన‌ని.. ఎందుకంటే ఆమెను త‌న ఆర్టిస్టుగా చూడ‌టం సాధ్యం కాద‌ని చెప్పాడు కృష్ణ‌వంశీ.

త‌న భార్య అయినందుకే సినిమాల్లో తీసుకోన‌ని.. బాహుబలిలో రమ్య పాత్రను అద్భుతంగా తీర్చిదిద్దారని.. ఇక ఆ పాత్ర‌లో తాను కూడా అద్భుతంగా న‌టించింద‌ని చెప్పాడు కృష్ణవంశీ. త‌న‌కు రమ్యకృష్ణను తొలిసారి అదిరింది అల్లుడు షూటింగ్ లో బ్ర‌హ్మానందం ప‌రిచ‌యం చేసార‌ని గుర్తు చేసుకున్నాడు ఈ ద‌ర్శ‌కుడు. త‌న గులాబి సినిమాలోని మేఘాల‌లో తేలిపోతున్న‌ది సాంగ్ చూసి ఇలాంటి పాట‌లు మ‌న ద‌గ్గ‌ర వ‌స్తున్నాయా అంటూ ర‌మ్య‌కృష్ణ ఆశ్చ‌ర్య‌పోయింద‌ని త‌న‌కు చెప్పార‌ని చెప్పాడు కృష్ణ‌వంశీ. త‌న‌కు ప‌రిచ‌యం అయ్యే స‌మ‌యానికే త‌నోపెద్ద హీరోయిన్ అని.. ప‌రిచ‌యం అయిన త‌ర్వాత ఆరేళ్లు క‌లిసి ఒక‌ర్నొక‌రు అర్థం చేసుకున్న త‌ర్వాత పెళ్లి చేసుకున్నాం అని చెప్పాడు ఈ ద‌ర్శ‌కుడు. మొత్తానికి త‌న సినిమాల్లో ర‌మ్య‌కృష్ణ‌ను న‌టిగా చూడ‌లేని కార‌ణంగానే త‌న‌ను సినిమాల్లో తీసుకోవ‌డం లేద‌ని నిజం చెప్పాడు ఈ క్రియేటివ్ డైరెక్ట‌ర్.

More Related Stories