English   

శంకర్ టార్గెట్ రాజమౌళేనా..?

Shankar-Rajamouli
2018-11-02 10:41:08

శంకర్.. నో డౌట్.. సౌత్ ఇండియాలో సినిమా రంగంలో విప్లవాత్మకమైన టెక్నికల్ మార్పులకు ఆద్యుడు. బలమైన కథలతో కమర్షియల్ సందేశాలు ఇవ్వడంలోనూ అతను ఎక్స్ పర్ట్. పరిమితులు లేని బడ్జెట్ తోనే సినిమాలు చేసే శంకర్ ఆశ్చర్యంగా ఆ మొత్తాన్ని రికవర్ చేయడంలోనూ ఎక్స్ పర్ట్. అయితే కొన్నాళ్లుగా శంకర్ ఫామ్ లాస్ అయ్యాడు. బాలీవుడ్ బ్లాక్ బస్టర్ త్రీ ఇడియట్స్ ను నన్బన్ గా రీమేక్ చేసి బాగా దెబ్బయిపోయాడు. తర్వాత అపరిచితుడు విక్రమ్ తో చేసిన ఐ బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది. ఇది కమర్షియల్ గానూ భారీ నష్టాలు తెచ్చింది. ఇదే టైమ్ లో రాజమౌళి బాహుబలితో దేశం మొత్తాన్ని షేక్ చేశాడు. ఇండియన్ స్క్రీన్ పై హాలీవుడ్ రేంజ్ సినిమా అన్న ప్రశంసలూ దక్కించుకున్నాడు. కానీ కంటెంట్ పరంగా చూస్తే శంకర్ స్థాయి కథ కాదిది. అయినా విజువల్ ఎఫెక్ట్స్ తో మెస్మరైజ్ చేస్తూ మెగా హిట్ కొట్టాడు. ఇది శంకర్ కు మరింత ఇబ్బందిగా మారింది. తనకు దక్షిణాదిలో పోటీ లేదనేది శంకర్ ఫీలింగ్. కానీ ఈ ఫీలింగ్ కు పూర్తిగా చెక్ పెట్టేశాడు రాజమౌళి. శంకర్ ఆ ఫ్రస్టేషన్ లోనే మరో  భారీ బడ్జెట్ మూవీ ‘2.0’కు శ్రీకారం చుట్టాడు.

బట్ అతని బ్యాడ్ లక్.. ఈ మూవీ ఆలస్యానికే బ్రాండ్ అంబాసిడర్ అన్నట్టుగా చాలాకాలంగా సాగుతోంది. దీంతో లాస్ట్ ఇయర్ రాజమౌళి బాహుబలి సీక్వెల్ తో ఫస్ట్ పార్ట్ ను మించి డబుల్ హిట్ హిట్ కొట్టాడు. కట్ చేస్తే శంకర్ టార్గెట్ మారింది. తనిప్పుడు ముందు రాజమౌళిని ఢీ కొట్టాలి. అతనికంటే ఎక్కువగా వసూళ్లు సాధించాలి. దీంతో బడ్జెట్ మరింత పెంచాడు. విజువల్ ఎఫెక్ట్స్ కోసం ఎక్కువ కష్టపడ్డాడు. బట్ మళ్లీ బ్యాడ్ లక్.. అతని టీమ్ సరిగా లేకపోవడంతో 2.0 ఇంకా లేట్ అయింది. మొత్తంగా ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పూర్తికావొచ్చింది. ఈ నవంబర్ 3న ట్రైలర్ తో వస్తున్నాడు. దీన్ని బట్టి.. అతను రాజమౌళిని ఢీ కొంటాడా లేదా అనేది ఖచ్చితంగా చెప్పలేం కానీ.. అతని ఇంటెన్షన్ మాత్రం అర్థమౌతుంది. 

నిజానికి రాజమౌళి వర్సెస్ శంకర్ అనేంత సీన్ లేదు. ఎందుకంటే ఇద్దరి పంథా వేరు. రాజమౌళి పూర్తిగా ఎంటర్టైన్మెంట్ కే ప్రాధాన్యం ఇస్తాడు. శంకర్ దానికి కాస్త సోషల్ మెసేజ్ ను జోడిస్తాడు. ఇది ఈ ఇద్దరి సినిమాల్లోనూ కనిపించే ప్రధాన వైరుధ్యం. ఆ వైరుధ్యం పరిధిని చెరిపేసేది ఇప్పుడు టెక్నికల్ స్టాండర్డ్స్. అఫ్ కోర్స్ కంటెంట్ కూడా ఉంటేనే ఈ టెక్నికల్ ఎస్సెట్ గా మారుతుంది. అయితే ఎలా చూసినా రాజమౌళి కంటే ఈ టెక్నికల్ ఇష్యూస్ పై శంకర్ కు కాస్త ఎక్కువ పట్టుంది. ఆ పట్టు ఎంత గట్టిగా ఉంటుందనేది సినిమా చూస్తే కానీ తెలియదు. మొత్తంగా ఈ సినిమా ఈ నెల 29న విడుదల కాబోతోంది. మరి శంకర్ రాజమౌళిని బీట్ చేస్తాడా లేదా అని కాదు కానీ.. కనీసం రీచ్ అవుతాడా అనేది చూడాలి.

More Related Stories