English   

ఉదయ్ కిరణ్ కెరీర్‌లో ఆగిపోయిన 10 సినిమాలు ఇవే..

 Uday Kiran
2020-06-27 07:17:21

సరిలేరు నీకెవ్వరు సినిమాలో నెవ్వర్ బిఫోర్.. ఎవ్వర్ ఆఫ్టర్ అనే డైలాగ్ ఉంది కదా. అది ఉదయ్ కిరణ్‌కు బాగా సరిపోతుంది. నిజంగానే తెలుగు ఇండస్ట్రీలోకి అలాగే వచ్చాడు ఈ కుర్ర హీరో. మిలీనియం మొదట్లో ఉదయ్ కిరణ్ అంటే సంచలనం. అమ్మాయిల కలల రాకుమారుడు.. నిర్మాతల బంగారు బాతు. 20 ఏళ్ల ప్రాయంలోనే సూపర్ స్టార్ అయిపోయాడు. కానీ అంతే త్వరగా పడిపోయాడు. ఒకటి రెండు కాదు.. ఉదయ్ చేతుల్లోంచి చాలా సినిమాలు చేజారిపోయాయి. ఆయన జయంతి సందర్భంగా అవేంటో ఒక్కసారి చూద్దాం..

1. ప్రేమంటే సులువు కాదురా: అప్పట్లో సంచలన సినిమాలు నిర్మించిన అగ్ర నిర్మాత ఏ.ఎం.రత్నం.. ఖుషీ లాంటి బ్లాక్‌బస్టర్ సినిమా తర్వాత సూర్య మూవీస్ బ్యానర్‌పై ఉదయ్ కిరణ్ హీరోగా ప్రేమంటే సులువు కాదురా అనే సినిమా మొదలు పెట్టాడు. 80 శాతం పూర్తైన ఈ చిత్రం అనివార్య కారణాలతో ఆగిపోయింది.

2. ప్రత్యూష క్రియేషన్స్: ఉదయ్ కిరణ్, అంకిత జంటగా ప్రత్యూష క్రియేషన్స్ బ్యానర్‌పై ఓ ప్రాజెక్ట్ మొదలు పెట్టారు. పూజ కూడా జరిగిన తర్వాత ఈ చిత్రం క్యాన్సిల్ అయ్యింది.

3. అంజనా ప్రొడక్షన్స్ సినిమా: చిరంజీవి కూతురు సుష్మితతో ఉదయ్ కిరణ్ నిశ్చితార్థం జరిగిన తర్వాత అంజనా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఉదయ్ కిరణ్, అసిన్ జంటగా ఓ చిత్రం ప్లాన్ చేసారు. కానీ ఆ తర్వాత పరిస్థితుల దృష్ట్యా ఆ సినిమా ఆగిపోయింది.

4. నర్తనశాల: బాలకృష్ణ స్వీయ దర్శకత్వంలో అప్పట్లో భారీ క్యాస్టింగ్‌తో నర్తనశాల సినిమాను లాంఛనంగా మొదలుపెట్టాడు. అయితే ప్రధాన పాత్రధారి అయిన సౌందర్య హఠాన్మరణంతో ఈ సినిమా ఆగిపోయింది. ఇందులో ఉదయ్ కిరణ్‌ను అభిమన్యుడి పాత్ర కోసం తీసుకున్నాడు బాలయ్య.

5. జబ్ వి మెట్ తెలుగు రీమేక్: ఉదయ్ కిరణ్, త్రిష కాంబినేషన్‌లో హిందీలో సూపర్ హిట్ అయిన జబ్ వి మెట్ సినిమాను తెలుగులో రీమేక్ చెయ్యాలనుకున్నారు.. కానీ ఈ సినిమా కూడా ఆగిపోయింది.

6. సూపర్ గుడ్ ఫిల్మ్స్: తెలుగు, తమిళంలో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు తీసిన సూపర్ గుడ్ ఫిల్మ్స్ సంస్థ కూడా ఉదయ్ కిరణ్, సదా జంటగా ఓ సినిమా ప్లాన్ చేసి తర్వాత ఆపేసారు.

7. ఆది శంకరాచార్య: ఉదయ్ కిరణ్ చేయాల్సిన భారీ సినిమా ఆది శంకరాచార్య. ఈ చిత్రం కూడా అనుకోకుండా ఆగిపోయింది. అప్పటికే ఉదయ్ మార్కెట్ పడిపోవడంతో నిర్మాత కూడా ఆర్థిక సమస్యలతో ఈ సినిమాను ఆపేసాడు.

8. ఎమ్మెస్ రాజు సినిమా: ఉదయ్ కిరణ్‌తో అప్పటికే మనసంతా నువ్వే, నీ స్నేహం లాంటి సినిమాలు నిర్మించిన నిర్మాత ఎమ్మెస్ రాజు ఆ తర్వాత కూడా ఓ సినిమా చేయాలనుకున్నాడు. కానీ ఈ సినిమా కూడా చివరి నిమిషంలో క్యాన్సిల్ అయిపోయింది.

9. చంద్రశేఖర్ యేలేటి సినిమా: తెలుగులో విభిన్న చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి కూడా అప్పట్లో ఉదయ్ కిరణ్ హీరోగా ఓ సినిమా ప్లాన్ చేసాడు. కానీ ఎందుకో తెలియదు కానీ ఆ తర్వాత ఆ ప్రాజెక్ట్ ఆపేసాడు ఈ దర్శకుడు.

10. తేజ సినిమా: చివరగా ఉదయ్ కిరణ్‌ను వెండితెరకు పరిచయం చేసిన దర్శకుడు తేజ.. ఆయన కష్టాల్లో ఉన్నపుడు ఓ సినిమా చేయాలనుకున్నాడు. అప్పటికే చిత్రం, నువ్వు నేను సినిమాలతో పాటు ఉదయ్ కెరీర్ డైలమాలో ఉన్న సమయంలో ఔనన్నా కాదన్నా సినిమా చేసాడు తేజ. మరోసారి సినిమా చేయాలనుకున్నా కూడా కుదర్లేదు. మొత్తానికి ఇన్ని సినిమాలు ఆగిపోయాయి. ఒకవేళ ఇవే కానీ తెరకెక్కి ఉంటే ఈ రోజు ఉదయ్ కిరణ్ సూపర్ స్టార్ అయ్యుండేవాడు. 

More Related Stories