English   

బడ్జెట్ మూరెడు లాభాలు బారెడు.. మీడియం రేంజ్ బ్లాక్‌బస్టర్స్ ఇవే..

Tollywood
2020-01-24 12:54:37

ప్రతిరోజూ పండగే, ఇస్మార్ట్ శంకర్ లాంటి సినిమాలు ఈ మధ్య భారీ లాభాలు తీసుకొచ్చాయి. ఒక్కో సినిమా కనీసం 30 కోట్ల లాభాలను తీసుకొచ్చాయి. స్టార్ హీరోలతో సినిమాలు చేసినా రాని లాభాలు ఒక్కోసారి చిన్న సినిమాలతోనే వస్తుంటాయి. 100 కోట్లు వసూలు చేసినా కూడా స్టార్ హీరోల సినిమాలకు అన్ని లాభాలు రావు. ఎందుకంటే బిజినెస్ కూడా అదే రేంజ్‌లో జరిగి ఉంటుంది కాబట్టి. 100 కోట్లు వసూలు చేసినా 10 కోట్ల లాభాలు మాత్రమే వస్తాయి బయ్యర్లకు. కానీ మీడియం రేంజ్ సినిమాలు హిట్ అయితే మాత్రం లాభాలు భారీగా వస్తుంటాయి. ఈ మధ్య కాలంలో అలా వచ్చి సంచలన విజయాలు సాధించిన సినిమాలు కొన్ని ఉన్నాయి. అలాంటి సినిమాలేంటో.. అవి సాధించిన లాభాలేంటో ఓ సారి చూద్దాం..

1) గీత గోవిందం:

విజయ్ దేవరకొండ, రష్మిక జంటగా నటించిన ఈ చిత్రాన్ని పరశురామ్ తెరకెక్కించాడు. ఈ చిత్రం ఒకటి రెండు కాదు ఏకంగా 70 కోట్ల షేర్ వసూలు చేసింది. తీరా ఈ చిత్రం చేసిన బిజినెస్ మాత్రం కేవలం 15 కోట్లే. అంటే బయ్యర్లతో పాటు నిర్మాతలకు ఈ చిత్రం 55 కోట్లకు పైగా లాభాలను తీసుకొచ్చింది. తెలుగు సినిమా చరిత్రలోనే అత్యధిక లాభాలు తీసుకొచ్చిన సినిమాల లిస్టులో ఇది ముందు వరసలో ఉంది.

2) ఫిదా:

వరుణ్ తేజ్, సాయి పల్లవి కాంబినేషన్‌లో శేఖర్ కమ్ముల తెరకెక్కించిన అచ్చమైన తెలంగాణ ప్రేమకథ ఫిదా. ఈ చిత్రం 2017లో విడుదలైంది. దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రం 18 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేస్తే 49 కోట్ల షేర్ వసూలు చేసింది. అంటే దాదాపు 31 కోట్లకు పైగానే నిర్మాతలకు లాభాలు తీసుకొచ్చింది ఫిదా.

3) ఇస్మార్ట్ శంకర్:

2019లో పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన బ్లాక్ బస్టర్ సినిమా ఇస్మార్ట్ శంకర్. 12 ఏళ్ళుగా విజయం కోసం చూస్తున్న పూరీకి ఈ సినిమా లోటు తీర్చేసింది. రామ్, నభా నటేష్, నిధి అగర్వాల్ జంటగా నటించిన ఈ చిత్రం దాదాపు 39 కోట్ల షేర్ వసూలు చేసింది. ఈ చిత్రాన్ని కేవలం 17 కోట్లకు మాత్రమే అమ్మేసారు మేకర్స్. ఫుల్ రన్‌లో ఈ చిత్రం 25 కోట్లకు పైగా లాభాలు తీసుకొచ్చింది ఇస్మార్ట్ శంకర్.

4) అర్జున్ రెడ్డి:

విజయ్ దేవరకొండను రాత్రికి రాత్రే సూపర్ స్టార్ చేసిన సినిమా అర్జున్ రెడ్డి. 2017 ఆగస్ట్ 25న విడుదలైన ఈ చిత్రాన్ని సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించాడు. ఈ చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ కేవలం 5 కోట్లు మాత్రమే.. కానీ తొలిరోజే 6 కోట్ల వరకు వసూలు చేసింది ఈ చిత్రం. ఇక ఫుల్ రన్ అయ్యేసరిరి 26 కోట్లు వసూలు చేసి 20.30 కోట్ల లాభాల్ని దక్కించుకుంది.

5) మజిలీ:

పెళ్లి తర్వాత చైతూ, సమంత కలిసి నటించిన తొలి సినిమా మజిలి. నిన్నుకోరి లాంటి సినిమా తర్వాత శివ నిర్వాణ తెరకెక్కించిన ఈ చిత్రంపై ముందు నుంచి కూడా భారీ అంచనాలే ఉన్నాయి. విడుదలైన తర్వాత దాన్ని నిజం చేస్తూ ఈ చిత్రం 39 కోట్ల షేర్ వసూలు చేసింది. ఈ చిత్రం 19.2 కోట్ల లాభాల్ని తీసుకొచ్చింది.

6) అ ఆ:

స్టార్ హీరోలతో కాకుండా తొలిసారి త్రివిక్రమ్ చిన్న హీరోతో చేసిన సినిమా అ..ఆ. నితిన్, సమంత జంటగా నటించిన ఈ సినిమాకు 20 కోట్లకు పైగానే లాభాలు వచ్చాయి. మూడేళ్ల కింద విడుదలైన ఈ చిత్రం 49 కోట్ల వరకు షేర్ వసూలు చేసింది.

7) భలే భలే మగాడివోయ్:

అప్పటి వరకు నార్మల్ హీరోగా ఉన్న నానిని.. నేచురల్ స్టార్ చేసిన సినిమా భలే భలే మగాడివోయ్. మారుతి తెరకెక్కించిన ఈ చిత్రం 2015లో విడుదలైంది. ఒకటి రెండు కాదు అప్పట్లోనే ఈ చిత్రం గీతా ఆర్ట్స్, యువీ క్రియేషన్స్‌కు 19 కోట్ల లాభాల్ని తీసుకొచ్చింది. 8.4 కోట్ల బిజినెస్ చేసిన ఈ చిత్రం ఫుల్ రన్‌లో 27 కోట్లకు పైనే షేర్ వసూలు చేసింది.

8) ప్రతీరోజూ పండగే:

మొన్నటికి మొన్న మారుతి తెరకెక్కించిన సినిమా ప్రతిరోజూ పండగే. చిత్రలహరి లాంటి హిట్ తర్వాత సాయి ధరమ్ తేజ్ నటించిన సినిమా ఇది. డిసెంబర్ 20న విడుదలైన ఈ చిత్రం ఫుల్ రన్ కలెక్షన్స్ ఇప్పుడు వచ్చాయి. దీనికి 35 కోట్ల వరకు షేర్ వచ్చింది. 18 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగితే.. 35 కోట్ల వరకూ షేర్ రాబట్టింది ప్రతిరోజూ పండగే.

9) శతమానం భవతి:

దిల్ రాజు నిర్మాతగా 2017 సంక్రాంతికి వచ్చిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ శతమానం భవతి. శర్వానంద్, అనుపమ పరమేశ్వరన్ జంటగా వచ్చిన ఈ చిత్రాన్ని సతీష్ వేగేశ్న తెరకెక్కించాడు. దీనికి నేషనల్ అవార్డు కూడా వచ్చింది. ఈ చిత్రం 15 కోట్ల లాభాలను తీసుకొచ్చింది. ఈ చిత్రానికి బిజినెస్ 19 కోట్ల వరకు జరిగితే.. వసూలు చేసింది 34 కోట్ల షేర్.

10) నేను లోకల్:

నేచురల్ స్టార్ నాని హీరోగా త్రినాథరావు నక్కిన తెరకెక్కించిన సినిమా నేను లోకల్. వరస విజయాలతో జోరుమీదున్న నానిని మాస్‌కు మరింత చేరువ చేసిన సినిమా ఇదే. కీర్తి సురేష్ ఇందులో హీరోయిన్. ఈ చిత్రం 2017లో విడుదలైంది. ఈ చిత్రం 14.6 కోట్ల లాభాల్ని తీసుకొచ్చింది. 35 కోట్ల షేర్ వసూలు చేసి అప్పటికి నాని కెరీర్‌లో హైయ్యస్ట్ గ్రాసర్‌గా నిలిచింది.

More Related Stories