English   

బుల్లితెర నటి శ్రావణి ఆత్మహత్య కేసులో ఆర్ఎక్స్ 100 నిర్మాత పరారీ..

RX100 producer
2020-09-15 13:35:09

బుల్లితెర నటి శ్రావణి ఆత్మహత్య కేసు సంచలన మలుపులు తిరుగుతుంది. ఈమె సూసైడ్ కేసును హైదరాబాద్ పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. వీలైనంత త్వరగా అసలు నేరస్తులకు శిక్షపడేలా వాళ్ళు తమ వంతు ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే శ్రావణి జీవితంలో కీలక పాత్రలు పోషించిన దేవరాజు రెడ్డితో పాటు సాయి కృష్ణారెడ్డిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అసలు ఈ కేసు విషయంలో ఏం జరిగింది అనేది పోలీసులు మీడియాకు తెలిపారు. శ్రావణి 2012లో హైదరాబాద్‌కు వచ్చి సినిమాలలో అవకాశాల కోసం ప్రయత్నించింది. అదే సమయంలో ఆమెకు 2015లో సాయి క్రిష్ణారెడ్డితో పరిచయం ఏర్పడి స్నేహంగా మారింది. ఆ తర్వాత రెండేళ్లకు శ్రావణి జీవితంలోకి ఆర్ఎక్స్ 100 నిర్మాత అశోక్ రెడ్డి వచ్చాడు. ఆయనతో పరిచయం కూడా శ్రావణికి స్నేహంగా మారింది. ప్రేమతో మీ కార్తీక్ సినిమాలో ఆమెకు చిన్న పాత్రను ఇచ్చాడు అశోక్ రెడ్డి. ఇద్దరి మధ్య స్నేహం కొనసాగింది. 2019లో దేవరాజ్‌తో పరిచయం ఏర్పడింది. ఒకానొక సమయంలో దేవరాజ్‌ను పెళ్లి చేసుకోవాలని శ్రావణి అనుకుంది. అది నచ్చక సాయి, అశోక్ రెడ్డితో పాటు కుటుంబ సభ్యులు వేధించారు. 

దేవరాజ్ కూడా మొదట్లో పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. కానీ వీరితో సంబంధాల కారణంగా దూరం పెట్టాడు. ముగ్గురూ పెళ్లి చేసుకుంటానని చెప్పిన వాళ్లే. ఆ తర్వాత వేధించడంతో మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకుంది అంటూ డీజీపీ శ్రీనివాస్ మీడియాకు తెలిపాడు. ఈ క్రమంలో ఇప్పటికే దేవరాజు రెడ్డి తో పాటు సాయికృష్ణ రెడ్డిని కూడా పోలీసులు అరెస్టు చేశారు. ఆర్ఎక్స్ 100 నిర్మాత అశోక్ రెడ్డి మాత్రం పరారీలో ఉన్నాడు. ప్రస్తుతం ఈయన కోసం పోలీసులు గాలిస్తున్నారు. తెలుగు బుల్లితెరపై మౌనరాగం, మనసు మమత లాంటి సీరియల్స్ తో నటి శ్రావణి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈమె సెప్టెంబర్ 8న రాత్రి 8 గంటల సమయంలో ఆత్మహత్య చేసుకుంది. హైదరాబాద్ మధురానగర్‌లోని తన నివాసంలో ఉరివేసుకొని మరణించింది.  

More Related Stories