English   

104 డిగ్రీల జ్వరంలో చిరంజీవి డ్యాన్స్

 Chiranjeevi
2020-05-09 12:07:29

తెలుగు సినిమాల్లో క్లాసిక్ అనదగ్గ సినిమాల్లో `జగదేక వీరుడు అతిలోక సుందరి` సినిమా ఒకటి. మెగాస్టార్ చిరంజీవి, అతిలోక సుందరి శ్రీదేవి హీరోహీరోయిన్లుగా దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు తెరకెక్కించిన ఈ సినిమా ఆరోజుల్లోనే బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. ఈ సినిమా విడుదలై 30 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఈ సినిమాని నిర్మించిన నిర్మాణ సంస్థ `వైజయంతీ మూవీస్` అప్పటి సంగతులను ప్రేక్షకులతో వీడియోల రూపంలో పంచుకుంటోంది. ఈ సినిమా పుట్టుక వెనుకున్న కథను మొదట ఒక వీడియోలో నాని వాయిస్ తో పేర్కొంది. తాజాగా విడుదల చేసిన రెండో వీడియోలో ఈ సినిమాలో పాటల వెనుక ఉన్న ఆసక్తికర విషయాలను పంచుకుంది. దీనిని కూడా నాని వాయిస్‌ తోనే అందించారు.ఈ సినిమాకు ఇళయరాజా సంగీతాన్ని అందించగా ఇందులో అన్నీ పాటలు మెలోడీ ట్యూన్స్ లోనే కుదిరాయట. 

అయితే చిరంజీవి, శ్రీదేవీ అంటే మాస్ బీట్ లేకుండా బాగోదు కాబట్టి ట్యూన్‌ మార్చాలని అనుకున్నా, ఇళయరాజా ఇచ్చిన ట్యూన్ మార్చడం అశ్వనీదత్‌కు ఇష్టం లేదట. అందుకే ఈ విషయం అర్ధమయ్యి పాటల రచయిత వేటూరి అదే ట్యూన్‌ను మాస్‌ ట్యూన్‌గా చేస్తాను చూడండి అని చెప్పి.. అబ్బనీ తియ్యని దెబ్బ అనేది రాశారట. ఈ పాటను రెండే రోజుల్లో మైసూరులో చిత్రీకరించారట. ఇక సినిమాలోని దినక్కు తా పాట కోసం వాహినీ స్టూడియోలో భారీ సెట్ వేశారట. అయితే ఆ పాట షూటింగ్ పూర్తి చేసుకుని హిందీ సినిమా కోసం శ్రీదేవి ముంబై వెళ్లిపోవాలి.

కానీ అదే సమయంలో చిరంజీవి 104 డిగ్రీల జ్వరంతో బాధపడుతున్నారు. జ్వరం ఉందని షూటింగ్‌ ఎగ్గోడితే తర్వాత శ్రీదేవి డేట్లు దొరకడం కష్టం. దీంతో చిరంజీవి 104 డిగ్రీల జ్వరంతోనే షూటింగ్‌కు హాజరయ్యారు. అంత హై ఫీవర్ ఉన్నప్పటికీ ఎక్కడా తేడా రాకుండా శ్రీదేవితో సమానంగా డ్యాన్స్ వేసి మొహంలో ఎక్కడా కనపడకుండా మేనేజ్ చేశారు. ఇది కాక సినిమాలోని ఇతర పాటల గురించిన ఆసక్తికర విషయాలను కూడా పంచుకున్నారు.  

More Related Stories