English   

రామ్ చరణ్ మగధీరకు 11 ఏళ్ళు.. రాజమౌళి సెవెన్త్ వండర్..

Ram Charan
2020-07-31 16:57:47

అప్పటి వరకు తెలుగు సినిమాకు ఉన్న మార్కెట్ 40 కోట్లు మాత్రమే. అది కూడా మహేష్ బాబు పోకిరి సినిమాకు వచ్చినవే. 2006లో పోకిరి విడుదలైంది. ఆ తర్వాత మూడేళ్ల పాటు మళ్లీ ఆ సినిమా జోలికి ఎవరూ వెళ్లలేదు. ఈ మూడేళ్ల గ్యాప్ లో ఎన్ని సినిమాలు వచ్చినా కూడా ఏదీ పోకిరి రికార్డులకు మాత్రం చేరువ కాలేకపోయింది. అలాంటి సమయంలో మగధీర విడుదలైంది. 2009, జులై 31న విడుదలైన ఈ చిత్రాన్ని రాజమౌళి తెరకెక్కించాడు. అప్పటి వరకు తెలుగు సినిమా కలలో కూడా ఊహించని రికార్డులకు తెర తీసింది ఈ చిత్రం. ఒక్క రికార్డ్ కూడా వదలకుండా మగధీరుడు అన్నీ తన ఖాతాలో వేసుకున్నాడు. ముఖ్యంగా రామ్ చరణ్ కు కేవలం ఒకే ఒక్క సినిమా అనుభవం ఉంది. అలాంటి కొత్త హీరోపై అల్లు అరవింద్ 40 కోట్లు బడ్జెట్ పెట్టాడు. మగధీర తెరకెక్కిస్తున్న సమయంలో అంతా విమర్శించిన వాళ్లే ఎక్కువగా ఉన్నారు. కానీ రాజమౌళి అద్భుతం చేసి చూపించాడు.

ఒకటి రెండు కాదు అప్పుడున్న టికెట్ రేట్స్ తోనే ఈ చిత్రం ఏకంగా 80 కోట్ల వసూళ్లు సాధించింది. ఇప్పటికీ కొన్ని ఏరియాల్లో మగధీర రికార్డులను కొట్టే సినిమా ఇప్పటి వరకు రాలేదంటే దాని ఇంపాక్ట్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. రాజమౌళి విజువల్ ఎఫెక్ట్స్ వాడుకున్న తీరు కానీ.. నటీనటులను యూజ్ చేసుకున్న తీరు కానీ.. అన్నీ అద్భుతమే. అప్పటి వరకు ఆయన చేసిన ఆరు సినిమాలు ఒకెత్తు అయితే ఏడో సినిమా మరో ఎత్తు. సెవెన్త్ వండర్ అన్నట్లుగానే నిజంగా మగధీరను అద్బుతంగా తెరకెక్కించి ఔరా అనిపించాడు దర్శకధీరుడు. ఈ చిత్రంతో రామ్ చరణ్ మార్కెట్ కాదు.. తెలుగు సినిమా మార్కెట్ పెంచేసాడు జక్కన్న. కాజల్ అగర్వాల్ ఈ చిత్రంతోనే స్టార్ హీరోయిన్ అయిపోయింది. ఇలా ఎంతోమంది కెరీర్ కు మగధీర తీపిగుర్తుగా మారింది. విజువల్ ఎఫెక్ట్స్.. కొరియోగ్రఫీలో రెండు నేషనల్ అవార్డులు సైతం అందుకుంది మగధీర. 11 ఏళ్లైనా కూడా ఇప్పటికీ మగధీరకు అదే క్రేజ్ ఉండటం విశేషం.

More Related Stories