English   

14న ప్రెస్ మీట్...రాజమౌళి ఏమి చెబుతారో ?

RRR
2019-03-12 08:57:45

బాహుబలి సిరీస్ తో ప్రపంచ వ్యాప్త గుర్తింపు పొందిన తరువాత దర్శకదీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న మల్టీస్టారర్ 'ఆర్ఆర్ఆర్' (రామరావణ రాజ్యం అనే వర్కింగ్ టైటిల్) మూవీలో టాలీవుడ్‌లోని ఇద్దరు పెద్ద స్టార్ హీరోలు కలిసి నటిస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. అందుకే సినిమాకి సంబంధించి ఏదో ఒక గాసిప్ రోజూ వినిపిస్తూనే ఉంటుంది. ఆర్‌ఆర్‌ఆర్‌ అనే ప్రకటన మొదలైనప్పటి నుంచి ఈరోజువరకూ ఎన్నో వార్తలు సామాజిక మాధ్యమాల వేదికగా హల్‌చల్‌ చేస్తున్నాయి. రామ్ చరణ్ పోలీస్ ఆఫీసర్ అని, ఎన్టీఆర్ నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపిస్తారని, బాక్సింగ్ నేపథ్యంలో సినిమా ఉంటుందని, రెండు జన్మల కథని, ప్రభాస్‌ అతిథి పాత్ర ఉంటుందని, బాలీవుడ్‌లోని టాప్‌ హీరోయిన్స్‌ నటిస్తున్నారని ఇలా రోజుకో వార్త పుట్టుకొస్తూనే ఉంది. అయితే, సినిమా సెట్స్ పైకి వెళ్లినా దీనికి సంబంధించి రాజమౌళి ఒక్క విషయాన్ని కూడా బయటకు రానీయలేదు. వాస్తవానికి రాజమౌళి సినిమాను ప్రారంభించే రోజే ఆ సినిమాకు సంబంధించిన విశేషాలను రివీల్ చేసేవాడు కానీ బాహుబలి నుండి గోప్యత పాటిస్తున్నాడు. ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తి అయినా ఆర్ఆర్ఆర్ గురించి మాత్రం ఏ వివరమూ బయటకు అయన రానీయలేదు, అయితే తాజాగా 14వ తేదీన రాజమౌళి మీడియా సమావేశం నిర్వహిస్తారని టాలీవుడ్ వర్గాల సమాచారం. ఈ మీడియా సమావేశంలో సినిమాకు సంబంధించిన కొంత సస్పెన్స్ వీడిపోతుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే ఈ మీడియా సమావేశం గురించి కూడా అధికారిక ప్రకటన వెలువడాల్సివుంది.

More Related Stories