English   

అక్టోబర్ 15 వచ్చింది.. కానీ సినిమాలు రావడం లేదు ఏంటి..

Cinemas
2020-10-16 09:09:58

కేంద్రం చెప్పినట్లు అక్టోబర్ 15 రానే వచ్చింది. ఏడు నెలలుగా మూతపడిన థియేటర్స్, మల్టీప్లెక్స్ లు మళ్ళీ ఓపెన్ చేసుకోవచ్చు అంటూ వాళ్ళు ఇచ్చిన అనుమతి బేఖాతరు చేస్తున్నారు దర్శక నిర్మాతలు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సినిమాను విడుదల చేయడం కంటే.. పూర్తయిన సినిమాలు తమ చేతుల్లో పెట్టుకోవడం నయం అని వాళ్ళు ఫీలవుతున్నారు. అందుకే విడుదలకు సిద్ధంగా ఉన్న సినిమాలు కూడా బాక్స్ లోనే ఉండిపోతున్నాయి. ఇప్పుడు థియేటర్స్ ఓపెన్ చేసుకున్నా కూడా లాభం లేదు. అయితే బయట పరిస్థితులు ఎలా ఉన్నాయి.. ఒకవేళ థియేటర్స్ ఓపెన్ చేస్తే జనాలు మళ్లీ వస్తారా రారా అని చెక్ చేసుకోవడానికి పాత సినిమాలు మళ్లీ విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలోనే హిందీలో తానాజీతో పాటు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ నటించిన చివరి సినిమా దిల్ బేచార కూడా విడుదలవుతుంది. ఇది మాత్రమే కాదు ప్రధాన మంత్రి నరేంద్రమోడీ బయోపిక్ మరోసారి థియేటర్ లోకి వచ్చింది. కానీ ప్రేక్షకుల నుంచి ఆశించిన స్పందన మాత్రం రావడం లేదు.

మరోవైపు కన్నడనాట కూడా జూన్ లో కన్నుమూసిన చిరంజీవి సర్జా నటించిన చివరి సినిమా శివార్జున సినిమాను మరోసారి థియేటర్లో విడుదల చేశారు. దాంతో పాటు మరో మూడు సినిమాలు కూడా మరోసారి థియేటర్లో విడుదల అయ్యాయి. ఇలా ఎన్ని సినిమాలు వచ్చినా ఆడియన్స్ నుంచి మాత్రం రెస్పాన్స్ రావడం లేదు. దాంతో కొత్త సినిమాలు విడుదల చేయాలంటే నిర్మాతలు భయపడుతున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులు చూస్తుంటే సంక్రాంతి వరకు కూడా కొత్త సినిమాలు ఏవీ మల్టీప్లెక్స్ కానీ థియేటర్ మొహం కానీ చూసేలా కనిపించడం లేదు. మరోవైపు ఇప్పుడు సినిమాలు విడుదల చేసినా కానీ 50 శాతం మాత్రమే టికెట్స్ అమ్ముకోవాలనే రూల్ నిర్మాతలకు నచ్చడం లేదు. అందుకే ప్రభుత్వానికి వాళ్ళు లేఖ రాస్తున్నారు.. మీరు ఇచ్చిన అనుమతిని మేము ఉపయోగించుకోలేకపోతున్నాం.. ఇప్పుడు థియేటర్స్ ఓపెన్ చేయడం లేదు అంటూ వాళ్ళు చెబుతున్నారు. ఏదైనా అక్టోబర్ 15 తర్వాత థియేటర్స్ ఓపెన్ అవుతాయి అని ఆశలు పెట్టుకున్న డిస్ట్రిబ్యూటర్లకు నిరాశే ఎదురైంది. మళ్లీ హౌస్ ఫుల్ బోర్డులు చూసే మోక్షం ఎప్పుడు కలుగుతుందో చూడాలి. 

More Related Stories