English   

 అల్లు అర్జున్ కు పదిహేనేళ్లు

Allu-Arjun-15years
2018-03-28 16:20:17

ఉరకలేసే ఉత్సాహానికి కేరాఫ్ అంటే అల్లు అర్జున్. అతని ఎనర్జీ లెవెల్స్ ఏ రేంజ్ లో ఉంటాయో అందరికీ తెలిసిందే. ఆకతాయిగా కనిపించినా.. అవకాశం వస్తే అద్భుతమైన నటననూ చూపిస్తాడు. ఆరంభంలోనే ఆర్యగా అతను చేసిన హడావిడీ ఇప్పటికీ ట్రెండ్ సెట్టర్ గానే నిలుస్తోంది. అల్లు అరవింద్ కొడుకుగా పరిచయమైనా తనకే సొంతమైన ఎనర్జిటిక్ పర్ఫార్మెన్స్ తో అల్లు అర్జున్ వాళ్ల నాన్న అరవింద్ అనేలా చేయగలిగాడు. నేటితో బన్నీ ఇండస్ట్రీకి వచ్చి పదిహేనేళ్లు. ఈ సందర్భంగా అతని కెరీర్ ను ఓ సారి చూద్దాం.. 
 
అల్లు అర్జున్ .. బార్న్ విత్ ‘సిల్వర్ స్క్రీన్’. ఆ రోజుల్లో యావత్ ఆంధ్రదేశానికి సరికొత్త ఇన్స్ స్పిరేషన్ గా నిలిచిన చిరంజీవి ఇంట్లోనే ఉండటంతో ఆటోమేటిక్ గా ఆ రంగంపై మక్కువ పెరిగింది. దీనికి తోడు చిరంజీవిలా డ్యాన్స్ చేయాలనే తపన మనోడిలోని సరికొత్త టాలెంట్ నేర్చుకునేందుకు స్టెప్పులు వేసింది. మామయ్య ప్రేరణతోనే వెండితెరపై వెలిగిపోవాలని కలలు కన్నాడు. వాటిని సాకారం చేసుకోవడానికి అన్ని విధాలుగా  కష్టపడ్డాడు. రాఘవేంద్రరావు చేతుల మీదుగా హీరోగా గంగోత్రితో అరంగేట్రం చేసిన అల్లు అర్జున్ తొలి ప్రయత్నంలో పెద్దగా మెప్పించలేకపోయాడనే చెప్పాలి.. గంగోత్రి అతని వయసుకు తగ్గదే అయినా బన్నీ హీరోగా పరిచయం కావడం వెనక అతిరథమహారథులున్నా.. సినిమా హిట్ అయినా ఏదో కొంత వెలితి కనిపించింది. 
 
కానీ రెండో సినిమా ఆర్యతో చాలా ఆశ్చర్యకరమైన రేంజ్ లో మారిపోయాడు బన్నీ. మేకోవర్ నుంచి యాక్టింగ్ స్కిల్స్ వరకూ ఎవ్వరూ ఊహించని స్థాయిలో మారిపోయాడు. బన్నీ ఎనర్జీని.. యాక్టింగ్ స్కిల్ ను ఇంటర్ డ్యూస్ చేసిన సినిమా. ఈ సినిమాతోనే టాలీవుడ్ కు సుకుమార్ పరిచయమయ్యాడు. ఆర్య టైటిల్ రోల్ లో బన్నీని తప్ప ఇంకెవరినీ ఊహించలేం అన్నంతగా చెలరేగిపోయాడు. వన్ సైడ్ లవర్ గా ఉంటూనే.. మనస్ఫూర్తిగా హీరోయిన్ ని ప్రేమించే పాత్రలో ఉన్న అన్ని రకాల ఎమోషన్స్ నూ అద్భుతంగా పలికించాడు. కుర్రాడు ఎలా ఉన్నా.. వచ్చింది మెగా ఫ్యామిలీ నుంచి కాబట్టి ఖచ్చితంగా మాస్ ను ఎట్రాక్ట్ చేయాలి. అందుకే వినాయక్ ను రంగంలోకి దించారు. తన ముద్దు పేరునే టైటిల్ గా పెట్టి బన్నీ తీశారు. లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వచ్చిన బన్నీ అతనిలోని మాస్ యాంగిల్ ను చూపించింది. 
 
పవన్ కళ్యాణ్ కు తొలిప్రేమ వంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన దర్శకుడు కరుణాకరన్ తో చేసిన హ్యాపీ సినిమా బావున్నా ఎందుకో ఆడియన్స్ కు హండ్రెడ్ పర్సెంట్ కనెక్ట్ కాలేదు. అల్లు అర్జున్ లో ఎనర్జీ లెవెల్స్ పీక్స్ లో ఉంటాయి.. కానీ నటుడిగా ఇంకొంత ఈజ్ చూపిస్తే బావుండు అని అప్పుడప్పుడూ అనిపించేది. దీంతో ఈ సారి పూరీ జగన్నాథ్ ను రంగంలోకి దించారు. అతని ఎనర్జీని ఫుల్లుగా వాడేసుకుని దేశముదురుగా చూపించాడు పూరీ. ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ పర్ఫెక్ట్ మాస్ హీరోగా అవతరించాడు. ఒక్కసారి మాస్ హీరోగా ఇమేజ్ వచ్చిన తర్వాత ఎవరైనా సేఫ్ జోన్ లో జర్నీ చేస్తారు. కానీ బన్నీ  తనలోని నటుడ్ని చూపించేందుకు ఏ మాత్రం ఛాన్స్ వచ్చినా వదులుకోలేదు. అందుకే బొమ్మరిల్లుతో సూపర్ హిట్ కొట్టిన భాస్కర్ డైరెక్షన్ లో పరుగు చేశాడు. అప్పటి వరకూ తనకున్న ఇమేజ్ కు భిన్నమైన పాత్రలో నటించి మెప్పించాడు. ప్రకాష్ రాజ్ వంటి వెర్సటైల్ పర్ఫార్మర్ కు దీటుగా క్లైమాక్స్ లో అదరగొట్టాడు. 
 
కొన్ని కాంబినేషన్స్ వన్ టైమ్ వండర్స్ గా నిలిచిపోతాయి. అలాంటిదే సుకుమార్, బన్నీ కాంబినేషన్. ఆర్య తర్వాత ఆర్య-2 అంటూ వచ్చారు. నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించిన బన్నీ అందరినీ ఆశ్చర్యపరిచాడు. పాత్ర పరంగా అతని నటన అద్భుతం అనిపించుకున్నా.. ఆర్య స్థాయిలో ఆర్య-2 ఆకట్టుకోలేకపోయింది. తర్వాత క్రియేటివ్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న గుణశేఖర్ అప్పటికే ఫ్లాపుల్లో ఉన్నా.. అతని టాలెంట్ పై నమ్మకంతో వరుడు చేశాడు. వరుడుకు ఏది ప్లస్ అవుతుందనుకున్నారో అదే మైనస్ గా మారి డిజాస్టర్ గా మిగిలింది.  అల్లు అర్జున్ ఇమేజ్ కు భిన్నంగా పాత్రతో కనెక్ట్ అయిన ప్రతిసారీ గమనం మార్చాడు. గమ్యంతో ఎంటైర్ టాలీవుడ్ ను ఎట్రాక్ట్ చేసిన క్రిష్ తో వేదం చేయడానికి ఇదే కారణం. హీరో అనే పదానికి కాస్త దూరంగా ఉండే పాత్రతో కేబుల్ రాజుగా బన్నీ నటన కన్నీళ్లు పెట్టించింది. వేదంతో తనలోని కొత్తకోణాన్ని ఆడియన్స్ కే కాదు.. తన ఫ్యామిలీకీ తెలిసేలా చేశాడు. 
 
బద్రీనాథ్.. బన్నీ కెరీర్ లో మరో భారీ డిజాస్టర్.. వివి వినాయక్ తో అంతకు ముందు చేసిన బన్నీ రిజల్ట్ ను రిపీట్ చేయలేకపోయింది బద్రీనాథ్. ఈ సినిమా అతనికి చాలా పాఠాలే నేర్పింది. తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ తో చేసిన జులాయితో కలెక్షన్ల వర్షం కురిపించాడు. చాలా యేళ్లుగా తన హీరోను ఒకేలా చూపిస్తోన్న పూరీ జగన్నాథ్ తో మరోసారి ట్రై చేశాడు. ఇద్దరమ్మాయిలతో అంటూ కాసింత వైవిధ్యమైన కథతో వచ్చినా ఇది పెద్దగా ఆడలేదు. అందుకే మాస్ హీరో అనగానే ఎగిరి స్టెప్పులు వేయకుండా మళ్లీ త్రివిక్రమ్ తోనే సన్నాఫ్ సత్యమూర్తిగా వచ్చాడు. నటనతో విమర్శకుల ప్రశంసలను పొందాడు. ఇక రామ్ చరణ్ హీరోగా నటించిన ఎవడులో చిన్న పాత్ర చేసి పెద్ద మనసును చాటుకున్నాడు. 
 
రేస్ గుర్రంతో మరోసారి బ్లాక్ బస్టర్ సొంతం చేసుకున్నాడు. ఈ సినిమాలో చెప్పినట్టుగా అతను పాత్రతో కనెక్ట్ అయిపోతే అందులో మనల్నీ కనెక్ట్ చేస్తాడు.. కలెక్షన్లు కొల్లగొడతాడు. ఓ రకంగా వరుస బ్లాక్ బస్టర్స్ తో మెగా హీరో అనే ట్యాగ్ నుంచి మెల్లగా బయటకు వస్తున్నాడనే చెప్పాలి. అంటే మెగా ఫ్యాన్సే తమ ఫ్యాన్స్ కాకుండా తనకంటూ ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకున్నాడు బన్నీ. అందుకే ఈ తరం కుర్రాళ్లలో తొలిసారిగా మళయాలంలో కూడా స్టార్ హీరో రేంజ్ లో మార్కెట్ సంపాదించుకున్నాడు.. అక్కడ మోహన్ లాల్, మమ్ముట్టి తర్వాత ఆ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అల్లు అర్జున్ కే అంటే ఆశ్యర్యం లేదు. 

బోయాపటి శ్రీనుతో చేసిన సరైనోడు అతని కెరీర్ లో ఆల్ టైమ్ హిట్. అటు బాలీవుడ్ డబ్బింగ్ సినిమా మార్కెట్లోనూ సరైనోడుది తిరుగులేని రికార్డ్. లాస్ట్ ఇయర్ హరీష్ శంకర్ తో చేసిన డిజేకు అద్దిరిపోయే ఓపెనింగ్స్ తో పాటు మంచి కలెక్షన్లూ వచ్చాయి. ఇది కూడా హిందీ డబ్బింగ్ మూవీస్ లో ఓ రికార్డ్ క్రియేట్ చేసింది. ప్రస్తుతం నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా అంటూ వస్తున్నాడు. మే 4న విడుదల కాబోతోందీ సినిమా. దీని తర్వాత మరోసారి సుకుమార్ తోనే సినిమా చేస్తాడని వినిపిస్తోంది. మొత్తంగా ఈ  పదిహేనేళ్లలో చెప్పను బ్రదర్ అనే వివాదం తప్పితే ప్రతి సినిమాకూ సత్తా చాటుతూ మెగా ట్యాగ్ తొలగించుకుని తనదైన ఇమేజ్ ను ‘అల్లు ’కుంటూ వెళుతున్న బన్నీ వ్యక్తిగానూ చాలా మెచ్యూర్ అయ్యాడు. 

More Related Stories