English   

సింహాద్రి సినిమాకు 17 ఏళ్ళు.. నందమూరి చిన్నోడి విశ్వరూపం..

NTRs Simhadri
2020-07-10 10:08:26

అది 2003, జులై 9.. ఆ ఏడాది తెలుగు సినిమాకు పెద్దగా కలిసి రావడం లేదు. అప్పటికే కొన్ని సినిమాలు వచ్నినా కూడా విజయాల శాతం మాత్రం తక్కువగానే ఉంది. ఒక్కడు లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఆ ఏడాది మళ్లీ ఆ స్థాయి బ్లాక్ బస్టర్ రాలేదు. అలాంటి సమయంలో వచ్చింది ఓ సినిమా.. దాని పేరు సింహాద్రి. సింగమలై అంటూ ఓ నూనూగు మీసాల కుర్రాడు ఇండస్ట్రీ రికార్డులను తునాతునకలు చేసాడు. అప్పటికే స్టూడెంట్ నెం 1, ఆది లాంటి సినిమాలతో సొంత గుర్తింపు తెచ్చుకున్న జూనియర్ ఎన్టీఆర్ సింహాద్రితో ఏకంగా సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఈ సినిమా వచ్చి సరిగ్గా 17 ఏళ్లవుతుంది. 

అప్పట్లోనే ఈ చిత్రం సాధించిన చరిత్ర గురించి చెప్పడానికి పేజీలు సరిపోవేమో..? 20 ఏళ్లు కూగా లేని ఓ కుర్రాడు చేసిన రచ్చకు ఇండస్ట్రీ రికార్డులు తమ రూపురేఖలు మార్చుకున్నాయి. అంతగా కసితీరా బాక్సాఫీస్ ను కుమ్మేసాడు నందమూరి చిన్నోడు. తాతకు తగ్గ మనవడు కాదు.. ఏకంగా మించే మనవడు అనిపించుకునేలా కెరీర్ లో తొలి అడుగులు వేసాడు ఈయన. ఇక రాజమౌళి కూడా స్టూడెంట్ నెం 1 లాంటి క్లాస్ సినిమా తర్వాత సింహాద్రితో టాప్ డైరెక్టర్ అయిపోయాడు. ఈయన టేకింగ్.. కేరళ బ్యాక్ డ్రాప్ అన్నీ కలిసి సినిమాను సంచలన విజయం దిశగా అడుగులు వేయించాయి. ముఖ్యంగా తారక్ నటనకు జోహార్లు పట్టారు ప్రేక్షక లోకం. ఆ రోజుల్లోనే ఈ చిత్రం దాదాపు 28 కోట్ల షేర్ వసూలు చేసి అప్పటికి ఇంద్ర పేరు మీదున్న రికార్డులను తిరగరాసింది. 

150 సెంటర్లలో 100 రోజులు ఆడటమే కాకుండా 175 రోజులు, ఏడాది పాటు ఆడింది సింహాద్రి. భూమిక చావ్లా, అంకిత అందాలు కూడా సినిమాకు బోనస్. సింగమలైగా కేరళ ఎపిసోడ్ అయితే సినిమాకు ప్రాణం. దొరస్వామిరాజు నిర్మించిన ఈ చిత్రం కాసుల పంట పండించింది. ఇక రాజమౌళిని కూడా స్టార్ డైరెక్టర్ గా మార్చేసింది. ఈ చిత్రం తర్వాత ఆయన రేంజ్ పదింతలు పెరిగిపోయింది. సింహాద్రి సినిమాను ఆ తర్వాత తమిళ, కన్నడతో పాటు మరికొన్ని భాషల్లోకి కూడా రీమేక్ చేసారు. అయితే అక్కడ మాత్రం ఫలితం అనుకున్నట్లుగానే రాలేదు. 

More Related Stories