English   

2.0 ట్రైల‌ర్.. హాలీవుడ్ సినిమా చూపించిన శంక‌ర్.. 

2.O-Trailer
2018-11-03 13:39:58

క‌ళ్ల‌ముందు మ‌నం చూస్తున్న‌ది నిజంగా నిజ‌మా కాదా అనే ఓ ఫీలింగ్ వ‌చ్చిన‌పుడు ఎలా ఉంటుంది..? ఇప్పుడు 2.0 ట్రైల‌ర్ చూస్తుంటే కూడా ఇదే అనిపిస్తుంది మ‌న‌కు. అస‌లు మ‌నం చూస్తున్న‌ది నిజంగానే ఇండియ‌న్ సినిమా ట్రైల‌రా.. లేదంటే హాలీవుడ్ సినిమానా అనే అనుమానం వ‌చ్చేలా ట్రైల‌ర్ క‌ట్ చేసాడు శంక‌ర్. అస‌లు ఇది చూసిన త‌ర్వాత ఆయ‌న విజ‌న్ కు దండం పెట్ట‌క త‌ప్ప‌దు. అయితే క‌థ లేకుండా కేవ‌లం గ్రాఫిక్స్ మాత్ర‌మే చూపించాడు ట్రైల‌ర్ లో అదే ఆస‌క్తిక‌రంగా మారింది. 

సినిమా క‌థ అంతా మొబైల్ చుట్టూనే తిరుగుతుంది. ఇందులో మొబైల్స్ వాడ‌కం వ‌ల్ల జ‌నాల్లో వ‌చ్చే రోగాల గురించి శంక‌ర్ క‌థ రాసుకున్న‌ట్లుగా ట్రైల‌ర్ చూస్తుంటే అర్థం అయిపోతుంది. ముఖ్యంగా ఒక్కో ఫ్రేమ్ అద్భుతంగా తెర‌కెక్కించాడు శంక‌ర్. 2.0 సినిమా కోసం ఏకంగా 500 కోట్లు పెట్టిస్తున్నాడు ఈ ద‌ర్శ‌కుడు. ఇది నిజంగా ఓ క‌ల‌. ఓ దక్షిణాది సినిమాకు 543 కోట్లు బ‌డ్జెట్ అనేది నిజంగా ఓ క‌ల‌. కానీ ఆ క‌ల‌ను ఇప్పుడు శంక‌ర్ తీరుస్తున్నాడు.  2.0ను హాలీవుడ్ సినిమాకు ధీటుగా తెర‌కెక్కిస్తున్నాడు శంక‌ర్. ఇంకా చెప్పాలంటే హాలీవుడ్ లో వ‌చ్చిన బ్యాట్ మ్యాన్.. డెడ్ పూల్ కూడా దీనికంటే త‌క్కువ బ‌డ్జెట్ తో తెర‌కెక్కాయి. ఎక్స్ మెన్ సినిమా బ‌డ్జెట్ ఇప్పుడు రోబో సీక్వెల్ కు పెట్టిన బ‌డ్జెట్ ఒక్క‌టే. అక్ష‌రాలా 75 మిలియ‌న్.. అంటే 543 కోట్లు. న‌టీన‌టులు మిన‌హాయిస్తే.. ఈ సినిమాకు ప‌నిచేస్తోన్న సాంకేతిక నిపుణులంతా హాలీవుడ్ సినిమాల‌కు ప‌నిచేసిన వాళ్లే. 3000 మంది టెక్నీషియ‌న్స్ మూడేళ్ల పాటు క‌ష్ట‌ప‌డితే వ‌చ్చిన ఔట్ పుట్ 2.0. ఇప్పుడు దీన్ని ఇండియ‌న్ సినిమా అన‌డం కూడా భావ్యం కాదేమో. హాలీవుడ్ సినిమాలు కూడా బిత్త‌ర‌పోయేలా దీన్ని తెర‌కెక్కించాడు శంక‌ర్. 2.0 బ‌డ్జెట్ ఏ స్థాయిలో ఉందో.. ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా అదే రేంజ్ లో న‌డుస్తోంది. ఈ సినిమా ఇప్ప‌టికే 500 కోట్ల బిజినెస్ పూర్తైపోయింది.

ట్రైల‌ర్ లాంచ్ కార్య‌క్ర‌మ‌మే సినిమా రిలీజ్ లా చేసాడు శంక‌ర్. సినిమాను అంతా 3డిలోనే తెర‌కెక్కించాడు ద‌ర్శ‌కుడు శంక‌ర్. హాలీవుడ్ సినిమా ల‌కు కూడా సాధ్యం కాని రికార్డ్ ఇది. అక్క‌డ 2డిలో చేసి 3డిలోకి మారుస్తారు. కానీ ఈయ‌న మాత్రం నేరుగా 3డిలో సినిమా చేసాడు. 2.0లో ఎంత ర‌జినీ, అక్ష‌య్ కుమార్ ఉన్నా కూడా ఇంత బ‌డ్జెట్ పెట్ట‌డం నిజంగా సేఫేనా అనే అనుమానం అంద‌ర్లోనూ వ‌స్తుంది. శంక‌ర్ ను చూసి చాలా మంది ద‌ర్శ‌కులు తాము కూడా సైన్స్ ఫిక్ష‌న్ తీస్తామంటూ వంద‌ల కోట్ల బ‌డ్జెట్ అడిగితే నిర్మాత‌ల ప‌రిస్థితి ఏంటి..? న‌వంబ‌ర్ 29న విడుద‌ల కానుంది ఈ చిత్రం.

More Related Stories