English   

2.0 రివ్యూ

2.0-Movie
2018-11-29 08:11:27

ఇండియ‌న్ సినిమా ఇండ‌స్ట్రీల‌న్నీ మూకుమ్మ‌డిగా వేచి చూస్తున్న సినిమా 2.0.. బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ఈ చిత్రం ఎలా మాయ చేస్తుందో అని అంతా చూస్తున్నారు. మొత్తానికి భారీ అంచ‌నాల మ‌ధ్య ఈ చిత్రం విడుద‌లైంది.. మ‌రి వాటిని ఎంత వ‌ర‌కు ఈ చిత్రం అందుకుంది..?

క‌థ‌: 

వ‌శీక‌ర‌ణ్(ర‌జినీకాంత్) త‌న ల్యాబోరెట‌రీలో ప్ర‌యోగాలు చేస్తూ ఉంటాడు. చిట్టిని డిస్ మ్యాండిల్ చేసిన త‌ర్వాత మ‌రో హ్యూమ‌న్ రోబో వెన్నెల‌(అమీజాక్సన్) ను సిద్ధం చేస్తాడు. అంతా బాగుంది అనుకుంటున్న టైమ్ లో సిటీలో స‌డ‌న్ గా అంద‌రి ఫోన్లు మాయం అయిపోతాయి. దాంతో ఏం చేయాలో తెలియ‌క వశీక‌ర‌ణ్ మ‌ళ్లీ చిట్టిని తీసుకొస్తాడు. ఈ ఫోన్లు మాయం కావ‌డం వెన‌క‌ ప‌క్షిరాజు(అక్ష‌య్ కుమార్) ఉంటాడ‌ని తెలుస్తుంది. అప్పుడు చిట్టి 2.0 వ‌చ్చి ఏం చేస్తుంది.. ఎలా ఉంటాడు.. ఎలా ప‌క్షిరాజును అంత‌మొందిస్తాడు అనేది క‌థ‌.. 

క‌థ‌నం: 

శంక‌ర్ సినిమా అంటే విజువ‌ల్ గ్రాండియ‌ర్ తో పాటు క‌థ కూడా బ‌లంగా ఉంటుంది. అలాగే సందేశం కూడా ఉంటుంది. అయితే ఐ సినిమాలో అది చెప్ప‌లేక‌పోయాడు శంక‌ర్. ఎందుకో పూర్తిగా గాడి త‌ప్పాడు. దాంతో 2.0ను మెసేజ్ ప్ల‌స్ విజువ‌ల్ గ్రాండియ‌ర్ ను తీసుకొచ్చాడు. ఈ సినిమాతో రేడియేష‌న్ స‌మ‌స్య‌లు.. ప‌క్షులు ప‌డుతున్న బాధ‌లు.. మొబైల్స్ వ‌ల్ల వ‌చ్చిన  న‌ష్టాల గురించి చూపించాడు శంక‌ర్. అయితే విజువ‌ల్ గా తాను చూపించాల‌నుకున్న క‌థ చూపించాడు కానీ కంటెంట్ ప‌రంగా మాత్రం కాదు. ఒక‌ప్పుడు ప్ర‌తీ సినిమాలోనూ చిన్న సీన్స్ కూడా ప్ర‌తిభావంతంగా చూపించిన శంక‌ర్ ఈ సారి మాత్రం మాయను న‌మ్ముకున్నాడు. తొలి సీన్ నుంచే విజువ‌ల్ ఎఫెక్ట్స్ వాడుకుంటూ వ‌చ్చాడు.
 
ఇంట‌ర్వెల్ వ‌ర‌కు కూడా క‌థ ఏంటో తెలియ‌దు. కేవ‌లం మొబైల్స్ మాయం కావ‌డం.. అది చేస్తున్న‌ది ప‌క్షిరాజు అని తెలుసుకోవ‌డం మాత్ర‌మే క‌థ‌. అక్క‌డ్నుంచి అస‌లు క‌థ మొద‌ల‌వుతుంది. సెకండాఫ్ లో కూడా క‌థ ఉండ‌దు కానీ గ్రాఫిక్స్ మాత్రం ఢోకా లేదు. రోబోలో క‌థ‌లో భాగంగా గ్రాఫిక్స్ ఉన్నాయి కానీ ఇక్క‌డ అలా కాదు. గ్రాఫిక్స్ మ‌ధ్య‌లో క‌థ వ‌స్తుంది. చూడ్డానికి అద్భుతంగా ఉన్నాయి కాబ‌ట్టి శంక‌ర్ మాయ క‌నిపిస్తుంది కానీ కేవ‌లం విఎఫ్ఎక్స్ ఒక్క‌టే 2.0ను కాపాడుతుందా అనేది అనుమాన‌మే. క‌థ‌కు ప్రాణం అయిన అక్ష‌య్ కుమార్ ఫ్లాష్ బ్యాక్ అంత బ‌లంగా అనిపించ‌లేదు. క్లైమాక్స్ వర‌కు ఎలాగోలా లాక్కొచ్చిన శంక‌ర్ అక్క‌డ మాయ చూపించాడు. ఆ సీన్ అంతా క‌ళ్ల‌ప్ప‌గించి చూడ‌టం ఖాయం. ఓవ‌రాల్ గా శంక‌ర్ అద్భుతం చేసాడు కానీ స‌గంలోనే ఆపేసాడు. 

న‌టీన‌టులు: 

ర‌జినీకాంత్ అద్భుతం. ఆయ‌న గురించి కొత్తగా చెప్ప‌డానికి లేదు. అదంతే ఓ ఎరా అక్క‌డ క‌నిపిస్తూ ఉంటుంది. ఆయ‌నేం చేసినా కూడా అద్భుత‌మే. ఇప్పుడు 2.0 లో కూడా ఇదే జ‌రిగింది. ర‌జినీ ఏం చేసినా న‌చ్చుతుంది ప్రేక్ష‌కుల‌కు. మ‌రోవైపు అక్ష‌య్ కుమార్ కూడా చాలా బాగా నటించాడు. ప‌క్షిరాజుగా చాలా బాగా న‌టించాడు. మేక‌ప్ కోసం చాలా క‌ష్ల‌ప‌డ్డాడు. అమీజాక్స‌న్ అందంగా ఉంది. మిగిలిన వాళ్లంతా తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం లేనివాళ్లే.. 

టెక్నిక‌ల్ టీం:

టెక్నిక‌ల్ టీంలో అంద‌రికంటే ముందు చెప్పుకోవాల్సిన పేరు ఏఆర్ రెహ‌మాన్. ముఖ్యంగా ఆర్ఆర్ అదిరిపోయింది. ఎడిటింగ్ బాగుంది. సినిమాటోగ్ర‌ఫీ చాలా బాగుంది. ముఖ్యంగా చాలా సీన్స్ కేవ‌లం సినిమాటోగ్ర‌ఫీతో హైలైట్ అయ్యాయి. ఇక శంక‌ర్ అయితే ఈ చిత్రం కోసం ప్రాణం పెట్టాడు. అయితే క‌థ‌ను ప‌క్క‌న‌బెట్టి పూర్తిగా విజువ‌ల్ ఎఫెక్ట్స్ మీదే అంతా న‌డిపించాడు. ఇప్ప‌టి వ‌ర‌కు ఇండియ‌న్ సినిమాల్లో చూడ‌ని విజువ‌ల్స్ ఉన్నాయి కాబ‌ట్టి 2.0 రిచ్ గా అనిపించింది కానీ క‌థ ప‌రంగా చూసుకుంటే మాత్రం కాదు. ద‌ర్శ‌కుడిగా టెక్నిక‌ల్ గా టాప్ లో ఉన్నా కంటెంట్ లో మాత్రం వెన‌క‌బ‌డిపోయాడు. 

చివ‌ర‌గా: 2.0.. మేకింగ్ లో కింగ్.. ప‌నితీరులో స్లో.. 

రేటింగ్ ; 3.5/5

 

More Related Stories