English   

కేజీయ‌ఫ్ 2.. బాహుబ‌లితో పోటీ ప‌డుతుందా.. అంత ద‌మ్ముందా..? 

KGF2
2019-02-28 20:44:48

ఇప్పటివరకు సౌత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో తొలి భాగాన్ని నుంచి రెండో భాగం బ్లాక్ బస్టర్ గా నిలిచింది అంటే ఒక్క అది బాహుబలికి మాత్రమే సొంతమైన రికార్డు. బాహుబలి వచ్చిన తర్వాత రాజమౌళి మరింత జాగ్రత్తతో పార్ట్ 2 తెరకెక్కించి ఇండస్ట్రీ రికార్డులనే కాదు ఇండియన్ సినిమా రికార్డులను కూడా తిరగరాశాడు. ఏకంగా 2000 కోట్ల క్ల‌బ్ లో చేరిపోయాడు ఈ ద‌ర్శ‌కుడు. ఈ సినిమా చూసి ఇండియన్ సినిమా సత్తా ఇది అంటూ అంతా కాలర్ ఎగరేసుకున్నారు కూడా. ఇక ఇప్పుడు బాహుబలికి సమానమైన క్రేజ్ తో మరో సినిమా కూడా వస్తుంది. దాని పేరు కేజిఎఫ్ పార్ట్ 2. కన్నడ సినిమా చరిత్రలోనే అత్యంత పెద్ద విజయంగా నమోదైన కేజిఎఫ్ సినిమాకు సీక్వెల్ ఇది. య‌శ్ హీరోగా వ‌చ్చిన ఈ చిత్రం గ‌త డిసెంబ‌ర్లో విడుద‌లైంది. ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ చిత్రం దాదాపు 230 కోట్లకు పైగా వసూలు చేసి కన్నడ సినిమా రేంజ్ ని పెంచింది. కోలార్ బంగారు గనులు నేపథ్యంలో కేజిఎఫ్ సినిమా తెరకెక్కింది. ఇది కేవలం చాప్టర్ వ‌న్ మాత్రమే. 

హిందీలో కూడా ఈ చిత్రం విజయం సాధించింది. కేజీఎఫ్ విజయం సాధించడంతో ఇప్పుడు రెండో భాగంపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. దాంతో బిజినెస్ కూడా అదే స్థాయిలో జరుగుతోందని అంచ‌నా. కేజిఎఫ్ సినిమాను తెలుగులో కేవలం ఐదు కోట్లకు కొంటే 13 కోట్లు వసూలు చేసింది. దాంతో రెండో భాగం ఏకంగా 15 కోట్ల వరకు బిజినెస్ చేస్తుందని తెలుస్తోంది. కన్నడలో కూడా 100 కోట్ల మార్క్ అందుకుంటుంది కేజిఎఫ్ బిజినెస్. హిందీలోనూ భారీగానే బిజినెస్ జరుగుతుంది. తమిళ నాట చెప్పాల్సిన అవసరం లేదు. మొత్తంగా పార్ట్ వన్ మొత్తం కలిపి 120 కోట్ల బిజినెస్ చేస్తే రెండో భాగం దాదాపు రెండు వందల కోట్లు దాటింది. కన్నడ సినిమా రేంజ్ కు ఇది నిజంగా ఒక కొత్త రికార్డు. దానికి తోడు తొలి భాగం అద్భుతంగా మెప్పించడంతో రెండో భాగం కూడా సంచలనం సృష్టిస్తుందని నమ్ముతున్నారు అభిమానులు. ఇదే ఏడాది కేజిఎఫ్ పార్ట్ 2 విడుద‌ల కానుంది. మ‌రి ఈ సినిమాతో య‌శ్ ఏం చేస్తాడో చూడాలిక‌. 

More Related Stories