మన్మథుడు 2 ట్రైలర్.. నాగార్జున ఈ సారి పక్కా కొట్టేలా ఉన్నాడే..

తెలుగు ఇండస్ట్రీలో మన్మధుడు అంటే మరో అనుమానం లేకుండా గుర్తొచ్చే హీరో నాగార్జున. నిజంగానే ఆ మన్మధుడు ఎలా ఉంటాడో తెలియదు కానీ నాగార్జునను చూస్తుంటే ఇలాగే ఉంటారేమో అనిపిస్తుంది. 60 ఏళ్ల వయసులో కూడా అదే అందం అదే గ్లామర్ మెయింటైన్ చేస్తూ అదరహో అనిపిస్తున్నాడు నాగార్జున. ఇప్పటికే విడుదలైన టీజర్ సినిమాపై అంచనాలు దారుణంగా పెంచేసింది. ఇక ఇప్పుడు విడుదలైన మన్మధుడు 2 ట్రైలర్ చూసిన తర్వాత ఆయన గ్లామర్ చూస్తుంటే మెంటల్ ఎక్కడం ఖాయం.. టీజర్లోనే చాలా సెటైర్లు వేసాడు నాగార్జున.
కానీ ఇప్పుడు ట్రైలర్లో మాత్రం మరింత ఆసక్తి పెరిగిపోయింది. కథ చెబుతూనే కావాల్సిన కామెడీ, ఎమోషన్స్ ఇచ్చాడు దర్శకుడు రాహుల్. ముందు ఈ వయసులో పెళ్లి ఏంటి.. ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలి.. పిల్లలకు ఇచ్చే టైం లో బ్యాటింగ్ మొదలుపెడతాను అంటావేంటి.. ఇలాంటి డైలాగులతో టీజర్ లో ఆసక్తి పుట్టించిన రాహుల్ రవీంద్రన్.. ఇప్పుడు ఒక్క పూట భోజనం కోసం వ్యవసాయం చేయను.. నా జీవితం నాదే పిల్లలను కనను లాంటి డైలాగ్స్ పెట్టాడు. ఆ తర్వాత అసలు కథ చూపించాడు. మన్మధుడు అంటే ఎలా ఉంటాడో ఈ సినిమాలో చూపించాడు రాహుల్.
17 ఏళ్ల కింద విజయభాస్కర్ తెరకెక్కించిన మన్మధుడులో అమ్మాయిలంటే పడని పాత్రలో నటించాడు నాగార్జున. కానీ ఇప్పుడు మాత్రం అమ్మాయిలతోనే ఉండి అమ్మాయిలతోనే పోయే పాత్రలో నాగార్జున కనిపిస్తున్నాడు. అసలు మన్మధుడు అంటే ఎలా ఉంటాడో ఇప్పుడు సీక్వెల్ లో చూపిస్తున్నాడు రాహుల్ రవీంద్రన్. ఈ ఏజ్ లో లిప్ లాక్ సీన్స్ చేసి ఔరా అనిపించాడు నాగార్జున. రకుల్ ప్రీత్ సింగ్ తో పాటు మిగిలిన ముద్దుగుమ్మలతో కూడా ఇంగ్లీష్ ముద్దుల రుచి చూశాడు మన్మధుడు. ఆగస్టు 9న ఈ సినిమా విడుదల కానుంది. ఈ ట్రైలర్ చూసిన తర్వాత సినిమాపై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి.