ఇండియన్ 2 ప్రమాదం...శంకర్ మీద సీనియర్ నటుడు సంచలనం

తమిళ నటుడు రాధా రవి దర్శకుడు శంకర్ మీద సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా కమల్‌హాసన్ నటిస్తున్న భారీ బడ్జెట్ సినిమా ఇండియన్ 2 సెట్ లో భారీ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో క్రేన్ విరిగిపడి ముగ్గురు చనిపోయిన విషయం తెలిసిందే. ఇక ఈ వ్యవాహరం మీద అందరూ విచారం వ్యక్తం చేస్తుంటే తమిళ నటుడు రాధా రవి మాత్రం కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. కోట్లు ఖర్చు పెట్టి హాలీవుడ్ చిత్రాల్ని రూపొందించాలని చూసే మన దర్శకులు ఆ సినిమాకు పనిచేసే వారి భద్రతను మాత్రం గాలికి వదిలేస్తున్నారని ఇప్పటికైనా వారి వైఖరిలో మార్పులు రావాలని ఆయన పేర్కొన్నారు.
`ఇండియన్-2` షూటింగ్లో చంద్రన్, కృష్ణ, మధు చనిపోవడంతో వారి సంతాభ సభని చెన్నైలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాధా రవి దర్శకుడు శంకర్‌ని టార్గెట్ చేస్తూ ఈ విమర్శలు చేయడం కలకలం రేపుతోంది. మరోపక్క చనిపోయిన వారి కుటుంబాలకు కోటి రూపాయలు సాయం చేసిన కమల్ హాసన్ ను మాత్రం రాధా రవి ప్రశంసించారు. అయితే 1996లో వచ్చిన `భారతీయుడు` చిత్రానికి సీక్వెల్‌గా శంకర్ తాజా చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ప్రస్తుత వాతావరణం సద్దుమణిగి మళ్లీ షూటింగ్ ప్రారంభం కావడానికి సమయం పట్టేలా వుందని అంటున్నారు.