చిన్న దర్శకులకు గీతా ఆర్ట్స్ 2 ఆపద్భందు పథకం..

అవును.. ఇప్పుడు ఇండస్ట్రీలో ఇదే నడుస్తుంది. కాస్త ఆలోచిస్తే అదే అర్థమైపోతుంది. సాధారణంగా ఏ ఇండస్ట్రీలో అయినా ఫ్లాప్ దర్శకుల్ని పెద్దగా పట్టించుకోరు. ఒక్క ఫ్లాప్ అయితే ఓకే కానీ రెండు మూడు ఫ్లాపులు ఇస్తే కనీసం చూడను కూడా చూడరు. అలాంటి దర్శకులకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అని హీరోలతో పాటు నిర్మాతలు కూడా పక్కకు వెళ్లిపోతుంటారు. కానీ గీతా ఆర్ట్స్ మాత్రం ఓ స్ట్రాటజీ ప్రకారం వెళ్లిపోతుంటుంది. అల్లు అరవింద్ ఏరికోరి ఫ్లాప్ డైరెక్టర్స్ కు ఛాన్సిస్తుంటాడు.
ఆయన అవకాశమిచ్చిన ఏ దర్శకుడు ఫ్లాప్ ఇవ్వలేదు. కసితో వచ్చిన అవకాశాన్ని వాడేసుకుంటున్నారు వాళ్లు. ఇప్పుడు కూడా ఇదే చేస్తున్నాడు ఈ మెగా నిర్మాత. ఇప్పటికే ఈయన నమ్మకాన్ని పరుశురామ్ లాంటి దర్శకులు నిలబెట్టారు. ఈ మధ్య కాలంలో వరసగా ఫ్లాప్ డైరెక్టర్స్ కే అవకాశం ఇస్తున్నాడు అల్లు అరవింద్. కాకపోతే ఆయన బ్యానర్ లో కాకుండా బన్నీ వాసుతో ఉన్న గీతా ఆర్ట్స్ 2లో ఈ సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం తెలుగు ప్రేక్షకులు మరిచిపోయిన బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్ సినిమా నిర్మిస్తున్నారు.
ఆ తర్వాత కార్తికేయ లాంటి ఫ్లాప్ హీరోతో చావు కబురు చల్లగా అంటూ మరో సినిమా కూడా చేస్తున్నారు. ఇక ఇప్పుడు నిఖిల్ హీరోగా కుమారి 21ఎఫ్ ఫేమ్ సూర్య ప్రతాప్ దర్శకత్వంలో 18 పేజీలు అనే సినిమా మొదలుపెట్టారు. దాంతో పాటు మరికొందరు కొత్త దర్శకులతో పాటు ఫ్లాప్ దర్శకులు చెప్పే కథలు కూడా గీతా ఆర్ట్స్ 2లో వింటున్నారని తెలుస్తుంది. కథలో విషయం ఉంటే హిట్టు ఫ్లాపులతో పని లేకుండా గీతాలో అవకాశాలు ఇచ్చేస్తున్నాడు అల్లు అరవింద్ భక్తుడు బన్నీ వాసు.