కేజీఎఫ్-2 రిలీజ్ డేట్ ప్రకటించిన యూనిట్

యష్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శత్వంలో తెరకెక్కిన కేజిఎఫ్ సీక్వెల్ కేజీఎఫ్ 2. కె.జి.ఎఫ్ ఏమేరకు సెన్సేషనల్ హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆ సినిమా కన్నడలోనే కాక తెలుగు, తమిళ, హింది భాషల్లో కూడా భారీ విజయాన్ని సాధించింది. కె.జి.ఎఫ్ సినిమా జోరుతో కె.జి.ఎఫ్- చాప్టర్ 2 కూడా అదే రేంజ్ లో తెరకెక్కిస్తున్నారు. మొదటి పార్ట్ కి వచ్చిన క్రేజ్ దృష్ట్యా బాలీవుడ్ సహా కొన్ని బాషలలో కీలకమైన పాత్రల కోసం స్టార్ నటులను ఈ సినిమాలో నటింప చేశారు. ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ మెయిన్ విలన్ అధీరా పాత్రలో నటిస్తుండటం అలాగే లేడీ ప్రధానమంత్రిగా రవీనా టాండన్ నటిస్తుండడంతో ఈ సినిమా మీద ఇంకా అంచనాలు పెరిగిపోయాయి. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తి కావడంతో ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ జరపుకుంటోంది. హోంబలే ఫిలింస్ సంస్థ నిర్మిస్తోన్న ఈ సినిమాని ఆర్ఆర్ఆర్ రిలీజ్ వాయిదా పడిన నేపథ్యంలో అదే తేదీకి అంటే జూలై 30న కేజీఎఫ్ 2 రిలీజ్ కానుందన్న ప్రచారం జరగింది. అయితే ఈ సినిమాని దసరా నాటికి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందకు యూనిట్ ప్లాన్ చేస్తున్నట్టు కూడా ఇప్పటిదాకా ప్రచారం జరిగింది. అనుకున్నట్టుగానే ఈ సినిమా విడుదల మీద సినిమా యూనిట్ కీలక ప్రకటన చేసింది. కేజీఎఫ్ చాప్టర్ 2ని ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 23న రిలీజ్ చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించింది.