పవన్ అభిమానుల మృతికి అల్లుఅర్జున్ సంతాపం.. 2 లక్షల విరాళం..

పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా కుప్పంలో అతడి బ్యానర్ కడుతూ కరెంట్ షాక్ కు గురై ముగ్గురు అభిమానులు దుర్మరణం పాలవడం యావత్ మెగా అభిమాన ప్రపంచాన్ని శోకసంద్రంలో ముంచేసింది. ఈ విషయం తెలుసుకున్న పవన్ కళ్యాణ్ వెంటనే స్పందించి ఆ కుటుంబాలకు తాను అండగా ఉంటానని ప్రకటించాడు. మిగిలిన మెగా హీరోలు కూడా ఈ విషాద ఘటన పై స్పందించారు. ఇప్పటికే రామ్ చరణ్, సాయి ధరమ్ తేజ్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. నీ ప్రాణం కంటే ఏది ఎక్కువ కాదు అంటూ రామ్ చరణ్ చెబితే.. మీరు ప్రశాంతంగా ఉండి క్షేమంగా ఉంటేనే కుటుంబాలు బాగుంటాయి.. అలాగే మేం కూడా బాగుంటాము అంటూ సాయి పోస్ట్ చేశాడు. ఇదిలా ఉంటే తాజాగా అల్లు అర్జున్ కూడా ఈ విషయంపై స్పందించాడు. పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు ఇలాంటి దుర్ఘటన జరగడం నిజంగా శోచనీయం ఉన్నాడు అల్లు అర్జున్. ఆ కుటుంబాలకు తనవంతు సాయంగా రెండు లక్షల ఆర్థిక సహాయం అందించాడు. ఇలాంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకూడదని దేవుడిని కోరుకుంటున్నట్లు చెప్పాడు బన్నీ. బిడ్డలను పోగొట్టుకున్న కుటుంబాలకు దేవుడు మనోధైర్యం ప్రసాదించాలని వాళ్ల ఆత్మకు శాంతి కలగాలని దేవుడిని ప్రార్థించాడు అల్లు అర్జున్.