English   

నాని వి సినిమా టెలికాస్ట్ ..లోకల్ ఛానల్ కు 2 కోట్ల జరిమానా

Nani V
2020-09-17 17:14:55

కొన్నిసార్లు అత్యుత్సాహం కొంప ముంచుతుంది. అది ఎంతవరకు తీసుకెళ్తుంది.. దాని పరిణామాలు ఎంత తీవ్రంగా ఉంటాయి అని ఆలోచించకుండా తొందరపడి పనులు చేస్తుంటారు కొందరు. ఆ తర్వాత జుట్టు పీక్కుని కూడా చేసేదేమీ ఉండదు. ఇప్పుడు కూడా ఇదే జరిగింది. అమెజాన్ ప్రైమ్ లో నాని "వి"చిత్రం సెప్టెంబర్ 5న విడుదలైంది. ఈ సినిమాకు సరైన రెస్పాన్స్ రాలేదు. దాంతో దర్శక నిర్మాతలతో పాటు అమెజాన్ ప్రైమ్ వీడియో కూడా నిరుత్సాహంలో మునిగిపోయింది. ఇలాంటి సమయంలో ఒక లోకల్ ఛానల్ అత్యుత్సాహం ప్రదర్శించి వి సినిమాను ప్రసారం చేసింది. దాంతో ఇప్పుడు లోకల్ ఛానెల్ ఏకంగా రెండు కోట్ల రూపాయల జరిమానా కట్టే పరిస్ధితులు తెచ్చుకుంది. అసలు ఏం జరిగిందంటే  ఒకప్పుడు సినిమా విడుదలైన కొన్ని నెలల తర్వాత టీవీలో వచ్చేది. కానీ ఇప్పుడు పరిస్థితులు అలా లేవు. నేరుగా  కొత్త సినిమాలు మన ఇంటికి వస్తున్నాయి. థియేటర్లు మూసి వేయడంతో ఓటీటీ సంస్థలు క్వాలిటీ ప్రింట్‌ను ప్రేక్షకులకు అందిస్తున్నాయి. అయితే వీటిని డౌన్‌లోడ్ చేసుకుని కొన్ని లోకల్ ఛానల్స్‌ నిబంధనలకు విరుద్ధంగా ప్రసారం చేస్తున్నాయి. అప్పటికే ఆ సినిమా చాలా మంది చూసి ఉంటారు.. కాబట్టి ఎవరూ పట్టించుకునేవారు కాదు. కానీ ఇప్పుడు కాలం మారింది.

కరోనా కారణంగా థియేటర్లు మూతపడటంతో కొత్త సినిమాలో నేరుగా ఓటీటీలోనే విడుదలవుతున్నాయి. ప్రేక్షకులు థియేటర్‌కి వెళ్లి సినిమా చూసే పరిస్థితి లేకపోవడంతో నిర్మాతలు ఓటీటీ, శాటిలైట్ రైట్స్‌నే నమ్ముకుని గట్టెక్కుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా లోకల్ చానల్స్ తమ బుద్ధి మార్చుకోవడం లేదు అక్రమంగా ఈ సినిమాలను టీవీలో ప్రసారం చేస్తున్నాయి. ఇలాంటి వాటిని ఇన్నాళ్లూ చూసిచూడనట్లు వదిలేసిన పెద్ద ఛానళ్ల యాజమాన్యాలు ఇప్పుడు మాత్రం చాలా సీరియస్ అవుతున్నాయి. నాని, సుధీర్‌బాబు నటించిన 'వి' సినిమా అమెజాన్ ప్రైమ్ లో రిలీజైన సంగతి తెలిసిందే. ఈ చిత్రం శాటిలైట్ హక్కులను జెమిని టీవీ భారీ ధరకు కొనుగోలు చేసింది. అయితే ఇటీవలే హైదరాబాద్‌లోని ఓ లోకల్ ఛానల్‌ 'వి' సినిమాను టెలికాస్ట్ చేసింది. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న జెమిని టీవీ ఆ లోకల్ ఛానల్‌కు నోటీసులు పంపినట్లు తెలుస్తోంది. నిబంధనలకు విరుద్ధంగా సినిమా టెలికాస్ట్ చేసినందుకు ఏకంగా 2 కోట్ల జరిమానా చెల్లించాలని డిమాండ్ చేసింది. ఈ మధ్యే ఉమామహేశ్వర ఉగ్రరూపస్య సినిమా విషయంలో ఈటీవీ కూడా ఇలాగే సీరియస్ అయింది. 

More Related Stories