English   

కెజియఫ్ 2 సినిమాను అప్పుడు విడుదల చేస్తున్నారా.. మరి వాళ్ల సంగతేంటో...

 KGF Chapter 2
2020-10-14 15:42:38

కెజియఫ్ 2 సినిమా కోసం చాలా రోజులుగా అభిమానులు వేచి చూస్తున్నారు. ఈ మాయదారి కరోనా వైరస్ కానీ లేకపోయుంటే అక్టోబర్ 23న రాఖీ భాయ్ వచ్చేవాడు. కానీ ఇప్పుడు అన్నీ మారిపోయాయి. అన్ని భాషల్లో తొలిభాగం విజయం సాధించడంతో ఇప్పుడు రెండో భాగాన్ని కూడా ఒకేసారి ఒకేరోజు విడుదల చేయాలని చూస్తున్నారు దర్శక నిర్మాతలు. నిజంగా వాళ్లు సినిమా ఈ స్థాయి విజయం సాధిస్తుందని అనుకోలేదేమో..? ఎందుకంటే తొలిభాగం సృష్టించిన సంచలనాలు చూస్తుంటే ఆశ్చర్యపోవడం తప్ప ఇంకేం లేదు. ఈ సినిమా 230 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఇలాంటి సమయంలో కెజియఫ్ చాప్టర్ 2 కోసమని అన్ని ఇండస్ట్రీల‌ నుంచి భారీ పోటీ ఉంది. దాంతో బిజినెస్ విషయంలో ఈ చిత్ర యూనిట్ చాలా జాగ్రత్తగా ఉంటున్నారు. పార్ట్ 2 బిజినెస్ ఇప్పుడే పూర్తి చేయకూడదని వాళ్లు ఫిక్స్ అయిపోయారు. ఇప్పటికే కొన్ని ఏరియాలు అమ్మేసారు కూడా. దిల్ రాజు ఈ సినిమా రైట్స్ 100 కోట్లకు పైగానే చెల్లించి తీసుకున్నాడని ప్రచారం కూడా జరుగుతుంది. మరోవైపు పూర్తి బిజినెస్ మాత్రం షూటింగ్ అయిపోయిన తర్వాత గానీ మొదలుపెట్టాలని ఆలోచిస్తున్నారు దర్శక నిర్మాతలు. దానికి కారణం కూడా లేకపోలేదు. అప్పటి వరకు ట్రైలర్స్, టీజర్స్ విడుదలవుతాయి కాబట్టి ఇంకా ఎక్కువ బిజినెస్ జరుగుతుంది అని వాళ్ళ అంచనా. అందుకే ఇప్పుడే సినిమా అమ్మ‌కూడదని వాళ్లు మెంటల్‌గా ఫిక్స్ అయిపోయారు. 

పైగా చాప్టర్ 1 సృష్టించిన సంచలనాలు చూసి చాప్టర్ 2 కోసం మూడింతలు రెట్లు ఎక్కువగా ఇస్తామంటూ వస్తున్నారు డిస్ట్రిబ్యూటర్లు. తెలుగులో కెజియఫ్ తొలిభాగాన్ని 4 కోట్లకు తీసుకుంటే 13 కోట్ల షేర్ తీసుకొచ్చింది. తమిళనాట కూడా 10 కోట్ల వరకు వసూలు చేసింది. ఇక హిందీలో 40 కోట్ల వరకు రాబట్టింది. దాంతో రెండో భాగానికి భారీ ఆఫర్స్ వస్తున్నా కానీ నిర్మాతలు మాత్రం అస్సలు టెంప్ట్ కావడం లేదు. సినిమా పూర్తయిన తర్వాత కానీ అమ్మకూడ‌దని నిర్ణ‌యం తీసుకుంటున్నారు. ప‌్ర‌శాంత్ నీల్ తెర‌కెక్కించిన ఈ చిత్రంలో య‌శ్ హీరోగా న‌టించాడు. బంగారు గ‌నుల నేప‌థ్యంలో తెర‌కెక్కిన ఈ చిత్రం సంచ‌ల‌న విజ‌యం సాధించింది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ కూడా అదిరిపోయింది. నిజానికి ఈ సినిమాను అక్టోబర్ 23న విడుదల చేయాలనుకున్నా కూడా కరోనా వైరస్ కారణంగా వాయిదా పడింది. ఈ మధ్యే మళ్లీ షూటింగ్ మొదలు పెట్టారు దర్శక నిర్మాతలు. పూర్తి కోవిడ్ నిబంధనల మధ్య సెట్‌లో అడుగుపెట్టాడు రాఖీ భాయ్. 

ఈ సినిమాను సంక్రాంతి సీజన్‌లో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే హింట్ కూడా ఇస్తున్నారు. మిగిలిన షూటింగ్ కూడా పూర్తి చేసి సంక్రాంతికి విడుదల చేయాలనుకుంటున్నారు. కన్నడతో పాటు తెలుగు, తమిళం, హిందీ, మళయాలంలో కెజియఫ్ 2 ఒకేరోజు విడుదలవుతుంది. ఇదిలా ఉంటే ఈ చిత్ర క్లైమాక్స్ సన్నివేశాలు హైదరాబాద్‌లోనే ప్లాన్ చేస్తున్నాడు దర్శకుడు ప్రశాంత్. ఆర్ఎఫ్‌సీలో ప్రత్యేకంగా ఈ చిత్రం కోసమే సెట్ నిర్మిస్తున్నారు. అందులోనే విలన్ సంజయ్ దత్, హీరో యష్ మధ్య యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరించనున్నాడు దర్శకుడు. ముఖ్యంగా ఇద్దరూ షర్ట్ లేకుండా ఫైట్ చేసుకుంటారని తెలుస్తుంది. ఈ భారీ యాక్షన్ సీక్వెన్స్ కోసం బాలీవుడ్ యాక్షన్ కొరియోగ్రఫర్స్ పని చేస్తున్నారు. తెలుగులో కెజియఫ్ 2 రైట్స్ దాదాపు 30 కోట్ల వరకు పలికినట్లు తెలుస్తుంది. ఏదేమైనా కూడా సంక్రాంతికి కెజియఫ్ 2 వస్తే మాత్రం కచ్చితంగా మిగిలిన సినిమాలు సైడ్ ఇవ్వక మానదు. పెద్ద సినిమాలేవీ పండక్కి తీసుకురావాలని చూడట్లేదు. కరోనా తగ్గి.. పూర్తిగా వసూళ్లు వస్తాయనుకుంటేనే పండక్కి సినిమాలు విడుదల చేయాలనుకుంటున్నారు. ఆ టైమ్ రావడానికి మరికొంత సమయం అయితే పట్టేలా కనిపిస్తుంది. ఆ లోపు సంక్రాంతికి కెజియఫ్ 2 వస్తుందనే ప్రచారం జోరందుకుంది.

More Related Stories