English   

రాజశేఖర్ కోసం 2 కోట్లు పెట్టి సెట్ వేస్తున్నారు

Actor Rajasekhar Upcoming Movie Set Cost 2 Crore
2018-09-11 22:18:04

ఒకప్పుడు యాంగ్రీయంగ్ మేన్ గా దుమ్మురేపిన స్టార్ రాజశేఖర్. కానీ దశాబ్ధంకు పైగా మనోడికి హిట్ లేదు. ఇక క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానో, లేక విలన్ గానో టర్న్ అవుదామనుకుంటోన్న టైమ్ లో వచ్చిన గరుడవేగ అతని కెరీర్ కు కొత్త రెక్కల్నిచ్చింది. గరుడవేగ సూపర్ హిట్ కావడమే కాదు.. మంచి కథ ఉంటే దాన్ని తన పర్ఫార్మెన్స్ తో రాజశేఖర్ నెక్ట్స్ లెవెల్ కు తీసుకువెళ్లగలడని యంగ్ మేకర్స్ కూ ఓ క్లూ ఇచ్చింది. యంగ్ మేకర్స్ మాత్రమే కాదు.. పాత వారికి కూడా అతని స్ట్రెంత్ తెలుసు. ఇక మైనస్ ల సంగతి తెలిసినా.. అవన్నీ మార్చుకున్నాడని.. ఈ మధ్య అతనితో చేస్తోన్న దర్శకులు కూడా చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఓ ఇంట్రెస్టింగ్ కాంబినేషన్ లో ‘‘కల్కి’’ అనే సినిమా చేస్తున్నాడు రాజశేఖర్. ‘‘అఁ’’ సినిమాతో టాలీవుడ్ ను ఆకట్టుకున్న టాలెంటెడ్ కుర్రాడు ప్రశాంత్ వర్మతో రాజశేఖర్ చేస్తోన్న సినిమా ఇది. ఇప్పటికే కల్కిపై ఇంట్రెస్ట్ పెంచడంలో ఈ మూవీ టీమ్ సక్సెస్ అయింది.

ప్రస్తుతం టాలీవుడ్ లో రైజింగ్ ట్రెండ్ లా ఉన్న పీరియడ్ ఫిల్మ్ జాబితాలోనే ఈ కల్కి కూడా ఉంది. అంటే ఈ కథ 80ల నాటి నేపథ్యంలో సాగే కథన్నమాట. అయితే ఈ మూవీకి సంబంధించి లేటెస్ట్ గా ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తోంది. ఈ మూవీలోని కొన్ని కీలక సన్నివేశాల కోసం ఏకంగా 2కోట్ల రూపాయలతో ఓ భారీ సెట్ వేస్తున్నారట. ఈ సెట్ లో కొన్ని కీలకమైన సన్నివేశాలు మాత్రమే చిత్రీకరించనున్నారు. అయినా అంత ఖర్చుపెట్టడం అనేది రాజశేఖర్ రేంజ్ కు మించింది. కానీ నిర్మాతలు ఈ విషయంలో కాంప్రమైజ్ కావడం లేదట. సినిమా రిచ్ గా ఉండేలానే ప్లాన్ చేస్తున్నారట. ఇక ఈ రెండు కోట్ల సెట్ మేటర్ తెలిసి టాలీవుడ్ లో చాలామంది నోరెళ్లబెడుతున్నారు. ఇక ఈ మూవీ టైటిల్ మోషన్ పోస్టర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. మరి ఇది కూడా హిట్ అయితే రాజశేఖర్ కు మళ్లీ పూర్వ వైభవం వస్తుందని ఖచ్చితంగా చెప్పొచ్చు.

More Related Stories