English   

పందెంకోడి 2 ట్రైల‌ర్.. రొటీన్ గానే ఉంది విశాల్..

Pandem-Kodi-2
2018-09-29 13:11:05

విశాల్ సినిమా అంటే ఒక‌ప్పుడు మాస్ మాస్ అని ఉండేది. ఈయ‌న సినిమా చేస్తున్నాడంటే కొత్త‌గా ఉండ‌దు కానీ క‌చ్చితంగా మాస్ తో మాయ చేస్తాడ‌ని మాత్రం తెలుసు. ఎందుకంటే ఈయ‌న సినిమాల్లో క‌థ కంటే ఎక్కువ‌గా యాక్ష‌న్ సీక్వెన్సుల‌కే ప్రాధాన్య‌త ఉండేది. అయితే కొన్నేళ్లుగా ఈ హీరో క‌థ‌ల ఎంపిక‌లో మార్పు వ‌చ్చింది. కొత్త క‌థ‌ల వైపు అడుగేస్తున్నాడు. ముఖ్యంగా భిన్న‌మైన క‌థ‌ల‌ను ఎంచుకుంటూ త‌న స‌త్తా చూపిస్తూ స్టార్ హీరోగా మారిపోయాడు. అయితే ఇప్పుడు మ‌రోసారి పూర్తిగా రొటీన్ క‌థ‌తో వ‌స్తున్నాడు ఈ హీరో. చాలా ఏళ్ళ త‌ర్వాత మ‌ళ్లీ పాత విశాల్ ను గుర్తు చేస్తూ పందెంకోడి 2తో వ‌స్తున్నాడు. 

లింగుస్వామి తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రం అక్టోబ‌ర్ 18న విడుద‌ల కానుంది. ఈ చిత్రంలో కీర్తిసురేష్ హీరోయిన్ గా నటిస్తుంది. వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్ కుమార్ విల‌న్ గా న‌టిస్తుంది. ప్రియురాలితోనే పోరుకు సిద్ధం అవుతున్నాడు ఈ హీరో. తాజాగా విడుద‌లైన ట్రైల‌ర్ కూడా ప‌ర‌మ రొటీన్ గా ఉంది. కొత్త‌ద‌నం లేక‌పోయినా కూడా పాత క‌థ‌కు కొన‌సాగింపు కావ‌డంతో క‌చ్చితంగా హిట్ కొడ‌తాన‌ని ధీమాగా చెబుతున్నాడు విశాల్. ఈ చిత్రంలో కీర్తిసురేష్ ప‌క్కా మాస్ రోల్ లో ద‌ర్శ‌న‌మిస్తుంది. సికింద‌ర్ ఫ్లాప్ త‌ర్వాత మూడేళ్లు గ్యాప్ తీసుకుని ఈ సినిమా చేస్తున్నాడు లింగుస్వామి. మ‌రి చూడాలిక‌.. అభిమ‌న్యుడు త‌ర్వాత విశాల్ చేస్తున్న సినిమా ఎంత‌వ‌ర‌కు స‌క్సెస్ అవుతుందో..?

More Related Stories