English   

ప‌ందెంకోడి 2 రివ్యూ

Pandem-Kodi-2
2018-10-18 10:57:39

పందెంకోడి సినిమా గురించి ఇప్పుడు కొత్త‌గా చెప్పాల్సిన ప‌నిలేదు. అప్పుడెప్పుడో 13 ఏళ్ల కింద విశాల్ న‌టించిన సినిమా ఇది. అప్ప‌ట్లో అనూహ్య విజ‌యం సాధించిన ఈ చిత్రానికి సీక్వెల్ ఇప్పుడు వ‌చ్చింది. మ‌రి ఇన్నేళ్ళ త‌ర్వాత వ‌చ్చిన సీక్వెల్ ఎంత‌వ‌ర‌కు ప్రేక్ష‌కుల‌ను అల‌రించింది..? 

క‌థ‌:

రాజారెడ్డి(రాజ్ కిర‌ణ్) ఆరు ఊళ్ల‌కు పెద్ద‌. ఆయ‌న మాటే అక్క‌డ అంద‌రికీ వేదం. ఓ సారి జాత‌ర జ‌రుగుతుంటే రెండు ఊళ్ల మ‌ధ్య చిన్న ఘ‌ర్ష‌ణ జ‌రుగుతుంది. ఆ గొడ‌వ‌లో భ‌వానీ(వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్ కుమార్) భ‌ర్త‌ను నరికేస్తారు. అప్ప‌ట్నుంచి త‌న భ‌ర్త చావుకు కార‌ణ‌మైన వంశంలో ఒక్కరు కూడా మిగ‌ల‌కూడ‌ద‌ని కంక‌ణం క‌ట్టుకుంటుంది. అలా మిగిలిపోయిన గోపీకి రాజారెడ్డి కుటుంబం అండ‌గా ఉంటుంది. విదేశాల నుంచి వ‌చ్చిన బాలు(విశాల్) కూడా వ‌చ్చీ రాగానే గొడ‌వ‌ల్లో త‌ల‌దూరుస్తాడు. అదే స‌మ‌యంలో చారుల‌త‌(కీర్తిసురేష్)తో ప్రేమ‌లో ప‌డ‌తాడు. ఆ త‌ర్వాత క‌థ ఎలాంటి మ‌లుపులు తిరిగింది అనేది అస‌లు క‌థ‌.. 

విశ్లేష‌ణ‌:

మ‌న‌కు ఫ్యాక్ష‌న్ క‌థ‌లు అన్ని వ‌చ్చినా కూడా 13 ఏళ్ల కింద త‌మిళ్ నుంచి వ‌చ్చిన ఫ్యాక్ష‌న్ క‌థ పందెంకోడిని మ‌నోళ్లంతా ఎగ‌బ‌డి చూసారు. ఆ సినిమాలో ఏమంత కొత్త‌ద‌నం క‌నిపించిందో తెలియ‌దు కానీ స్క్రీన్ ప్లే మాయాజాలంతోనే సినిమాను న‌డిపించాడు ద‌ర్శ‌కుడు లింగుస్వామి. కొత్త క‌థ కాక‌పోయినా దానికే ప‌డిపోయారు ప్రేక్ష‌కులు. ఇప్పుడు ఇన్నేళ్ళ త‌ర్వాత కూడా మ‌రోసారి అలాంటి స్క్రీన్ ప్లేతోనే వ‌చ్చాడు ఈ ద‌ర్శ‌కుడు. క‌థ ఎక్క‌డైతే ఆపాడో అక్క‌డే మొద‌లుపెట్టాడు. హీరోను విదేశాల‌కు పంపి ఇక్క‌డ క‌థ సాగించాడు. ఏడేళ్ళ త‌ర్వాత మ‌ళ్లీ త‌ను ఇండియాకు రావ‌డంతో క‌థ మ‌ళ్లీ మొద‌ల‌వుతుంది. అప్ప‌టి వ‌ర‌కు ఇక్క‌డ ఫ్యాక్ష‌న్ గొడ‌వ‌లు న‌డుస్తూనే ఉంటాయి. పందెంకోడి 2 చూస్తుంటే 13 ఏళ్ల నాటి జ్ఞాప‌కాల‌న్నీ గుర్తొస్తుంటాయి. 

పైగా ఇది విశాల్ కు 25వ సినిమా కావ‌డం విశేషం. అప్పుడెలా ఉన్నాడో ఇప్పుడు కూడా విశాల్ అలాగే ఉండ‌టం ఆశ్చ‌ర్య‌మే. ఫ‌స్టాఫ్ లో యాక్ష‌న్ పార్ట్ త‌క్కువ‌గా ఉంచి.. విశాల్, కీర్తిసురేష్ మ‌ధ్య ల‌వ్ ట్రాక్ పై దృష్టిపెట్టాడు లింగుస్వామి. కీర్తి రెబ‌ల్ కారెక్ట‌ర్ సినిమాకు బాగానే క‌లిసొస్తుంది. ఈమె కారెక్ట‌ర్ సినిమాకు హైలైట్. అల్ల‌రి పాత్ర‌లో బాగానే అల‌రించింది కీర్తి. ముఖ్యంగా ఆమె మాట‌లు ఆక‌ట్టుకుంటాయి. రాయ‌ల‌సీమ యాస‌లో సొంత డ‌బ్బింగ్ చెప్ప‌డం ఆశ్చ‌ర్య‌మే. ఇంట‌ర్వెల్ సీన్ బాగా ప్లాన్ చేసుకున్నాడు ద‌ర్శ‌కుడు లింగుసామి. సెకండాఫ్ ఎమోష‌న‌ల్ కంటెంట్ పై దృష్టి పెట్టాడు ద‌ర్శ‌కుడు. అయితే అదే స్లో నెరేష‌న్ లా అనిపించింది. పందెంకోడిని దృష్టిలో పెట్టుకుంటే ఇది చూడ‌లేం.. అంచ‌నాల్లేకుండా వెళ్తే ప‌ర్లేదు. 

న‌టీన‌టులు:  

పందెంకోడి వ‌చ్చి 13 ఏళ్లు దాటిపోయింది. ఇప్ప‌టికీ విశాల్ అలాగే ఉన్నాడు. అది నిజంగా అద్భుత‌మే. అప్పుడు బాల పాత్ర‌లో ఎలా ఒదిగాడో ఇప్పుడు ఇలాగే చేసాడు. ఎక్క‌డైతే ఆపాడో అక్క‌డ్నుంచి మొద‌లుపెట్టాడు విశాల్. న‌ట‌న‌లో ఈయ‌న గురించి కొత్త‌గా చెప్ప‌డానికి ఏం లేదు. మ‌రోసారి బాలు పాత్ర‌లో చంపేసాడు. అల్ల‌రి పిల్ల‌గా కీర్తిసురేష్ బాగా చేసింది. అప్ప‌ట్లో మీరాజాస్మిన్ చేసిన అల్ల‌రి పాత్ర‌ను గుర్తు చేసింది. వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్ కుమార్ విల‌న్ రోల్ మాత్రం వ‌ద్ద‌న్నా కూడా పొగరు సినిమాలో శ్రీయారెడ్డిని గుర్తు చేస్తుంది. ఆ పాత్రను అద్భుతంగా చేసింది కూడా. ఇక రాజ్ కిర‌ణ్ హీరో తండ్రిగా బాగా న‌టించాడు. 

టెక్నిక‌ల్ టీం:

14 ఏళ్ల కింద పందెంకోడి సినిమా అంత పెద్ద విజ‌యం సాధించిందంటే దానికి కార‌ణం పాట‌లు కూడా. అందులో ప్ర‌తీ పాట తెలుగులోనూ సూప‌ర్ హిట్ అయింది. ఇప్పుడు సీక్వెల్ పాట‌లు మాత్రం అంత‌గా ఆక‌ట్టుకోలేదు. అయితే ఆర్ఆర్ బాగుంది. ఇక ఎడిటింగ్ ప‌ర్లేదు. సినిమా అంతా ఎక్కువ‌గా గ్రామంలోనే జ‌రుగుతుంది కాబ‌ట్టి అక్క‌డి అందాల‌ను బాగానే క్యాప్చ‌ర్ చేసారు. తొలి భాగానికి లింక్ పెడుతూ క‌థ‌ను బాగానే అల్లుకున్నాడు ద‌ర్శ‌కుడు లింగుస్వామి. ఎడిటింగ్ ప‌ర్లేద‌నిపించినా అక్క‌డ‌క్క‌డా స్లో అవుతుంది. ముఖ్యంగా త‌మిళ వాస‌న‌లు ఎక్కువ‌గా ఉన్నాయి సినిమాలో. 

చివ‌ర‌గా: పందెంకోడి 2.. పందెంలో రెక్క‌లు తెగిన కోడి.. 

రేటింగ్:  3/5

More Related Stories