English   

2019లో టాలీవుడ్‌కు పరిచయమైన ముద్దుగుమ్మలు వీళ్లే..

tolywood
2019-12-10 19:31:45

చూస్తుండగానే మరో ఏడాది కూడా ముగిసిపోతుంది. ప్రతీ ఏడాది మాదిరే ఈ ఏడాది కూడా తెలుగు ఇండస్ట్రీలో చాలా సినిమాలు వచ్చాయి. అందులో చాలా మంది హీరోయిన్లు కూడా టాలీవుడ్ ప్రేక్షకులను పలకరించారు. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన వాళ్లు డజన్ మంది ఉన్నారు. మరి వాళ్లెవరో.. వాళ్లేం సినిమాలు చేసారో చూద్దాం..

1. ప్రియాంక మోహన్..
గ్యాంగ్ లీడర్ సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ మళయాల కుట్టి. నాని హీరోయిన్ గా తెలుగులో పాపులర్ అయింది. ఈ చిత్రం ఫ్లాప్ అయినా కూడా ప్రియాంక నటనకు మాత్రం మంచి మార్కులు పడ్డాయి. పైగా విక్రమ్ కే కుమార్ లాంటి దర్శకుడి చేతుల మీదుగా పరిచయమైంది ఈ బ్యూటీ. దానికితోడు పిసి శ్రీరామ్ ఈమెను రిఫర్ చేసాడు. ప్రస్తుతం అవకాశాల కోసం చూస్తుంది ప్రియాంక అరుల్ మోహన్.

2. శ్రద్ధా శ్రీనాథ్..
నాని హీరోగా 2019లో వచ్చిన తొలి సినిమా జెర్సీ. ఈ చిత్రంలో శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్ గా పరిచయం అయింది. ఇందులో అమ్మడు అదిరిపోయే నటనతో అందర్నీ ఆకట్టుకుంది. నానికి ఎంత పేరొచ్చిందో.. శ్రద్ధా కూడా అంతే పేరు తెచ్చుకుంది. జెర్సీ విజయం సాధించడంతో ప్రస్తుతం మరిన్ని సినిమాల్లో అవకాశాలు అందుకుంటుంది ఈ ముద్దుగుమ్మ.

3. దివ్యాంశ కౌశిక్..
నాగ చైతన్య హీరోగా శివ నిర్వాణ తెరకెక్కించిన ఎమోషనల్ ఎంటర్ టైనర్ మజిలి. ఈ చిత్రం సంచలన విజయం సాధించింది. ఈ చిత్రంలో సమంతతో పాటు మరో హీరోయిన్ కూడా నటించింది. ఆమె పేరు దివ్యాంశ కౌశిక్. చేసింది చిన్న పాత్రే అయినా కూడా మంచి మార్కులు వేయించుకుంది దివ్యాంశ. ఈమె నటనకే కాదు అందానికి కూడా ఆడియన్స్ ఫిదా అయిపోయారు.

4. శ్రద్ధా కపూర్..
హిందీలో స్టార్ హీరోయిన్ అయినా కూడా తెలుగులో మాత్రం ఈ ఏడాది ఎంట్రీ ఇచ్చింది శ్రద్ధా కపూర్. సాహో సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టింది. ఈ చిత్రం హిందీలో హిట్ అయింది కానీ తెలుగులో మాత్రం అంచనాలు అందుకోలేకపోయింది. అయితే ఈ సినిమా కోసం శ్రద్ధా కపూర్ ఏకంగా 7 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుందని తెలుస్తుంది.

5. జరీన్ ఖాన్..
జూనియర్ కత్రినా కైఫ్ గా ఇండస్ట్రీకి వచ్చిన జరీన్ ఖాన్ చాలా ఏళ్లుగా తెలుగులో అడుగు పెట్టాలని చూస్తుంది. ఇన్నేళ్లకు ఈమె కోరిక తీరి చాణక్య సినిమాలో నటించింది. గోపీచంద్ హీరోగా నటించిన ఈ చిత్రంలో పాకిస్థాన్ లో ఉండే ఇండియన్ ఏజెంట్ పాత్రలో నటించింది జరీన్. సినిమా ప్లాప్ అయినా కూడా ఈమె పాత్రకు మాత్రం మంచి అప్లాజ్ వచ్చింది. ప్రస్తుతం మరిన్ని తెలుగు సినిమాల్లో నటించే పనిలో బిజీగా ఉంది జరీన్ ఖాన్.

6. శృతి శర్మ
ఈ ఏడాది చిన్న సినిమాగా వచ్చి సంచలన విజయం సాధించింది ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ. అందులో హీరో నవీన్ పొలిశెట్టి పక్కనే ఉంటూ కామెడీతో పాటు అదిరిపోయే అభినయం కూడా చేసిన హీరోయిన్ శృతి శర్మ. ఈ చిత్రంలో అమ్మడు నటనను చూసి సూపర్ అనేసారు ఆడియన్స్. బాలీవుడ్ సీరియల్స్ తో అక్కడ వాళ్లకు పరిచయమైన శృతి ఏజెంట్ సాయి శ్రీనివాసతో తెలుగులోనూ మాయ చేసింది. అయితే అవకాశాల వేటలో మాత్రం ఇంకా వెనకబడి ఉంది ఈ ముద్దుగుమ్మ.

7. సలోని మిశ్రా, హర్షిత గౌర్  
విశ్వక్ సేన్ హీరోగా స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన సినిమా ఫలక్ నుమా దాస్. ఈ సినిమాలో ముంబై ముద్దుగుమ్మ సలోని మిశ్రా హీరోయిన్ గా నటించింది. సినిమా యావరేజ్ అయినా ఈ హీరోయిన్ కు మాత్రం పెద్దగా కలిసి రాలేదు. ఇక ఇదే సినిమాలో హర్షిత అనే తెలుగమ్మాయి కూడా పరిచయమైంది. ఈమె కూడా పెద్దగా క్లిక్ అయితే కాలేదు.

8. అన్యా సింగ్
సందీప్ కిషన్ హీరోగా వచ్చిన నిను వీడని నీడనినేనే సినిమాలో అన్యా సింగ్ అనే అమ్మాయి హీరోయిన్ గా పరిచయమైంది. ఈ సినిమాలో క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ తో బాగానే మాయ చేసింది అన్యా. దానికితోడు సినిమా కూడా పర్లేదనిపించడంతో అన్యా ప్రస్తుతం తెలుగులో మరిన్ని అవకాశాల కోసం చూస్తుంది.

9. అనఘ
కార్తికేయ హీరోగా అర్జున్ జంధ్యాల తెరకెక్కించిన సినిమా గుణ 369. ఈ సినిమాతో అనఘ హీరోయిన్ గా పరిచయమైంది. అమ్మాయిలపై జరిగే అత్యాచారాల నేపథ్యంలో ఈ చిత్రంలో కూడా ఓ బలమైన సీన్ పెట్టాడు దర్శకుడు అర్జున్. తప్పదింక భరించరా నా బంగారం.. బుజ్జిబుజ్జి బంగారం అంటూ ఈ ఏడాది చాలా సందడి చేసింది అనఘ.

10, సాషా చెట్టి
ఎయిర్ టెల్ పాప సాషా చెట్టి కూడా ఈ ఏడాది తెలుగు ఆడియన్స్ కు పరిచయమైంది. ఈమె నటించిన ఆపరేషన్ గోల్డ్ ఫిష్ అట్టర్ ఫ్లాప్ అయింది కానీ ఎయిర్ టెల్ సుందరి అనే ట్యాగ్ మాత్రం దక్కించుకుంది. ఈ సినిమాలో పర్లేదనిపించుకుంది సాషా.

11. వాణి భోజన్
దర్శకుడు తరుణ్ భాస్కర్ హీరోగా మారి చేసిన సినిమా మీకు మాత్రమే చెప్తా. మరో కొత్త దర్శకుడు షమ్మీర్ సుల్తాన్ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఈ సినిమాతో తమిళమ్మాయి వాణి భోజన్ తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయింది. సినిమాలో మంచి నటనతో ఆకట్టకుంది ఈ ముద్దుగుమ్మ. విజయ్ దేవరకొండ నిర్మించిన మీకు మాత్రమే చెప్తా పెద్దగా ఆకట్టుకోలేదు.

12. అనన్య
ఈ ఏడాది విడుదలైన సినిమాల్లో మంచి సినిమాగా తెలుగు ప్రేక్షకుల అభినందనలు అందుకున్న సినిమా మల్లేశం. తెలంగాణ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో అనన్య హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాతోనే తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది ఈ ముద్దుగుమ్మ. ఆ తర్వాత కూడా మరో రెండు సినిమాలు చేసింది అనన్య. మొత్తానికి ఈ ఏడాది ఇలా చాలా మంది హీరోయిన్లు తెలుగు తెరకు పరిచయం అయ్యారు.

 

More Related Stories