2019లో వీళ్ల జాడ కనిపించలేదే.. మిస్సింగ్ స్టార్స్..

ప్రతీ ఏడాది ప్రతీ హీరో సినిమాలు చేయాలని లేదు.. ఇప్పుడు ఉన్న బిజీలో రెండేళ్లకో సినిమా చేసినా కూడా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. ఇప్పుడు మన హీరోలు.. దర్శకులు కూడా ఇదే చేసారు. ఇంకా విశేషం
ఏంటంటే రెగ్యులర్ గా సినిమాలు చేసే హీరో హీరోయిన్లు కూడా 2019ని మిస్ చేసుకున్నారు. మరి వాళ్లెవరూ.. ఎందుకు మిస్ అయ్యారు తెలుసుకుందాం..
1. జూనియర్ ఎన్టీఆర్
ఏడాదికి కనీసం ఒక్క సినిమా అయినా చేయడం జూనియర్ ఎన్టీఆర్ అలవాటు. కానీ 2019లో మాత్రం ఈయన ఒక్క సినిమా కూడా చేయలేదు. అరవింద సమేత తర్వాత పూర్తిగా కొన్ని రోజులు రెస్ట్ తీసుకుని ఈ ఏడాది రాజమౌళి సినిమాతో జాయిన్ అయ్యాడు. అప్పట్నుంచి ఇదే సినిమాపై ఫోకస్ చేసాడు. 2020లో రాజమౌళి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు ఎన్టీఆర్. ఆ తర్వాత 2019 బాకీని వరస సినిమాలతో భర్తీ చేయడానికి చూస్తున్నాడు యంగ్ టైగర్.
2. అల్లు అర్జున్
2003లో గంగోత్రి సినిమాతో కెరీర్ మొదలుపెట్టినప్పట్నుంచి ఇఫ్పటి వరకు ఒక్క కాలెండర్ ఇయర్ కూడా మిస్ చేయలేదు బన్నీ. ప్రతీ ఏడాది కనీసం ఒక్క సినిమా అయినా విడుదల చేస్తూ వచ్చాడు. కానీ 2019లో మాత్రం అది కుదర్లేదు. ఈయన నుంచి ఒక్క సినిమా కూడా ఈ ఏడాది రాలేదు. నా పేరు సూర్య తర్వాత భారీ గ్యాప్ తీసుకుని త్రివిక్రమ్ అల వైకుంఠపురములో మొదలుపెట్టాడు బన్నీ. ఈ చిత్రం సంక్రాంతికి విడుదల కానుంది. ఇక సుకుమార్ సినిమా కూడా వచ్చే ఏడాది రానుంది.
3. మనోజ్ మంచు
ఒక్కడు మిగిలాడు సినిమా తర్వాత రెండేళ్లుగా సినిమాలకు దూరంగా ఉన్నాడు మంచు మనోజ్. ఈ ఏడాది విడాకులు తీసుకున్న మనోజ్.. మళ్లీ కెరీర్ పై ఫోకస్ చేస్తున్నాడు. వరస సినిమాలు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు మనోజ్.
4. పవన్ కల్యాణ్
అజ్ఞాతవాసి సినిమా తర్వాత పవన్ కల్యాణ్ మళ్లీ కనిపించలేదు. ఎన్నికలు, రాజకీయాలతో బిజీ అయిపోయాడు. అయితే 2019 ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత కూడా ఈయన సినిమాల వైపు చూడలేదు. జనాల మధ్యకి వెళ్లి సమస్యలపై పోరాడుతున్నాడు జనసేనాని. ఇన్నాళ్లకు మళ్లీ పింక్ సినిమా రీమేక్ తో పవన్ రాబోతున్నాడని తెలుస్తుంది. డిసెంబర్ లోనే ఈ చిత్రం మొదలు కానుంది. పవన్ ఫిబ్రవరిలో సెట్ లో అడుగు పెట్టబోతున్నాడు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి వేణు శ్రీరామ్ దర్శకుడు.
5. సుధీర్ బాబు
గతేడాది సమ్మోహనం లాంటి సినిమాతో విజయం అందుకున్న సుధీర్ బాబు ఆ తర్వాత వీరభోగ వసంతరాయలు సినిమా చేసాడు. ఈ చిత్రం డిజాస్టర్. ఆ తర్వాత మళ్లీ ఇప్పటి వరకు సినిమాలేవీ చేయలేదు సుధీర్ బాబు. ప్రస్తుతం ఇంద్రగంటి దర్శకత్వంలో వి సినిమా చేస్తున్నాడు. ఇందులో నాని విలన్ గా నటిస్తుంటే.. సుధీర్ హీరో. వచ్చే ఏడాది సినిమా విడుదల కానుంది.
6. సుశాంత్
అక్కినేని మేనల్లుడు సుశాంత్ కూడా 2019లో కనిపించలేదు. గతేడాది ఈయన చిలసౌ సినిమాతో పర్లేదనిపించాడు. ఆ సినిమా తర్వాత మళ్లీ మాయం అయిపోయాడు. ప్రస్తుతం అల వైకుంఠపురములో సినిమాతో కారెక్టర్ ఆర్టిస్ట్ అయిపోయాడు సుశాంత్.
7. నితిన్
వరస సినిమాలు చేస్తున్నాడు కానీ ఒక్కటి కూడా విడుదల చేయలేకపోయాడు నితిన్. ఈ ఏడాది భీష్మ సినిమాతో రావాలనుకున్న కూడా కుదర్లేదు. దాంతో శ్రీనివాస కళ్యాణం తర్వాత నితిన్ నుంచి మరో సినిమా రాలేదు. ప్రస్తుతం భీష్మ. రంగ్ దే, చదరంగం సినిమాలతో బిజీగా ఉన్నాడు నితిన్. ఈ ఏడాది గద్దలకొండ గణేష్ సినిమాలో గెస్ట్ రోల్ చేసాడు నితిన్.
8. అల్లరి నరేష్
2019లో మహర్షి సినిమాలో మహేష్ స్నేహితుడిగా నటించాడు నరేష్. కానీ హీరోగా మాత్రం ఈయన కనిపించలేదు. ఒకప్పుడు ఏడాదికి మూడు నాలుగు సినిమాలు చేసిన నరేష్.. గత రెండేళ్లుగా అస్సలు ఆ జోరు చూపించలేదు. ప్రస్తుతం ఒకటి అరా సినిమాలతోనే బిజీగా ఉన్నాడు అల్లరోడు.
9. నారా రోహిత్
ఒకప్పుడు ఏడాదికి అరడజన్ సినిమాలు చేసిన నారా రోహిత్ ఇప్పుడు మళ్లీ పూర్తిగా ఫేడవుట్ అయిపోయాడు. ఈయన సినిమాలు కనీసం సెట్స్ పైకి కూడా రావడం లేదు. 2020లో కూడా నారా రోహిత్ నుంచి సినిమాలు ఊహించడం కష్టమే.
10. రవితేజ
మాస్ రాజా రవితేజ మరోసారి భారీ గ్యాప్ తీసుకున్నాడు. 2018లో అమర్ అక్బర్ ఆంటోనీ సినిమా తర్వాత మరో సినిమా చేయలేదు ఈయన. డిస్కో రాజా డిసెంబర్ లోనే రావాల్సి ఉన్నా కూడా జనవరి 24కి పోస్ట్ పోన్ చేసారు దర్శక నిర్మాతలు. దాంతో ఈ ఏడాది ఖాళీగా మిగిలిపోయింది.
11. సుమంత్
ఎన్టీఆర్ కథానాయకుడు, మహానాయకుడు సినిమాల్లో నాగేశ్వరరావు పాత్రలో నటించాడు సుమంత్. ఇది మినహా 2019లో ఈయన సినిమాలేవీ లేవు. గతేడాది సుబ్రమణ్యపురం, ఇదమ్ జగత్ సినిమాలు చేసిన సుమంత్.. ఈ ఏడాది మాత్రం ఏ సినిమాలోనూ నటించలేదు. ప్రస్తుతం ఒకట్రెండు సినిమాలతో బిజీగా ఉన్నాడు అక్కినేని మేనల్లుడు.