English   

ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ 2019.. సత్తా చూపించిన రంగస్థలం, మహానటి..

film
2019-12-22 10:47:13

ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ 2019 ప్రకటించారు. అందరూ అనుకున్నట్లుగానే రంగస్థలం, మహానటి సినిమాలకు అవార్డుల పంట పండింది. మరికొన్ని సినిమాలు కూడా ఇందులో సత్తా చూపించాయి. మరి వాళ్లెవరో.. ఆ సినిమాలేంటో చూద్దాం..

ఉత్తమ నటుడు: రామ్ చరణ్ కెరీర్‌‌లో ఉత్తమ చిత్రం రంగస్థలం. ఈ సినిమాకు ఎన్నో ప్రశంసలు వచ్చాయి. ఇక ఇప్పుడు ఫిల్మ్‌ఫేర్ ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్నాడు మెగా వారసుడు.

ఉత్తమ చిత్రం: మహానటి సినిమాకు ఫిల్మ్ ఫేర్ అవార్డ్ వచ్చింది. ఉత్తమ చిత్రంగా తెలుగు ఇండస్ట్రీ నుంచి మహానటి ఈ అవార్డు అందుకుంది.

ఉత్తమ దర్శకుడు: మహానటి సినిమాను అద్భుతంగా తెరకెక్కించిన నాగ్ అశ్విన్ 2019కి గానూ ఉత్తమ దర్శకుడిగా ఎంపికయ్యాడు.

ఉత్తమ జ్యూరి నటుడు: దక్షిణాది ఇండస్ట్రీలో మంచి నటుడిగా పేరు తెచ్చుకున్నాడు దుల్కర్ సల్మాన్. మహానటితో ఈయన తెలుగు ఇండస్ట్రీకి కూడా పరిచయం అయ్యాడు. ఈ సినిమాలో నటనకు గానూ ఉత్తమ నటుడిగా స్పెషల్ జ్యూరి అందుకున్నాడు.

ఉత్తమ నటి: మహానటి సినిమాతో ఉత్తమ నటిగా నేషనల్ అవార్డ్ అందుకున్న కీర్తి సురేష్.. ఇప్పుడు ఫిల్మ్‌ఫేర్ కూడా సొంతం చేసుకుంది. గతంలో కూడా కీర్తి మహానటి సినిమాకు చాలా అవార్డులు సొంతం చేసుకుంది.

ఉత్తమ జ్యూరి నటి: గీత గోవిందం సినిమాలో నటనకు గానూ రష్మిక మందన్న ఉత్తమ నటిగా స్పెషల్ జ్యూరి అందుకుంది. ఈ చిత్రంతోనే రష్మిక తెలుగులో స్టార్ హీరోయిన్ అయిపోయింది.

ఉత్తమ సహాయ నటుడు: జగపతిబాబు కారెక్టర్ ఆర్టిస్టుగా మారిన తర్వాత అవార్డులు క్యూ కడుతున్నాయి. ఇప్పుడు అరవింద సమేత సినిమాలో ఈయన నటనకు గానూ ఫిల్మ్ ఫేర్ ఉత్తమ సహాయ నటుడిగా అవార్డు సొంతం చేసుకున్నాడు.

ఉత్తమ సహాయ నటి: రంగస్థలంలో అద్భుతమైన నటనతో అందర్నీ ఆకట్టుకుంది యాంకర్ అనసూయ. అప్పటి వరకు గ్లామర్ షో మాత్రమే చేస్తూ వచ్చిన అను.. రంగస్థలంలో రంగమ్మత్తగా అదరగొట్టింది. ఈ కారెక్టర్‌తో తన క్రేజ్ మరింత పెంచుకుంది. ఇప్పుడు ఉత్తమ సహాయనటిగా అనసూయ ఫిల్మ్ ఫేర్ సొంతం చేసుకుంది.

ఉత్తమ సంగీత దర్శకుడు: దేవీ శ్రీ ప్రసాద్ ఖాతాలో మరో ఫిల్మ్ ఫేర్ చేరిపోయింది. రంగస్థలంలో అద్భుతమైన ట్యూన్స్ ఇచ్చిన దేవీకి ఈ అవార్డ్ వరించింది.

ఉత్తమ గేయ రచయిత: 2018లో వచ్చిన సినిమాల్లో రంగస్థలం పాటలు మార్మోగిపోయాయి. ముఖ్యంగా ఎంత సక్కగున్నవే సాంగ్ అయితే ఊపేసింది. ఈ పాటను రాసింది చంద్రబోస్. ఈ లిరిక్స్‌కు ఈయనకు ఉత్తమ లిరిసిస్ట్ అవార్డ్ అందుకున్నాడు.

ఉత్తమ గాయకుడు: తెలుగులోనే కాదు.. మొత్తం సౌత్ ఇండియాలో ఇప్పుడు మెస్మరైజింగ్ వాయిస్ ఎవరైనా ఉన్నారా అంటే అది మరో అనుమానం లేకుండా సిధ్ శ్రీరామ్. ఈయన గీత గోవిందంలో పాడిన ఇంకేం ఇంకేం కావాలి పాటకు ఎంత రెస్పాన్స్ వచ్చిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇదే పాటకు ఇప్పుడు ఫిల్మ్ ఫేర్ గెలుచుకున్నాడు సిధ్ శ్రీరామ్.

ఉత్తమ గాయని: శ్రేయా ఘోషల్ తెలుగులో కూడా ఎన్నో పాటలు పాడింది. గతేడాది అనుష్క నటించిన భాగమతి సినిమాలో మందార పాటకు ఉత్తమ గాయనిగా ఫిల్మ్ ఫేర్ అవార్డ్ సొంతం చేసుకుంది.

More Related Stories