English   

2019లో ఫ్లాపుల నుంచి బయటపడిన హీరోలు వీళ్లే..

Tollywood Heroes
2019-12-24 17:35:12

ప్రతీ హీరోకు ఫ్లాపులు ఉంటాయి. వాటి నుంచి ఎప్పుడెప్పుడు బయటపడాలా అని చూస్తుంటారు వాళ్లు. ఇక కొందరు హీరోలకు 2019 బాగా కలిసొచ్చింది. ఎప్పట్నుంచో వేధిస్తున్న ఫ్లాపుల నుంచి వాళ్లు బయటపడ్డారు. ఈ ఏడాది వాళ్లు నటించిన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లు సాధించాయి. ఇందులో అందరికంటే ముందున్నాడు బెల్లంకొండ శ్రీనివాస్. ఈయన ఐదేళ్ల నిరీక్షణ తర్వాత రాక్షసుడు సినిమాతో విజయం మొహం చూసాడు. ఈ చిత్రానికి తొలిరోజే టాక్ అద్భుతంగా రావడంతో మంచి వసూళ్లే రాబట్టింది. చివరికి అమ్మిన దానికంటే రెండు కోట్లు ఎక్కువే తీసుకొచ్చి లాభాలు రాబట్టింది. ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్. ఇక నేను శైలజ తర్వాత సరైన విజయం కోసం చూస్తున్న 

రామ్.. 2019లో ఇస్మార్ట్ శంకర్‌తో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. పూరీ తెరకెక్కించిన ఈ చిత్రం సంచలన విజయం సాధించింది. ఇప్పటికే 75 కోట్ల గ్రాస్.. 38 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది. సాయి ధరమ్ తేజ్ తన పేరు మార్చుకుని హిట్ కొట్టాడు. సుప్రీమ్ తర్వాత అరడజన్ ఫ్లాపులు ఇచ్చిన ఈ హీరో.. ధరమ్ పీకేసి సాయి తేజ్ అంటూ వచ్చి చిత్రలహరి సినిమాతో విజయం అందుకున్నాడు. ఈ సినిమాతో పాటు ఇప్పుడు వచ్చిన ప్రతిరోజూ పండగే సినిమా కూడా మంచి విజయమే సాధించింది. ఈ చిత్రం నాలుగు రోజుల్లోనే 14 కోట్ల షేర్ వసూలు చేసింది. 

నాగచైతన్య కూడా చాలా ఏళ్ళ తర్వాత బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. రారండోయ్ వేడుక చూద్దాం తర్వాత చేసిన యుద్ధం శరణం, శైలజా రెడ్డి అల్లుడు, సవ్యసాచి సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. ఈ ఏడాది మజిలీ సినిమాతో హిట్ కొట్టాడు చైతూ. ఈ సినిమా దాదాపు 35 కోట్ల వరకు షేర్ వసూలు చేసింది. ఈ సినిమాతో పాటు వెంకీ మామ కూడా మంచి విజయమే సాధించింది. ఈ చిత్రం కూడా 32 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది. కళ్యాణ్ రామ్ కూడా ఈ ఏడాది హిట్ కొట్టాడు. ఈయన నటించిన 118 సినిమా మంచి విజయం అందుకుంది. 10 కోట్ల బిజినెస్ చేసిన ఈ చిత్రం 11 కోట్లు వసూలు చేసింది. 

ఇక వెంకటేష్ కూడా 2019లో రెండు విజయాలు అందుకున్నాడు. ఈయన నటించిన వెంకీ మామా సినిమాతో పాటు ఎఫ్ 2 కూడా మంచి విజయాలు అందుకున్నాయి. ఈ రెండూ నిర్మాతలకు లాభాలు తీసుకొచ్చాయి. నాని కూడా రెండు ఫ్లాపుల తర్వాత 2019లో విజయం అందుకున్నాడు. కృష్ణార్జున యుద్ధం, దేవదాస్ తర్వాత ఈ ఏడాది నటించిన జెర్సీ సినిమాతో విమర్శకుల ప్రశంసలతో పాటు విజయం కూడా అందుకున్నాడు. కానీ గ్యాంగ్ లీడర్ సినిమాతో దారుణంగా నిరాశ పరిచాడు న్యాచురల్ స్టార్. మొత్తానికి ఈ ఏడాది కుర్ర హీరోలతో పాటు సీనియర్లు కూడా చాలా మంది ఫ్లాప్స్ నుంచి బయటపడ్డారు.

More Related Stories