English   

ఆ విషయంలో 2019 చరిత్రలో నిలిచిపోయింది తెలుసా..

tollywood
2019-12-27 19:10:29

చూస్తుండగానే 2019 చివరి దశకు వచ్చేసింది. మరో మూడు రోజుల్లో 2020 మన ముందుకు వస్తోంది. అయితే వెళ్తూవెళ్తూ 2019 తెలుగు ఇండస్ట్రీలో ఒక అద్భుతమైన రికార్డు వెంటబెట్టుకుని వెళుతుంది. దాదాపు పదిహేనేళ్లుగా ఊరిస్తున్న ఈ రికార్డు 2019లో పూర్తయింది. అంతగా ఎదురుచూసేలా చేసిన ఆ రికార్డు ఏంటో తెలుసా.. టాలీవుడ్ నలుగురు సీనియర్ హీరోలు నటించిన సినిమాలు ఒకే ఏడాది విడుదల కావడం. గత కొన్నేళ్లుగా అది జరగడం లేదు. ఎందుకంటే చిరంజీవి రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత కేవలం బాలకృష్ణ నాగార్జున వెంకటేష్ మాత్రమే సినిమాలు చేశారు. పదేళ్లకు పైగా అన్నయ్య సినిమాలకు గ్యాప్ ఇచ్చారు. దాంతో ఒకే ఏడాది చిరంజీవి వెంకటేష్ బాలకృష్ణ నాగార్జున నటించిన సినిమాలు విడుదల కాలేదు. 2019 లో ఈ రికార్డ్ సాధ్యమైంది.
ఈ ఏడాది మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా నరసింహారెడ్డి విడుదలైంది. సురేందర్ రెడ్డి తెరకెక్కించిన ఈ సినిమా దాదాపు 142 కోట్ల షేర్ వసూలు చేసింది. అయితే తెలుగులో మినహా మిగిలిన భాషలలో సైరా దారుణంగా నిరాశపరిచింది. ఇక బాలకృష్ణ నటించిన మూడు సినిమాలు 2019లో విడుదలయ్యాయి. తన తండ్రి ఎన్టీఆర్ బయోపిక్ కథానాయకుడు సినిమాతో సంక్రాంతికి వచ్చాడు బాలకృష్ణ. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా అత్యంత దారుణంగా డిజాస్టర్ అయ్యింది. కేవలం 19 కోట్లు మాత్రమే వసూలు చేసి డిస్ట్రిబ్యూటర్లకు 50 కోట్ల వరకు ముంచేసింది కథానాయకుడు. ఇక మహానాయకుడు సినిమా కూడా అంతే. బాలయ్య కెరీర్ లోనే ఇంతకంటే పెద్ద డిజాస్టర్ మరొకటి లేదు. ఏడాది చివర్లో రూలర్ అంటూ వచ్చి మరో డిజాస్టర్ సినిమా ఇచ్చాడు బాలకృష్ణ.
ఇక నాగార్జున 2019లో మన్మధుడు 2 సినిమాతో వచ్చాడు. రాహుల్ రవీంద్రన్ తెరకెక్కించిన ఈ సినిమా నాగ్ కెరీర్లోనే అతి పెద్ద డిజాస్టర్స్ లో ఒకటిగా నిలిచింది. 60 ఏళ్ల వయసులో ఆ రొమాన్స్ ఏంటి అంటూ నాగార్జునపై విమర్శలు కూడా వచ్చాయి. ఈ ముగ్గురు సీనియర్ హీరోలతో పాటు వెంకటేష్ కూడా ఈ ఏడాది తన సినిమాల విడుదల చేశాడు. అయితే వాళ్ళ మాదిరి కాకుండా వెంకీ 2019 లో రెండు విజయాలు అందుకున్నాడు. సంక్రాంతికి ఎఫ్ 2.. డిసెంబర్లో వెంకీమామ సినిమాలతో వచ్చి బాక్సాఫీస్ దగ్గర సందడి చేశాడు విక్టరీ హీరో. ఈ రెండు సినిమాలు ప్రేక్షకులను బాగానే మెప్పించాయి. ఏదేమైనా కూడా టాలీవుడ్ లో నలుగురు సీనియర్ హీరోలు ఒకే ఏడాది తన సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రావడం మాత్రం అభిమానులకు ఎప్పటికీ మర్చిపోలేని కానుక. కొన్నేళ్లుగా అది జరగడం లేదు.. ఎట్టకేలకు 2019లో ఆ సీన్ ప్రత్యక్షమయింది. దాంతో అభిమానులు పండగ చేసుకున్నారు. అలా 2019 ఒక రేర్ రికార్డుకు నెలవుగా మారింది.

More Related Stories